త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్లు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్లు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

మధిర, వెలుగు: త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. టీఎస్‌‌‌‌పీఎస్సీ ప్రక్షాళన మొదలైందని,  చైర్మన్‌‌‌‌తో పాటు కమిటీ సభ్యుల నియామకం పూర్తి చేశామని అన్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించి.. ఉద్యోగాల నియామకాలను పారదర్శకంగా చేపడతామని చెప్పారు. ప్రశ్నపత్రాలు లీక్ కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటామన్నారు. శనివారం మధిర మండలం బయ్యారంలో రూ. 20 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని, చిలుకూరు స్కూలులో అదనపు తరగతి గదులను, నిదానపురంలో హెల్త్ సబ్​సెంటర్‌‌‌‌‌‌‌‌ను భట్టి ప్రారంభించారు.

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర సంపదను లూటీ చేసి లక్షల కోట్ల అప్పుల భారం మోపిందని మండిపడ్డారు. అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రాన్ని గట్టెక్కించడానికి మొక్కవోని ధైర్యంతో తాము కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. ‘‘సంపదను ప్రజలకు పంచేందుకు 6 గ్యారంటీలను ప్రకటించాం. అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని కల్పించాం. 

రాజీవ్ ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచాం” అని వివరించారు. గత ప్రభుత్వ హయాంలో మంత్రులు పర్యటనలకు వస్తే ప్రతిపక్ష లీడర్లను అరెస్ట్ చేసేవారని, ఇప్పుడా పరిస్థితి లేదని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే వాళ్లు ఉండాలని, అందుకే ధర్నా చౌక్‌‌‌‌ను తెరిపించామని తెలిపారు. పెత్తందారీ పోకడలతో కాకుండా ప్రజలకు జవాబుదారీగా పనిచేయడమే ఇందిరమ్మ రాజ్యమన్నారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధిలో భాగంగా వ్యవసాయం, ఇరిగేషన్, ఐటీ, పారిశ్రామిక రంగాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు చెప్పారు. విద్య, ఉద్యోగ, ఉపాధి, వైద్య, మౌలిక సదుపాయాలకు పెద్ద పీట వేస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై అవాకులు చవాకులు పేలుతున్న బీఆర్ఎస్ కు దిమ్మ తిరిగేలా మరో రెండు గ్యారంటీలు అమలు చేయబోతున్నామని చెప్పారు.