బరిలో నిలిచేదెవరు? సోదరుడా..? తమ్ముడి కుమారుడా?

బరిలో నిలిచేదెవరు? సోదరుడా..? తమ్ముడి కుమారుడా?
  • బరిలో నిలిచేదెవరు?
  • సోదరుడా..? తమ్ముడి కుమారుడా?
  • పోటీపై అసద్ మాటల ఆంతర్యమేమిటి?
  • అసెంబ్లీకి పోటీ చేస్తారా.. వేరే రాష్ట్రానికి వెళ్తారా!
  • హైదరాబాద్ ఎంపీ స్థానంపై ఎంఐఎంలో చర్చ
  • హాట్ టాపిక్ గా మారిన ఓవైసీ వ్యాఖ్యలు

హైదరాబాద్ : ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఈ సారి లోక్ సభకు పోటీ చేయరా..? లేదా వేరే రాష్ట్రం నుంచి పోటీ చేస్తారా..? అనేది పతంగ్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు ఎంఐఎం వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. తాను 2024 ఎన్నికల్లో హైదరాబాద్ ఎంపీ స్థానం నంచి పోటీ చేస్తానో..? లేదో తనకే తెలియదంటూ వ్యాఖ్యానించడం గమనార్హం. పార్టీలో చాలా మంది అర్హులున్నారనడం సంచలనంగా మారింది. 

నగరంలో ఇటీవల నిర్వహించిన ర్యాలీలో ఒవైసీ మాట్లాడుతూ ‘ఈసారి ఎన్నికల్లో ఎవరు పోటీ చేస్తారనే దానిపై తుది నిర్ణయం తీసుకోలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కూడా టికెట్ వస్తుందో రాదో తెలియదు. నిజాయితీగా, ప్రతి ఒక్కరూ అర్హులైన అభ్యర్థులే. నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో నేను పోటీ చేస్తానో లేదో కూడా తెలియదు’అనడం చర్చనీయాంశంగా మారింది. 

హైదరాబాద్ పార్లమెంటు స్థానం నలభై సంవత్సరాలుగా ఈ స్థానం ఎంఐఎం కంచుకోటగా ఉంది. 1984 లో అసదుద్దీన్ తండ్రి సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ తొలిసారి ఎంపీగా గెలుపొందారు. తర్వాత 1999 వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో ఈ పార్లమెంటు స్థానం నుంచి సలావుద్దీన్ విజయం సాధించారు. ఆ తర్వాత 2004 నుంచి ఇప్పటి వరకు అసదుద్దీన్ ఓ వైసీ హైదరాబాద్ ఎంపీగా కొనసాగుతూనే ఉన్నారు. ఎంఐఎం పార్టీకి హైదరాబాద్ కంచుకోటగా కొనసాగుతోంది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఈ సెగ్మెంట్ పతంగ్ పార్టీదేనన్నది అందరికీ తెలిసిన విషయమే. 

ఇంత బలమైన నియోజకవర్గం నుంచి తాను పోటీ చేస్తానో..? లేదో..? అంటూ అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అన్ని రాజకీయ పార్టీల దృష్టి ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల మీద పడింది. ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్న రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, బండి సంజయ్ అసెంబ్లీకి పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కొత్త ప్రభాకర్ రెడ్డికి బీఆర్ఎస్ ఇప్పటికే దుబ్బాక టికెట్ ను కేటాయించింది. ఈ నేపథ్యంలో అసదుద్దీన్ కూడా అసెంబ్లీకి పోటీ చేస్తారా? అన్న చర్చ మొ దలైంది. 

అదే జరిగితే ఎంఐఎం కంచుకోటగా ఉన్న హైదరాబాద్ పార్లమెంటు స్థానం నుంచి సోదరుడు అక్బరుద్దీన్ ఓవైసీని బరిలోకి దింపుతారా..? సోదరుడి కుమారుడు డాకర్టర్ నూరుద్దీన్ ఓవైసీతో పోటీ చేయిస్తారా..? అన్నది హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే మహారాష్ట్ర, యూపీలో ఎంఐఎం పలు అసెంబ్లీ, మున్సిపల్ స్థానాల్లో గెలిచింది. పార్టీ విస్తరణలో భాగంగా అసదుద్దీన్ యూపీలోగానీ మహారాష్ట్రాలోగానీ పోటీ చేస్తారా..? అన్న చర్చ కూడా కొనసాగుతోంది. 

ఇద్దరు సిట్టింగ్ లకు టికెట్లు కట్.. ఒకరు షిఫ్ట్..

ప్రస్తుతం ఎంఐఎంకు ఏడుగురు శాసభన సభ్యులున్నారు. వారిలో ఇద్దరు సిట్టింగుల టికెట్లకు కోత పడనుందని తెలుస్తోంది. చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్, యాకుత్ పురా ఎమ్మెల్యే అహ్మద్ పాషాఖాద్రీకి ఈ సారి టికెట్ల దక్కక పోవచ్చనే వార్త చక్కర్లు కొడుతోంది. ఈ స్థానాల్లో ఎవరు పోటీ చేస్తారనేది ఇంకా తేలలేదు. ఈ రెండింటిలో ఏదో ఒక స్థానం నుంచి అక్బరుద్దీన్ కుమారుడు నూరొద్దీన్ ఓవైసీని బరిలోకి దింపుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మేరాజ్ ను వేరే సెగ్మెంట్ కు మార్చే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అక్కడ ఎవరికి అవకాశం లభిస్తుందనే చర్చకూడా ఎంఐఎంలో కొనసాగుతోంది.