గోడమీద పొంగులేటి.. కాంగ్రెసా.. బీజేపీనా..? తేల్చుకోలేని మాజీ ఎంపీ

గోడమీద పొంగులేటి.. కాంగ్రెసా.. బీజేపీనా..? తేల్చుకోలేని మాజీ ఎంపీ

గోడమీద పొంగులేటి
కాంగ్రెసా.. బీజేపీనా..? తేల్చుకోలేని మాజీ ఎంపీ
కన్ ఫ్యూజన్ లో కార్యకర్తలు
పొంగులేటి నిర్ణయం కోసం ఎదురు చూస్తున్న జూపల్లి
ముగిసిన ముహూర్తాలు
మంచి రోజుల కోసం మరో నెల ఆగాల్సిందే!

పొంగులేటి అడుగులు కాంగ్రెస్ లోకా.. బీజేపీలోకా అనేది క్యాడర్ ను గందరగోళంలో పడేస్తోంది. ఇటూ మాజీ మంత్రి జూపల్లినీ ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. హస్తం పెద్దలతో మంతనాలు సాగిస్తూనే.. కమలనాథులతో టచ్ లో ఉన్నారని టాక్. పండితుల సూచన మేరకు తాను ఏ పార్టీలో చేరేది ఈ నెల 14న వెల్లడిస్తానని ప్రకటించిన ఆయన తన నిర్ణయాన్ని వాయిదా వేశారు. ఇవాళ నుంచి నెల రోజుల వరకు మంచి ముహూర్తాలు లేవు. ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే నెల రోజులు ఆగాల్సిందే..

హైదరాబాద్ : ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజకీయ భవితవ్యం ప్రస్తుతానికి గందరగోళంలో ఉంది. ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకొంటారా..? బీజేపీలో చేరుతారా..? అన్నది ఎటూ తేలలేదు. ఓ వైపు బీజేపీతో టచ్ లో ఉంటూనే కాంగ్రెస్ నాయకులతో మంతనాలు సాగించడం గమనార్హం. ఈ నెల 9న ఖమ్మంలో అనుచరులతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసిన శ్రీనివాసరెడ్డి తన నిర్ణయాన్ని 14వ తారీఖు ఉదయం హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి ప్రకటిస్తానని చెప్పారు. అనుచరులు ఆయన కాంగ్రెస్ లో చేరతారంటూ సంకేతాలిచ్చారు..? పొంగులేటి కూడా డైరెక్టుగా తాను ఏ పార్టీలో చేరాతాననేది చెప్పకుండా కార్యకర్తల అభిప్రాయాన్ని గౌరవిస్తానని వెల్లడించారు. 

మారిన పొలిటికల్ సీన్

పొంగులేటి ఆత్మీయ సమ్మేళనం తర్వాత రాజకీయ పరిణామాలు వేగంగా మారాయి. గత శనివారం మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మల్లు రవితో జూపల్లి, కూచుకుళ్ల దామోదర్ రెడ్డితో మరో నేత భేటీ అయి మంతనాలు జరిపారు. కర్నాటక పీసీసీ చీఫ్​ డీకే శివకుమార్ నుంచి పిలుపు రావడంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు బెంగళూరుకు వెళ్లారు. అక్కడ ఏమేం విషయాలు మాట్లాడుకున్నారనేది తెలియలేదు.

బెంగళూరు సమావేశం ముగిశాక ఆదివారం హైదరాబాద్ లో కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పొంగులేటి, జూపల్లి భేటీ అయ్యారు. కోమటిరెడ్డి నివాసానికి శ్రీధర్ బాబుతో కలిసి పొంగులేటి చ్చారు. పొంగులేటి మీడియా కంట పడకుండా వెళ్లిపోగా.. జూపల్లి మీడియాతో మాట్లాడుతూ..‘టీ తాగడానికి మాత్రమే కోమటిరెడ్డి దగ్గరికి వచ్చాను. ఏ పార్టీలో చేరుతామనేది ఇంకా డిసైడ్ కాలేదు. త్వరలోనే నిర్ణయం తీసుకుంటాను’అని చెప్పారు.

సీట్ల సర్దుబాటు సాధ్యమా..?

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 సీట్లు కోరే అవకాశం ఉంది. ఆ జిల్లాలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ముఖ్యంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి సొంత జిల్లా కావడం గమనార్హం. దీనితో పాటు ఆయన కంటోన్మెంట్ సీటునూ తన వర్గానికే కేటాయించాలని పొంగులేటి కోరుతున్నట్టు సమాచారం. మొత్తంగా ఆయన 11 సీట్లు కోరుతున్నారు. 

ముహూర్తాల్లేవ్..!

సహజంగా ముహూర్తాలు నమ్మే పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. ఈ నెల 14వ తేదీన ఏకాదశి తిథితో కూడిన అశ్వనీ నక్షత్రం ఉండటంతో విజయం కలుగుతుందని భావించారు. ఆ రోజు ఉదయం 10.30 గంటలకు అసలు విషయాన్ని వెల్లడిస్తానని 9వ తేదీన ఖమ్మంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ప్రకటించారు. ముందుగా వెల్లడించిన 14వ తేదీ రోజు విషయాన్ని ప్రకటించక వాయిదా వేశారు. ఎప్పుడనేది ఇంకా చెప్పనేలేదు.

శుక్రవారం (జూన్ 16న) ఉదయం 8.41 గంటలకు చతుర్దశి మొదలైంది. శనివారం ఉదయం వరకు చతుర్దశి... ఆపై అమావాస్య ఉంటుంది. తర్వాత ఆషాడమాసం స్టార్టవుతుంది. సో ఇప్పట్లో మంచి మూహూర్తాలు లేవు. ముహూర్తాల కోసం పొంగులేటి ఇంకా నెల రోజులు ఆగాల్సిందే. అప్పటికి ఎన్నికల హడావుడి మరింత ఊపందుకుంటుంది. ఇంతకూ పొంగులేటి ఏం చేయబోతున్నారు..? ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది తెలియక క్యాడర్ గందరగోళంలో పడింది. పొంగులేటి నిర్ణయం కోసం మాజీ మంత్రి జూపల్లి కూడా వెయిటింగ్ లో ఉన్నారు.