ముంబై, చెన్నై, న్యూయార్క్ : 2100లో మునుగుతాయా!

ముంబై, చెన్నై, న్యూయార్క్ : 2100లో మునుగుతాయా!

క్లైమేట్ చేంజ్. ప్రపంచాన్ని భయపెడుతున్న అతిపెద్ద సమస్య ఇది. దీన్ని ఎలా అదుపు చేయాలో, పరిష్కారాన్ని అసలు ఎక్కడి నుంచి మొదలుపెట్టాలో తెలీక సైంటిస్టులు, రీసెర్చర్లు తలలు బాదుకుంటున్నారు. ఒకవైపు గ్రీన్ హౌస్ గ్యాస్ ఉద్గారాలు పెరిగిపోవడం, మరోవైపు అడవులు అంతరించిపోతుండటంతో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. మంచుకొండలు కరిగిపోతున్నాయి. దీంతో సముద్ర మట్టాలు ఏటేటా పెరిగిపోతున్నాయి. క్రమక్రమంగా తీర ప్రాంతాలు ముంపుకు గురవుతున్నాయి. కొన్ని దీవులు కనుమరుగవుతున్నాయి. పరిస్థితి ఇలానే కొనసాగితే తీర ప్రాంతాల్లో ఉన్న పెద్దపెద్ద నగరాలు మునిగిపోతాయని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. 2100 సంవత్సరం నాటికి ముంబై, చెన్నై, న్యూయార్క్, వంటి మహా నగరాలు ముంపుకు గురయ్యే ప్రమాదం ఉందని చెబుతున్నారు.

స్టడీ ఏం చెబుతోందంటే..?

22 మంది క్లైమేట్ ఎక్స్​పర్టులు సంయుక్తంగా ఈ స్టడీ నిర్వహించారు. ప్రస్తుతం వెలువడుతున్న గ్రీన్​హౌస్ గ్యాసుల వల్ల మంచుగడ్డలు కరిగి సముద్ర మట్టాలపై పడుతున్న ప్రభావాన్ని అంచనా వేశారు. ఒకవేళ పారిస్ అగ్రిమెంట్ లక్ష్యాలను ప్రపంచ దేశాలు అందుకున్నా, ఉష్ణోగ్రతల పెరుగుదల ఆగదు. అలా కాకుండా గ్రీన్​హౌస్ వాయు ఉద్గారాలను చెక్ చేయకుండా వదిలేయడం, ప్రస్తుత పరిస్థితి ఇలానే కొనసాగడం వల్ల ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే ప్రమాదముంది. దీంతో సీ లెవెల్స్ 2 మీటర్లకు పైనే పెరిగే అవకాశం ఉందని పీఎన్ఏఎస్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇదే జరిగితే ముంబై, చెన్నై, న్యూయార్క్, షాంఘై, మియామి వంటి నగరాలు ముంపుకు గురయ్యే ప్రమాదం ఉంది. క్లైమేట్ క్రైసిస్ వల్ల ప్రపంచ జనాభాపై పడే ప్రభావాన్ని కూడా రీసెర్చర్లు అనలైజ్ చేశారు. 2 మీటర్లకు పైగా నీటి మట్టాలు పెరిగితే 1.79 మిలియన్ల చదరపు కిలోమీటర్ల మేర భూమి సముద్రంలో కలిసిపోతుంది. 18.7 కోట్ల మందికి ముప్పువాటిళ్లనుంది.

సముద్ర మట్టాలు పెరిగిపోతున్నయ్

గ్రీన్ హౌస్ వాయువుల వల్ల అనుకున్న దానికంటే వేగంగా సముద్ర మట్టాలు పెరిగిపోతున్నాయని అమెరికాకు చెందిన ప్రొసీడింగ్స్ ఆఫ్ ది యూఎస్ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (పీఎన్ఏఎస్) చేసిన స్టడీలో వెల్లడైంది. ఇలానే కొనసాగితే పరిస్థితి ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని చెప్పింది. 2016 పారిస్ వాతావరణ ఒప్పందంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను అందుకున్నా, 2100 నాటికి ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టాలు ఒక మీటర్ వరకు పెరిగే అవకాశం ఉందని తెలిపింది. అదే పారిస్ అగ్రిమెంట్ లక్ష్యాలను అందుకోలేకపోతే, సీ లెవెల్స్ 2 మీటర్ల కన్నా ఎక్కువగా పెరిగే ప్రమాదముందని స్టడీ చేసిన సైంటిస్టులు అభిప్రాయపడ్డారు. ఇదే జరిగితే 2100 నాటికి ప్రపంచవ్యాప్తంగా తీర ప్రాంతాల్లో ఉన్న ప్రధాన నగరాలు ముంపుకు గురవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.