టీ20 వరల్డ్ కప్ 2022లో భారత్ పాక్ ఫైనల్లో ఆడతాయా..?

టీ20 వరల్డ్ కప్ 2022లో భారత్ పాక్ ఫైనల్లో ఆడతాయా..?

టీ20 వరల్డ్ కప్ 2022 తుది అంకానికి చేరుకుంది. అనూహ్య సంఘటనలు, ట్విస్టులు, పరిణామాల మధ్య సెమీస్కు నాలుగు జట్లు ఎంటరయ్యాయి.  గ్రూప్ 1 నుంచి ఇంగ్లాండ్, న్యూజిలాండ్ సెమీస్కు చేరుకోగా...గ్రూప్ 2 నుంచి భారత్, పాక్ జట్లు సెమీస్ లోకి అడుగపెట్టాయి. అయితే ఇంగ్లాండ్, న్యూజిలాండ్, భారత జట్లు మిగతా జట్ల మ్యాచులతో సంబంధం లేకుండా సెమీస్కు దూసుకెళ్తే..పాక్ మాత్రం అదృష్టంతో సెమీస్ బెర్తును దక్కించుకుంది. నెదర్లాండ్స్ చేతిలో సౌతాఫ్రికా ఓడిపోవడంతో..అనూహ్యంగా పాకిస్తాన్ సెమీస్కు చేరుకుంది. 

సెమీస్లో ఎవరితో ఎవరు..?
బుధవారం జరిగే తొలి సెమీఫైనల్స్ గ్రూప్ 1 లో టాప్ ప్లేస్లో ఉన్న న్యూజిలాండ్తో గ్రూప్  2లో టాప్ 2లో నిలిచిన పాకిస్తాన్ అమీ తుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ గనక న్యూజిలాండ్ను ఓడిస్తే ఫైనల్స్కు చేరుకుంటుంది. అటు గురువారం రెండో సెమీస్ జరుగుతుంది. ఇందులో  భారత్, ఇంగ్లాండ్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో టీమిండియా ఇంగ్లాండ్ను ఓడిస్తే ఫైనల్కు వెళ్తుంది. ఇదే జరిగితే ఫైనల్ చిరకాల ప్రత్యర్థులైన భారత్ , పాక్ మధ్య జరగనుంది. 

కివీస్ను  పాక్ ఓడిస్తుందా...?
న్యూజిలాండ్ను ఓడించడం పాక్కు కత్తిమీద సామే. ప్రస్తుతం కివీస్ భీకరఫాంలో ఉంది. కేన్ సేనపై విజయం సాధించాలంటే పాక్ సర్వశక్తులు ఒడ్డాల్సిందే. అయితే న్యూజిలాండ్ కు నాకౌట్ ఫోబియా ఉంది. ఐసీసీ టోర్నీల్లో అద్భుతంగా రాణించే న్యూజిలాండ్ నాకౌట్లో మాత్రం చతికిలపడుతుంది. ఆ జట్టు 2015, 2019, 2021 ప్రపంచకప్లలో వరుసగా ఫైనల్స్లోనే ఓడి రన్నరప్గా నిలిచింది. ఇది పాక్కు కలిసిరానుంది. 

ఇంగ్లాండ్ను ఇండియా నిలువరించేనా..?
టీ20 వరల్డ్ కప్లో ఇంగ్లాండ్ బలమైన జట్టుగా ఉంది. సూపర్ 12లో ఆ జట్టు ఐర్లాండ్ చేతిలో ఓడటం మినహా..మిగతా అన్ని మ్యాచుల్లో ఇంగ్లాండ్ అద్భుతంగా రాణించినందని చెప్పాలి. దుర్భేద్యమైన బ్యాటింగ్, బలమైన బౌలింగ్ లైనప్ ఇంగ్లాండ్ సొంతం. ఆంగ్లేయుల టీమ్ లో 10వ నెంబర్ వరకు బ్యాటింగ్ చేయగలరు. దీనికి తోడు..బెన్ స్టోక్స్, వోక్స్, మార్క్ వుడ్, సామ్ కర్రన్, అదిల్ రషీద్, లివింగ్ స్టోన్ వంటే వరల్డ్ క్లాస్ బౌలర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో అన్నింట్లోనూ బలంగా ఉన్న ఇంగ్లండ్ను నిలువరించాలంటే టీమిండియా తన సత్తా చూపించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ పాక్ .. న్యూజిలాండ్ను..ఇంగ్లాండ్ను భారత్ ఓడిస్తే... దాయాదులు ఫైనల్లోకి చేరుకుంటారు. 

2007 రిపీట్ అవుతుందా..?
2007లో తొలిసారిగా టీ20 వరల్డ్ కప్ జరిగింది. తొలిసారిగా రెండు జట్లు గ్రూప్ దశలో తలపడ్డాయి. ఈ మ్యాచ్ టై అయింది. బౌలౌట్లో పాక్పై భారత్ విజయం సాధించింది. ఫైనల్లోనూ చిరకాల ప్రత్యర్థులు మరోసారి ఢీకొట్టుకున్నాయి. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు..20 ఓవర్లలో 5 వికెట్లకు 157 పరుగులు చేసింది. 158 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన  పాకిస్తాన్ 19.3 ఓవర్లలో 152 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత్ 5 పరుగుల తేడాతో గెలిచి తొలి టీ20 వరల్డ్ కప్ విజేతగా అవతరించింది. 15 ఏళ్ల తర్వాత ఈ సీన్ రిపీట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈసారి కూడా భారత్, పాకిస్తాన్ ఫైనల్ చేరుకోవాలని...ఫైనల్లో మరోసారి పాక్ను ఓడించి రోహిత్ సేన విశ్వవిజేతగా నిలవాలని అభిమానులు కోరుకుంటున్నారు.