ట్విట్టర్కు ఇవే చివరి రోజులా?

ట్విట్టర్కు ఇవే చివరి రోజులా?

జాక్ డోర్సే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మోటోతో తీసుకొచ్చిన ట్విట్టర్ సోషల్ మీడియా దిగ్గజాల్లో ఒకటిగా ఎదిగింది. హాష్ ట్యాగ్ ట్రెండ్ క్రియేట్ చేసింది. భావ వ్యక్తీకరణ, ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలన్నా.. సమస్యలను చర్చకు పెట్టాలన్నా ట్విట్టర్ ను ఆశ్రయించే స్థాయికి ఎదిగింది. బిజినెస్ మ్యాన్లకు మార్కెటింగ్ టూల్ గా, ప్రజలు, ప్రభుత్వాలకు మధ్య మాధ్యమంగా మారింది. అలాంటి ట్విట్టర్ భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఎలాన్ మస్క్ టేకోవర్ చేసుకున్న తర్వాత జరుగుతున్న పరిణామాలు సంస్థ మనుగపై కొత్త సందేహాలు తలెత్తేలా చేశాయి. ఇంతకీ ఆ ‘సంస్థ ఉంటుందా? మూతపడుతుందా?’ అనే ప్రశ్నలు అందరి మెదళ్లను తొలిచేస్తున్నాయి. నిజానికి మస్క్ ట్విట్టర్ ను కొనుగోలు చేస్తానని ప్రకటించినప్పటి నుంచి అది హాట్ టాపిక్ అయింది. ఎవరి నోట విన్నా ట్విట్టర్ మాటే వినిపిస్తుంది.

బ్యాన్ చేస్తారనుకుని..

ఎలన్ మస్క్ ట్విట్టర్ ను సోషల్ మీడియా యాప్ లాగా కాకుండా మార్కెటింగ్ టూల్ లా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి ట్విట్టర్ లో ఆయనకున్న ఫేమ్ కారణంగా ఒక్క ట్వీట్ చేస్తే చాలు క్రిప్టో కరెన్సీతో పాటు ఇతర కంపెనీల షేర్లు డమాల్ అనేవి. మస్క్ పెట్టిన పోస్టుల్లో చాలా వరకు వివాదాస్పదమే. అందుకే యూఎస్ సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్, మస్క్ ట్వీట్ పెట్టేముందు వెరిఫై చేయించుకోవాలని చెప్పింది. అదే సమయంలో వివాదాల కారణంగా 2021లో ట్విట్టర్ ట్రంప్ ను జీవిత కాలం బ్యాన్ చేసింది. తరువాత ట్విట్టర్ మాజీ సీఈఓ పరాగ్ అగర్వాల్ కూడా ట్వీట్ల విషయంలో మస్క్ ను హెచ్చరించాడు. అది చూసి మస్క్, ట్రంప్ లా తనను కూడా బ్యాన్ చేస్తారని అనుకున్నాడు. ఆ సందేహమే మస్క్ ట్విట్టర్ ని కొనుగోలు చేసేలా చేసింది.  ఏప్రిల్ నెలలో ట్విట్టర్ లో 9శాతం షేర్లని కొన్న మస్క్ ఆ తర్వాత బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో ఒకడిగా మారి, ‘ట్విట్టర్ లో ఏం మార్పులు కావాలం’టూ ఆడియెన్స్ పోల్స్ పెట్టాడు. ఆ ట్వీట్ల వల్ల బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తో జరిగిన గొడవల్లో ట్విట్టర్ ను కొనుగోలు చేస్తున్నట్టు ప్రకటించాడు. మళ్లీ కొన్నాళ్లకు కొనుగోలు చేయట్లేదని ట్వీట్లు పెట్టాడు. అది చూసి ట్విట్టర్ యాజమాన్యం మస్క్ పై కోర్ట్ లో కేసులు పెట్టింది. ఫలితంగా ఎలాన్ మస్క్ అక్టోబర్ 27న 44 బిలియన్ డాలర్లకు ట్విట్టర్ ను సొంతం చేసుకున్నాడు.  

ఉద్యోగుల తొలగింపు

ట్విట్టర్ చేతిలోకి రాగానే పదేండ్లుగా ట్విట్టర్ లో పనిచేస్తున్న సీఈఓ పరాగ్ అగర్వాల్, లీగల్ పాలసీ ట్రస్ట్ అండ్ సేఫ్టీ విభాగం అధిపతిగా ఉన్న విజయ గద్దెతో పాటు ఇతర కీలక సభ్యులను పదవులనుంచి తొలగించి ‘పక్షికి స్వేచ్ఛ లభించింది’ అని ట్వీట్ చేశాడు. తర్వాత ఇతర ఉద్యోగుల్ని పదవుల నుంచి తొలగిస్తున్నట్టు వచ్చిన వార్తలు మొదట ఖండించి, తర్వాత  చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నెడ్ సెగల్ తో పాటు మొదటి రౌండ్ లో 25 శాతం మందిని ఉద్యోగాలనుంచి తొలగించాడు. భారీ నష్టాల భర్తీకి ఈ నిర్ణయాలు తీసుకుంటున్నాని చెప్తూ, బ్లూ టిక్ సబ్ స్క్రిప్షన్ న ప్రపోజల్ తీసుకొచ్చాడు. ఇది కూడా పెద్ద వివాదమే అయింది. మొదట బ్లూ టిక్ కావాలంటే నెలకు 20 డాలర్లు చెల్లించాలన్న మస్క్ ఆ తర్వాత దాన్ని 8 డాలర్లకు తగ్గించాడు. ఫేక్ అకౌంట్లను గుర్తించడానికి బ్లూ టిక్ ఉన్నవాళ్లు మళ్లీ రీ వెరిఫికేషన్ తీసుకోవాలని ప్రకటించాడు. బ్లూ టిక్ పేయిడ్ సబ్ స్క్రిప్షన్ రాగానే చాలామంది హ్యకర్స్ సెలబ్రెటీల పేర్లతో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి జనాలతో ఆడుకున్నారు. దాని వల్ల చాలా తప్పులు జరిగాయి. ఎలి లిల్లీ అనే కంపెనీ ఏకంగా మిలియన్ డాలర్ల షేర్లు కోల్పోయింది. దాంతో కొన్ని రోజులు సబ్ స్క్రిప్షన్ ని ఆపేసి, కొత్త పాలసీ, సెక్యూరిటీ ఫీచర్లతో నవంబర్ 29 నుంచి అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు ప్రకటించాడు.  

కొత్త కొత్త కండీషన్లు

రోజుకో కొత్త నిర్ణయంతో ట్విట్టర్ ఉద్యోగులకు, యూజర్లకు షాక్ ఇస్తున్నాడు మస్క్. ట్విట్టర్ అభివృద్ధి కోసం మిగిలిన ఉద్యోగులంతా వారంలో 7 రోజులు, రోజుకు 12 గంటలు పనిచేయాలనే కండీషన్ పెట్టాడు. ఈ నిర్ణయం నచ్చకపోతే జాబ్ వదిలిపోవచ్చని సూచించాడు. తర్వాత కొన్ని రోజులకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ట్విట్టర్ ఆఫీస్ లను మూసివేయాలని సంతకం చేయని నోటీసులు ఇచ్చాడు. దీంతో పాటు ట్విట్టర్ లో  రెవెన్యూ కన్నా  ఖర్చు ఎక్కువైందనీ దాని కోసం కాస్ట్ కటింగ్ కోసం పెద్ద మొత్తంలో ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్టు చెప్పాడు. ఈ మేరకు ఉద్యోగులకు మెయిల్స్ పంపి వాళ్లందరికీ మూడు నెలల జీతం ఇచ్చి పంపేశాడు. ఇచ్చాడు. తర్వాత అడ్వర్టైజింగ్, మార్కెటింగ్, హెచ్ ఆర్ డివిజన్లలో పనిచేసే వారితో పాటు మొత్తం 3,738 మందిని కంపెనీ నుంచి బయటకు పంపాడు. 

ఎస్ చెప్పాల్సిందే

నవంబర్ 8న గతంలో తొలగించిన ఉద్యోగులు మళ్లీ తిరిగి రావాలని, తన ద్వారా తప్పు జరిగిందని కొంత మందికి మెయిల్ పంపాడు. ట్విట్టర్ లో కొత్త ఫీచర్ల కోసం మార్కెటింగ్, యాప్ డిజైనింగ్ డెవలప్మెంట్లలో మార్పుల కోసమే తొలగించిన ఉద్యోగుల్ని తిరిగి రావాలని కోరినట్లు చెప్పుకొచ్చాడు. మళ్లీ నవంబర్ 13న 4,400 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా తొలగించాడు. నవంబర్ 16న సింగిల్ క్వశ్చన్ తో కూడిన ఫాంను ఈ మెయిల్ ద్వారా పంపి, సాయంత్రం 5 గంటల్లోపు ఫాం ఫిల్ చేసి పంపాలని గడువు విధించారు. దానికి ఎస్ అనే ఆప్షన్ మాత్రమే ఇవ్వడంతో మస్క్ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేస్తూ చాలా మంది ఉద్యోగులు రాజీనామా చేసి వెళ్లిపోయారు. వాళ్లలో సీనియర్ ఎంప్లాయిస్ కూడా ఉన్నారు. ఇదిలా ఉండగా కంపెనీ డైరెక్టర్లకు, మేనేజర్ల సలహాలేవీ పాటించకుండా శుక్రవారం జరిగిన బోర్డ్ మీటింగ్ లో ప్రస్తుతమున్న వారిలో 50 శాతం మంది ఉద్యోగులపై వేటు వేస్తున్నట్టు ప్రకటించాడు. కొత్త బాస్ నిర్ణయాలతో ఆగ్రహంతో రగిలిపోతున్న ఉద్యోగులు ట్విట్టర్లో ‘రిప్ ట్విట్టర్’, ‘బై బై ట్విట్టర్’ అని హ్యాష్ ట్యాగ్స్  క్రియేట్ చేసి అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇవేవీ లెక్క చేయని ఎలాన్ మస్క్ మాత్రం తాను చేయాలనుకున్నది చేసుకుంటూ పోతున్నాడు. 

భవిష్యత్తుపై అనుమానాలు

ట్విట్టర్ లో ఎదురవుతున్న పరిణామాల వల్ల ట్విట్టర్ పోటీగా కొత్త యాప్స్ చాలా పుట్టుకొస్తున్నాయి. ‘భవిష్యత్తులో మేమే ట్విట్టర్ కు ఆల్టర్ నేటివ్’ అంటూ బహిరంగంగా అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకుంటున్నాయి. ట్విట్టర్ ఫౌండర్ జాక్ డోర్సే కూడా ట్విట్టర్ కు పోటీగా బ్లూ స్కై అనే యాప్ తీసుకురాబోతున్నాడు. ట్విట్టర్ ను వదిలేసిన ఉద్యోగులంతా కలిసి మస్క్ పై కోపంతో కొత్త కంపెనీపెట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తన అసంబద్ధ నిర్ణయాలతో ట్విట్టర్ ను ఆగమాగం చేస్తున్న మస్క్ ఇంతకీ కంపెనీని ఎలా నిలబెడతాడన్నది ప్రస్తుతం మిలియన్ డాలర్ క్వశ్చన్ గా మారింది. ఈ పరిణామాలన్నింటినీ గమనిస్తే మార్కెట్ వర్గాల్లో అసలు ట్విట్టర్ ఉంటుందా మూత పడుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.