
న్యూఢిల్లీ: ఇండియా 2047లో వందవ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఆంతకుముందే మనదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలన్నది నరేంద్ర మోడీ ప్రభుత్వ ఆలోచన. ఈ విషయమై ఇటీవల నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో చర్చ జరిగింది. ఈ టార్గెట్‌ను చేరుకోవడానికి ఉన్న సవాళ్లు, అవకాశాలు, అనుకూలతలు ఏంటో చూద్దాం.
మన ఆర్థిక వ్యవస్థ ఎంత వేగంగా వృద్ధి చెందాలి?
తలసరి స్థూల జాతీయ ఆదాయం (జీఎన్ఐ) ఆధారంగా, ప్రపంచ బ్యాంకు దేశాలను తక్కువ, దిగువ- మధ్య, ఎగువ -మధ్య, అధిక- ఆదాయ దేశాలుగా వర్గీకరిస్తుంది. భారతదేశం ప్రస్తుత జీఎన్ఐ 2,170 డాలర్లు ఉంది. అంటే మనది తక్కువ- మధ్య ఆదాయ దేశం. అధిక- ఆదాయ దేశంగా మారడానికి ఇది రెండు దశలను దాటవలసి ఉంటుంది-. 13,205 డాలర్ల కంటే ఎక్కువ జీఎన్ఐ ఉంటే అధిక -ఆదాయ దేశం అవుతుంది. భారతదేశపు తలసరి జీఎన్ఐ గత 25 సంవత్సరాలలో స్థాయిలోనే పెరిగితే మాత్రం సంపన్న దేశంగా మారడం కష్టమని ఎకనమిక్ ఎక్స్పర్టులు చెబుతున్నారు. మనం కోరుకుంటున్న మైలురాయిని చేరుకోవాలంటే రానున్న కాలంలో భారతదేశ జీడీపీ 9–-10 శాతం వృద్ధి చెందాలి.
ప్లాన్ ఎలా ఉండే అవకాశం ఉంది?
ఆర్థిక వ్యవస్థకు, మానవాభివృద్ధికి కీలకమైన ఏడు నుంచి ఎనిమిది రంగాలపై ప్రభుత్వం దృష్టి సారించనుందని సమాచారం. ఉద్యోగ కల్పనకు చిన్న వ్యాపారాలకు మద్దతు ఇవ్వనుంది. దీనివల్ల తయారీ, ఎగుమతులలో వృద్ధి ఉంటుంది. ఆగ్రో, ఫుడ్ ప్రాసెసింగ్, క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్‌పై కూడా ప్రభుత్వం ఫోకస్ చేస్తోంది. అలాగే ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ ర్యాంకును మరింత పెంచుకుంటున్నది. కార్మికుల్లో, ఉద్యోగుల్లో మహిళల సంఖ్యను పెంచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
దేశానికి ఏమేం అనుకూలం?
భారతదేశంలో యువ జనాభా ఎక్కువ. పని వయస్సు జనాభా (15-–64 సంవత్సరాలు) 2065 నుంచి మాత్రమే తగ్గిపోతుంది. దీనర్థం ఎక్కువ మంది యువ భారతీయులు వర్క్ ఫోర్స్‌లోకి వస్తారు. డబ్బు సంపాదించడం పెరుగుతుంది. ఫలితంగా డిమాండ్ పెరగడం వల్ల దేశం మరింత ముందుకు వెళ్తుంది. వృద్ధుల సంఖ్య వేగంగా పెరుగుతున్న చైనాకు ఇటువంటి అవకాశం లేదు. అక్కడ పనిచేసే జనాభా తగ్గుతోంది. రెండవది, అభివృద్ధి చెందిన దేశాలు చైనా అవతల తయారీ ప్లాంట్లను విస్తరించాలని చూస్తున్నాయి. దీనివల్ల మనదేశానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయి.
భారత్ అవసరమైన స్థాయిలో వృద్ధి చెందగలదా?
భారతదేశం 2000 లలో చెప్పుకోదగ్గ వృద్ధి రేటును నమోదు చేసింది. ఇది 2010లలో మందగించింది. భారతదేశం తన తలసరి ఆదాయాన్ని 520 డాలర్ల నుంచి 1,000 డాలర్లకు పెంచడానికి 2003-04 నుంచి 2008-09 వరకు కేవలం ఐదు సంవత్సరాలు పట్టింది. ఫలితంగా 'తక్కువ ఆదాయం' దేశం అనే ముద్ర తొలగిపోయింది. అయితే ఆదాయాన్ని మరోసారి రెట్టింపు చేయడానికి 10 సంవత్సరాలు పట్టింది. కరోనా మహమ్మారి దాడికి ముందే ఇది జరిగింది. 2024-25 నుంచి 2026-27 వరకు 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలనే మరో టార్గెట్‌ను కూడా కేంద్రం విధించుకుంది. అయితే కోవిడ్ కారణంగా గ్రోత్ చాలా నెమ్మదించింది. ఆర్థిక వ్యవస్థ పుంజుకున్నప్పటికీ, బేస్ విస్తరిస్తున్నందున గ్రోత్‌రేటును కొనసాగించడం అంత సులభం కాదు.