స్క్రిప్ట్​​లోనే యాక్షన్ సీన్స్ కూడా...

స్క్రిప్ట్​​లోనే యాక్షన్ సీన్స్ కూడా...

‘విక్రమ్’ మూవీ షూటింగ్​కి ముందు ఫ్యాన్స్ అంచనాలను అందుకుంటానా? లేదా? అని ఒత్తిడి ఉండేది. నేను కమల్ సర్ ఫ్యాన్​ని. అందుకే ఆయనతో మూవీ చేయడం అనుకున్నంత ఈజీ కాదు. ‘విక్రమ్’ సినిమా కమల్ సర్ కెరీర్​లో మరో యాక్షన్ సినిమాలా కాకుండా, ఎప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయేలా డిఫరెంట్​గా తీయాలనుకున్నా. ముందు నా రైటింగ్​తో కమల్ సర్​ని ఇంప్రెస్ చేయాలనే ఒత్తిడి పడ్డాను. ఎందుకంటే... ‘విశ్వరూపం-2’ తర్వాత ఆరేండ్లుగా ఆయన ఏ సినిమా చేయలేదు. కాబట్టి, ఆయన స్క్రిప్ట్ పట్ల చాలా జాగ్రత్తగా ఉంటారు. నేను చెప్పిన కథ ఆయనకు నచ్చింది. ఆయన1986లో చేసిన ‘విక్రమ్’ మూవీలోని క్యారెక్టర్​ని నా ప్రపంచానికి సరిపోయేలా తీర్చిదిద్దాలనుకున్నా. ఈ కథ  రాయడానికి చాలా టైం పట్టింది. నిజానికి ఆయనకు చెప్పిన టైం కంటే చాలా ఎక్కువ టైం తీసుకున్నా. ఆయన చేతిలో బౌండ్ స్క్రిప్ట్ పెట్టాక ఏమంటారో అనుకున్నా. స్క్రిప్ట్​ చదివాక మెచ్చుకున్నారు. ‘ఇది మొత్తం నీ ప్రపంచంలాగే ఉంది. నేను ఒక నటుడిలాగే నీ ప్రపంచంలోకి అడుగుపెడతా’ అన్నారు. 

కొన్ని సినిమాల సంగతి రైటింగ్ స్టేజీలోనే ఎలా ఉంటాయనేది తెలిసిపోతుంది. కొన్ని సినిమాల గురించి తీసిన తర్వాతే చెప్పగలం. అలాగే ఈ సినిమా తీశాకే చెప్పగలిగే సినిమా అని కమల్ సర్​లోని రైటర్, డైరెక్టర్ గుర్తించారు. సూర్య, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ చేసిన రోల్స్ ఈ సినిమాలో చాలా ముఖ్యం. సినిమాలో ఇతర నటులకు ఉన్న స్పేస్​ని కూడా కమల్ సర్ అర్థం చేసుకున్నారు. వ్యక్తిగత సక్సెస్​ చూసుకోకుండా, సినిమా సక్సెస్​ కావాలని... అందరం ఇష్టపడి పనిచేశాం. ప్రేక్షకులకు సూర్య గెస్ట్ రోల్​తో సర్​ప్రైజ్ అనుకున్నాం. కానీ, ఆ న్యూస్ లీక్ అయింది. దాంతో మేం అఫీషియల్​గా చెప్పక తప్పలేదు. కథలో భాగంగానే సూర్యని తీసుకున్నామే కానీ, మార్కెట్ కోసం కాదు.

వెయ్యిమంది పని చేశారు

కథ చెప్పే విధానంలో ‘విక్రమ్’ మూవీ ఒక ప్రయోగం. రకరకాల క్యారెక్టర్స్, అందులో ఉండే లేయర్స్​తో డీల్ చేయడం కొంచెం కష్టమే. మొదటి భాగం మొత్తం మిస్టరీ, రెండో భాగం మొత్తం యాక్షన్. థియేటర్ ఎక్స్​పీరియెన్స్ కోసమే దీన్ని తీర్చిదిద్దాం. అందుకు మేం ఎంత కష్టపడ్డామో చెప్పాలంటే... మీకో ఎగ్జాంపుల్​ చెప్తా. మీకు పని ఉండి రాత్రంతా నిద్రపోలేదనుకోండి మరుసటి రోజు మీ దినచర్య తప్పుతుంది. అలాంటి వంద రోజులను ఊహించుకోండి. రోజూ సాయంత్రం మొదలుపెట్టి పొద్దున వరకు షూటింగ్​ చేసేవాడ్ని. దానివల్ల మెటబాలిజమ్ దెబ్బ తింటుంది. అది క్రియేటివ్ ప్రాసెస్​ మీద ప్రభావం చూపిస్తుంది. అయినా సరే, ‘విక్రమ్’ కోసం నటీనటులు, నా టీమ్ చాలా బాధ్యతగా, ఉత్సాహంగా పనిచేశారు. విక్రమ్ మూవీ ఎడిటింగ్ అయిపోయాక, కమల్ సర్​ని సినిమా చూడమని అడిగా. ‘ఇప్పుడు చూస్తే నాకు తప్పులే కనిపిస్తాయి’ అన్నారు. షూటింగ్​ జరిగేటప్పుడు మానిటర్​లో కూడా ఎప్పుడో ఒకసారే చూసేవారు.

షార్ట్ ఫిల్మ్ నుంచి వచ్చా

నాకు ఎలాంటి సినిమాటిక్ జర్నీ లేదు. తమిళనాడులోని కోయంబత్తూరు పక్కన ఉన్న చిన్న గ్రామంలో పుట్టా. అక్కడే స్కూల్లో చదువుకున్నా. తర్వాత కోయంబత్తూర్​లోని  ‘పీఎస్ జీ కాలేజీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్’ లో ఫ్యాషన్ టెక్నాలజీలో డిగ్రీ చదివా. డిగ్రీ తర్వాత ఎంబీఏ చేశా. కాలేజీలో చదువుకునే రోజుల్లో సినిమాల్లోకి  వెళ్లాలనే డ్రీమ్ ఉండేది. షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేసే అవకాశం వచ్చే వరకు నాలుగున్నరేండ్లు బ్యాంకులో పని చేశా.  2014లో ‘కస్టమర్ డిలైట్’ అనే షార్ట్ ఫిల్మ్ తీశా. కార్పొరేట్ ఫిల్మ్ కాంపిటీషన్​లో దానికి మొదటి ప్రైజ్​ వచ్చింది. ఆ కాంపిటీషన్ జడ్జి డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు. ఆయన పరిచయం అప్పుడే అయింది. 2016లో కార్తీక్ సుబ్బరాజు నిర్మించిన ‘అవియల్’ అనే ఇండిపెండెంట్ ఆంతాలజీ మూవీలో ఒక భాగమైన ‘కాలం’ అనే షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేశా. ఆ మూవీ టీజర్ విజయ్ సేతుపతి విడుదల చేశారు. అది తమిళనాడు, కేరళ, అమెరికాల్లో బాగా ఆడింది. అలా కార్తీక్ సుబ్బరాజు వల్ల ఇండస్ట్రీకి పరిచయమయ్యా.

చాలామందికి నచ్చలేదు

నా మొదటి సినిమా ‘మానగరం’ కథ ఎంతోమంది నిర్మాతలకు చెప్పా. కానీ, చాలా మందికి ఆ కాన్సెప్ట్ నచ్చలేదు. సరిగ్గా ఆ టైంలో నేను ఎస్.ఆర్ ప్రభుకి కథ చెప్పా. వెంటనే ఆయన ‘ఇలాంటి అద్భుతమైన కథకు నన్ను నిర్మాతగా చేస్తున్నందుకు థ్యాంక్స్ లోకేష్’ అన్నారు. 2017లో వచ్చిన ‘మానగరం’ నా మొదటి సినిమా. సందీప్ కిషన్, రెజీనా, శ్రీ నటించిన ఆ థ్రిల్లర్ మూవీ హిట్ అయింది. అదే సినిమా తెలుగులో ‘నగరం’ పేరుతో డబ్  అయింది.

హాలీవుడ్ మూవీస్ చూసేవాడిని

నేను అసిస్టెంట్ డైరెక్టర్​గా చేయలేదు. ఫిల్మ్ స్కూల్​కి కూడా వెళ్లలేదు.1990ల్లో ఎక్కువగా హాలీవుడ్ సినిమాలు చూసేవాడిని. వాటి ప్రభావం నా మీద ఎక్కువగా ఉంది. ఇప్పటి పిల్లలు మార్వెల్, డిస్నీ మూవీస్ ఎంత ఇష్టంగా చూస్తున్నారో, అలాగే నేను కూడా చిన్నప్పుడు  ‘ప్రిడేటర్’, ‘ర్యాంబో’, ‘టెర్మినేటర్’ లాంటి సినిమాల్ని చూసేవాడిని. బహుశా చిన్నప్పుడు వాటిపై పెంచుకున్న ఇష్టమే, నేను సినిమాల్లోకి రావడానికి కారణమైందేమో అనిపిస్తుంటుంది. కమల్ హాసన్ మూవీస్ చూసి ఫిల్మ్ మేకింగ్ నేర్చుకున్నా. నా సినిమాల్లో ఏ క్యారెక్టర్ తీసుకున్నా... అందులో కమల్ హాసన్ షేడ్స్ ఉంటాయి. కమల్ హాసన్ ప్రభావం నాపై విపరీతంగా ఉంది. నా సినిమాల్లో ఎక్కువభాగం రాత్రి వాతావరణం ఉంటుంది. అలాగెందుకంటే... బహుశా నాకెంతో ఇష్టమైన ‘ఊమై విజిగల్’ సినిమా ప్రభావం వల్ల కావొచ్చని చెప్తా.  

ఖైదీ కథ

ఖైదీ సినిమా వేరే యాక్టర్ కోసం రాసుకున్నా. కానీ, ఆ  ప్రాజెక్ట్​లోకి కార్తి రాగానే, దాని బడ్జెట్, స్కేల్​తో పాటు స్థాయి కూడా పెరిగింది. కార్తి ఉన్నప్పటికీ ఆ సినిమాను ఒక ప్రయోగంలాగే చూశా. హీరోయిన్, పాటలు లేకుండా సినిమా తీశా. కానీ, ‘మాస్టర్’ విషయంలో మాత్రం విజయ్ సర్ స్టార్​డమ్​ని గ్రాంటెడ్​గా తీసుకోలేదు. ఆయన్ను ఇంతకుముందు చూపించనట్టే చూపించాలనుకున్నా. ఆ స్టోరీకి తగ్గట్టే చూపించాలనుకున్నా. దానికి ఆయన ఒప్పుకున్నారు. అంతే బలంగా విలన్​ని తీర్చిదిద్దాలని, విజయ్ సేతుపతిని ఎంచుకున్నాం. అందుకే, అంతకుముందు విజయ్ సర్ చేసిన కమర్షియల్ సినిమాల్లో ఉండే ఫైట్ల లాంటి ఫైట్స్ అందులో ఉండవు.

ఒత్తిడేం ఉండదు

పెద్ద స్టార్స్​ని డైరెక్ట్ చేస్తే ఒత్తిడి ఉంటుందా? ఉండదా? అనేది వ్యక్తిగతంగా ఆ డైరెక్టర్ మీద ఆధారపడి  ఉంటుంది. డైరెక్టర్​కి తన జర్నీ గురించి స్పష్టమైన అవగాహన ఉన్నప్పుడు, భయపడాల్సిందేమీ ఉండదు. ఒకవేళ ఒక అడుగు వెనక్కి తగ్గి ‘మానగరం’ లాంటి మూవీ తీయాలనుకుంటే, కచ్చితంగా తీస్తా. డైరెక్టర్​కి ఇష్టం లేనివాటిని తీయమని ఎవ్వరూ ఒత్తిడి చెయ్యరు. ‘మానగరం’ మూవీకి ముందు చాలా కష్టపడ్డా. తొమ్మిదేండ్ల కష్టానికి ఇప్పుడు ఫలితం దక్కుతోంది. విజయ్ లాంటి స్టార్​తో పనిచేసే అవకాశం వస్తుందని కలలో కూడా అనుకోలేదు. ఇప్పుడు రెండోసారి ఆయనతో ‘దళపతి 67’ మూవీకి కూడా పని చేయబోతున్నా! ఇక, కమల్ సర్​తో పని చేయాలనే ఆలోచన నాకు అప్పుడు లేదు. ఆళ్వార్​పేట్​లో ఉన్న  సామ్కో హోటల్ బయట నిలబడి, ఆయన కనిపిస్తే చాలు అని ఎదురు చూసిన రోజులు ఎన్నో నా జీవితంలో ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు ఏకంగా కమల్ సర్​నే డైరెక్ట్ చేశానంటే నమ్మబుద్ధి కావడం లేదు. అప్పుడప్పుడు ఇది నిజమేనా అని గిల్లుకుంటుంటా.

అన్నీ ముందే రాసుకుంటా

కొరియోగ్రఫీ తప్ప యాక్షన్ సీన్స్​తో సహా ప్రతి ఒక్కటి పేపర్ మీద పెట్టాకే, సెట్​లో అడుగుపెడతా. యాక్షన్ సీన్స్​కు సంబంధించి బేసిక్ స్కెచ్ కూడా ఇచ్చేస్తా. నేను స్టంట్ డైరెక్టర్ అన్బరివ్​కి ఇవ్వగానే, ఆయన నన్ను హగ్ చేసుకొని ‘ నువ్వు అన్నీ రాసేశావు. ఇంక మా నుంచి ఏం కావాలి?’ అన్నారు.

వాళ్లపై గౌరవం పెరిగింది.

ఫహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. మనం యాక్షన్ చెప్పిన క్షణంలోనే ఫహద్ సర్ ఆ క్యారెక్టర్​లోకి వెళ్లిపోతారు. భాష రాకున్నా, నా వర్క్ స్టయిల్​ని వేగంగా అర్థం చేసుకున్నారు. ఆయన క్యారెక్టర్ గురించి చాలా రోజులు కూర్చొని చర్చించాం. ‘విక్రమ్’ సినిమాలో పాత్ర కోసం విజయ్ సేతుపతి అన్న తన బాడీ లాంగ్వేజ్, డిక్షన్ మార్చుకోవడానికి వర్క్ షాప్​కి వెళ్లారు.

తేడా ఏం ఉండదు

‘విక్రమ్’ మూవీని ముందుగా పాన్ ఇండియా మూవీ అనుకోలేదు. అయినా పాన్ ఇండియా అంటే ఏంటి? ఒక ప్రాంతీయ భాషా సినిమా, వేరే భాషల్లో కూడా విడుదలవుతుంది. ఉదాహరణకు ఖైదీ సినిమా రష్యన్ భాషలో డబ్ చేసి విడుదల చేశారు. పాన్ ఇండియా రిలీజ్ అనుకున్నప్పుడు నాకేం ఒత్తిడి అనిపించలేదు. అది కేవలం మార్కెట్ ఓరియెంటేషన్​ మాత్రమే. నా ప్రొడ్యూసర్స్ సంతోషంగా ఇంటికి వెళ్లాలనే గురించి తప్ప ఇంకే విషయం గురించి నాకు ఆందోళన ఉండదు. ఫ్యూచర్​లో  నా సినిమా యూనివర్స్​ని విస్తరించడానికి నా దగ్గర కొన్ని ప్లాన్స్​ ఉన్నాయి.
::: గుణ