విజయ్.. కింగా.. కింగ్ మేకరా ? డీఎంకేను ఢీకొట్టడం విజయ్‌‌‌‌కు అంత ఈజీ కాదు.. కానీ..

విజయ్.. కింగా.. కింగ్ మేకరా ? డీఎంకేను ఢీకొట్టడం విజయ్‌‌‌‌కు అంత ఈజీ కాదు.. కానీ..

తమిళనాడులో విజయ్  కొత్తపార్టీ  టీవీకే.. అధికార  డీఎంకేను దెబ్బతీస్తుందా  లేక  ఏఐడీఎంకే  విజయాన్ని దెబ్బతీస్తుందా అన్న అంశంపై అందరిలో ఆసక్తి నెలకొంది. తమిళనాడు  రాజకీయ చరిత్రలో  వెండితెర వెలుగులు సింహాసనాన్ని అధిరోహించడం కొత్తేమీ కాదు. ఎంజీఆర్,  జయలలిత నుంచి కరుణానిధి వరకూ  సినీ నేపథ్యం ఉన్నవారే ఆ రాష్ట్ర రాజకీయాలను దశాబ్దాలపాటు శాసించారు. ఇప్పుడు అదే బాటలో ‘దళపతి’ విజయ్ తన రాజకీయ ప్రయాణాన్ని మొదలుపెట్టారు.

2026 అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నవేళ విజయ్ కింగ్ మేకర్‌‌‌‌గా మారతారా లేక  నేరుగా  కింగ్‌‌‌‌గా  అవతరిస్తారా అనే చర్చ సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది.  తమిళనాడు రాజకీయాల్లోకి  తమిళగ  వెట్రి కళగం (టీవీకే) పార్టీతో  విజయ్​ అడుగుపెట్టడం  ఒక  సంచలనం. 2026 అసెంబ్లీ  ఎన్నికలే లక్ష్యంగా ఆయన  వేస్తున్న అడుగులు  దశాబ్దాల కాలంగా  కొనసాగుతున్న ద్రవిడ రాజకీయ సమీకరణాలను మారుస్తాయా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

దశాబ్దాలుగా  తమిళనాడు రాజకీయం డీఎంకే, ఏఐఏడీఎంకేల చుట్టూనే తిరుగుతోంది.  అయితే,  ప్రస్తుతం ప్రజల్లో ఒక కొత్తమార్పు కోసం తపన కనిపిస్తోంది.  ముఖ్యంగా యువత,  తొలిసారి ఓటువేసే ఓటర్లు విజయ్ వైపు  మొగ్గు చూపుతున్నారు.   విజయ్  తన  ప్రసంగాల్లో అటు డీఎంకేను ‘రాజకీయ శత్రువు’గా,  ఇటు బీజేపీని ‘సైద్ధాంతిక శత్రువు’గా పేర్కొంటూ తనదైన మార్కు చూపిస్తున్నారు. 

అవినీతి లేని పాలన, పెరియార్, అంబేద్కర్ ఆశయాలే  తన బాట అని స్పష్టం చేయడం ద్వారా ద్రవిడ సిద్ధాంతాన్ని పుణికిపుచ్చుకుంటూనే  కొత్తదనం చూపిస్తున్నారు. ఇటీవలి పారావీల్ సర్వే ప్రకారం   డీఎంకే,  ఏఐఏడీఎంకే తర్వాత  టీవీకే  మూడో అతిపెద్ద శక్తిగా ఎదిగే అవకాశం ఉంది. సుమారు 13- నుంచి 15 శాతం  ఓట్ల శాతాన్ని  విజయ్ సాధించగలిగితే, ఏ పార్టీకి స్పష్టమైన  మెజారిటీ రాని పక్షంలో ఆయన ‘కింగ్ మేకర్’ పాత్ర పోషించడం ఖాయం. ఒకవేళ ఏఐఏడీఎంకే బలం తగ్గి, ఆ ఓట్లు విజయ్ వైపు మళ్ళితే సమీకరణాలు పూర్తిగా మారిపోవచ్చు.

సవాళ్లు, వాస్తవాలు
పటిష్టమైన క్యాడర్ ఉన్న డీఎంకేను ఢీకొట్టడం విజయ్‌‌‌‌కు అంత సులభం కాదు.  సీట్ల పంపకాలు, అభ్యర్థుల ఎంపిక, క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం విజయ్ రాజకీయ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. అలాగే, డీఎంకే, ఏఐఏడీఎంకే వంటి బలమైన శక్తుల మధ్య ఓట్లు  చీలిపోతే,  అది ఎవరికి  లాభం చేకూరుస్తుందనేది వేచి చూడాలి. 

విజయ్ కేవలం కింగ్ మేకర్‌‌‌‌గా ఉండిపోవడానికి ఇష్టపడటం లేదు. ఆయన నేరుగా ‘మెజారిటీ’ సాధించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. ఒకవేళ  ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ దక్కకపోతే, తమిళనాడు తదుపరి ముఖ్యమంత్రిని నిర్ణయించే పవర్​ విజయ్ చేతిలోనే ఉంటుంది.  విజయ్ కేవలం 'ఓట్ల చీలికదారు'గా  మిగిలిపోతారా  లేక  'కింగ్ మేకర్' లేదా 'కింగ్'  అనేది మే 4వ తేదీన ఫలితాలు తెలపనున్నాయి.  అయితే,  ఆయన రాకతో తమిళనాడు రాజకీయాల్లో ఒక కొత్త ఉత్సాహం, పోటీ నెలకొన్నమాట మాత్రం  వాస్తవం.

​ద్రవిడ ద్వైపాక్షికతకు సవాల్
​గత కొన్నేళ్లుగా తమిళనాడులో  డీఎంకే,   అన్నాడీఎంకే  మధ్యే అధికారం మారుతూ వస్తోంది.  విజయ్ రాకతో ఈ 'ద్వైపాక్షిక' ధోరణికి గండిపడే అవకాశం ఉంది. ఆయన అవినీతి వ్యతిరేకత, ద్రవిడ సిద్ధాంతాల మేళవింపుతో కొత్త రాజకీయ  ఒరవడిని సృష్టించాలని చూస్తున్నారు.

ముఖ్యంగా అధికార పార్టీపై  వ్యతిరేకత ఉన్న యువ ఓటర్లను ఆకర్షించడంలో విజయ్ సఫలమైతే అది ఓట్ల చీలికకు దారితీస్తుంది. తమిళనాడులో 18- ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్య ఉన్న ఓటర్ల సంఖ్య చాలా ఎక్కువ. విజయ్ కున్న 'మాస్' ఇమేజ్ ఈ వర్గాన్ని పార్టీ వైపు తిప్పుకునే అవకాశం ఉంది.  తమిళనాడులో  కుల రాజకీయాలు  బలంగా ఉంటాయి.  విజయ్ ఏ వర్గాలను  కలుపుకొని  వెళ్తారనే దానిపైనే పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.

తమిళనాడులో మూడో అతిపెద్ద రాజకీయపార్టీగా..
​సినిమా క్రేజ్ వేరు, ఓట్ల రాజకీయం వేరు. ఇప్పటికే  కమల్ హాసన్ వంటి వారు రాజకీయాల్లోకి వచ్చినా  అధికారం సాధించలేకపోయారు.  క్షేత్ర స్థాయిలో పార్టీ పటిష్టం చేయడం విజయానికి అసలైన  గీటురాయి. తమిళనాడు 2026 అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే ) ఓట్లశాతంపై  వివిధ  రాజకీయ సర్వేలు ఆసక్తికరమైన అంచనాలను వెలువరించాయి. 

పారావీల్ సర్వే అంచనాల ప్రకారం విజయ్ పార్టీ 13.6 శాతం  ఓట్ల షేర్ సాధించి తమిళనాడులో మూడో అతిపెద్దపార్టీగా అవతరించే అవకాశం ఉంది.  టీవీకే పార్టీ వర్గాల  సమాచారం ప్రకారం.. వారు 30 శాతం  కంటే ఎక్కువ ఓట్ల షేర్ సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కొన్ని విశ్లేషణలు టీవీకేకు 31.7 శాతం వరకు ఓట్లు వచ్చే ఛాన్స్ ఉందని పేర్కొన్నాయి.

రాజకీయ విశ్లేషకులు విజయ్ రాక వల్ల ప్రధానంగా డీఎంకే. ఏఐడీఎంకేలకు  నష్టం జరుగుతుందని భావిస్తున్నారు. దాదాపు 18-–35 ఏళ్ల మధ్య ఉన్న యువ ఓటర్లలో మెజారిటీ ఓట్లు విజయ్ వైపు మళ్లే అవకాశం ఉంది. ముఖ్యంగా చెన్నై, మదురై, తిరుప్పూర్ వంటి నగరాల్లో టీవీకే  బలంగా పుంజుకుంటోంది. చెన్నైలోని కొన్ని నియోజకవర్గాల్లో రెండో అతిపెద్ద  పార్టీగా ఎదిగే అవకాశం ఉందని సర్వేలు చెబుతున్నాయి.  మైనారిటీ వర్గాల్లో కూడా విజయ్​కు ఆదరణ పెరుగుతోందని కొన్ని సర్వేలు సూచిస్తున్నాయి. టీవీకే  ఒంటరిగా పోటీ చేస్తే, అది కేవలం 'ఓట్లను చీల్చే పార్టీగా మారుతుందా, లేక నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుతుందా అన్నది వేచి చూడాలి.

జి. శ్రీకాంత్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్

* ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ openpage@v6velugu.com

* రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.

* రచన 700 పదాలకు మించరాదు.