దసరాకు సగం ‘ధరణి’ సిద్ధం

దసరాకు సగం ‘ధరణి’ సిద్ధం
  • దసరాకు సగం ‘ధరణి’
  • జనం నుంచి స్పందన అంతంతే..
  • 25న పోర్టల్‌ను లాంచ్ చేయనున్న సీఎం కేసీఆర్
  • ఇప్పటికీ సగమే ఆస్తుల డేటా ఎంట్రీ
  • గ్రేటర్ హైదరాబాద్‌లో 30 శాతమే నమోదు

హైదరాబాద్, వెలుగు: దసరాకు ‘ధరణి’ పోర్టల్​ను అందుబాటులోకి తెస్తామన్న సర్కారు సగం డేటాతోనే లాంచ్​ చేయనుంది. ఇంకా పెద్ద సంఖ్యలో ఆస్తుల నమోదు పెండింగ్​లోనే ఉంది. పూర్తి ఆస్తుల వివరాలు పోర్టల్ లో ఎంట్రీ చేసేందుకు చాలా టైం పడ్తుందని ఆఫీసర్లు చెప్తున్నారు. గ్రేటర్​ హైదరాబాద్, ఇతర మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలోని ఆస్తుల వివరాల నమోదు ఇప్పట్లో సాధ్యం కాదని స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతానికి గ్రామీణ ప్రాంతాల్లో వివాదాల్లేని ఆస్తులు, వ్యవసాయ భూముల వివరాలు మాత్రమే అప్​లోడ్​ చేస్తున్నారు. ఈ నెల 25న దసరా పండుగ రోజున సీఎం కేసీఆర్​ లాంఛనంగా ‘ధరణి’ పోర్టల్​ను ప్రారంభించనున్నారు.

పోర్టల్​లో ఉన్నవే రిజిస్ట్రేషన్

సెప్టెంబర్​ 6న రాష్ట్రంలో అన్ని రకాల ఆస్తుల రిజిస్ట్రేషన్లను నిలిపేసిన విషయం తెలిసిందే. కొత్త రెవెన్యూ చట్టం ప్రకారం అగ్రికల్చర్ ఆస్తులను తహసీల్దార్లు, నాన్ అగ్రికల్చర్ ఆస్తులను సబ్  రిజిస్ట్రర్లు రిజిస్ట్రేషన్ చేసి, వెంటనే మ్యుటేషన్ చేస్తారు. ఇందుకోసం ధరణి పోర్టల్ ను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ పోర్టల్ ఉన్న ఆస్తులను మాత్రమే రిజిస్ట్రేషన్ చేయాలని సర్కారు నిర్ణయించింది.

ఓపెన్ ప్లాట్ల డేటా ఉండదా?

ధరణి పోర్టల్‌‌లో అన్ని ఆస్తుల వివరాలు ఉంటాయని చెప్తున్న సర్కారు.. ఇప్పటివరకు ఓపెన్ ప్లాట్ల వివరాలు మాత్రం సేకరించలేదు. ఇప్పటివరకు ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తులు 20 లక్షలు దాటాయి. ఈ 20 లక్షల ప్లాట్ల ఓనర్లు దసరా తర్వాత తమ ప్లాట్లను విక్రయించేందుకు చాన్స్ ఉంటుందా? ధరణి పోర్టల్ లో వివరాలు లేకుండా రిజిస్ట్రేషన్ చేస్తరా? అన్న దానిపై ప్రభుత్వంలో క్లారిటీ లేదు. ధరణి ఆధారంగానే రిజిస్ట్రేషన్లు ఉంటాయంటే.. మరి ఓపెన్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ల కోసం ఏం చేయాలనే అంశంపై ఇంకా నిర్ణయం జరగలేదని ఓ అధికారి తెలిపారు.

ఎన్నికల తర్వాతే గ్రేటర్ ఆస్తుల వివరాల నమోదు

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పటివరకు కేవలం 30 శాతం ఆస్తుల వివరాలను మాత్రమే నమోదు చేశారు.  కొన్నిచోట్ల ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది. మరికొన్ని చోట్ల ఓనర్లు అందుబాటులో లేరు. మ్యుటేషన్ కాని అస్తులు పెద్ద సంఖ్యలో ఉండటం సమస్యగా మారింది. దీంతో ప్రస్తుతానికి హైదరాబాద్ లో ఆస్తుల నమోదు ప్రక్రియను నిలిపి వేసినట్టు తెలిసింది. ఎన్నికల తర్వాతే పూర్తి ఆస్తుల వివరాలను సేకరించాలని సర్కారు భావిస్తోంది. మ్యుటేషన్ కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. మిగతా మున్సిపల్ కార్పొరేషన్లు, మున్పిపాలిటీల్లోనూ ఇదే జరిగే అవకాశం కనిపిస్తోంది.

‘ధరణి’కి రెడీ కండి

కలెక్టర్లతో సీఎస్​ వీడియో కాన్ఫరెన్స్

ఈ నెల 25న దసరా పండుగ సందర్భంగా సీఎం కేసీఆర్​ ధరణి పోర్టల్​ను ప్రారంభించనున్నారని.. ఈ వెబ్​సైట్​ దేశంలోనే ట్రెండ్​ సెట్టర్​గా నిలుస్తుందని సీఎస్​ సోమేశ్​కుమార్​ అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్లు, అడిషనల్​ కలెక్టర్లు, తహసీల్దార్లతో సోమేశ్​ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ధరణి సేవలు అందించటానికి అవసరమైన సిబ్బందితో సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

ధరణిలో 75.74 లక్షల ఆస్తులు నమోదు

రాష్ట్రంలో శనివారం రాత్రి నాటికి పంచాయతీలు, మున్సిపాలిటీల్లో కలిపి 75.74 లక్షల ఆస్తుల నమోదు పూర్తయిందని సీఎస్‌ వెల్లడించారు. జీహెచ్ఎంసీ, ఇతర మున్సిపాలిటీల్లోని ఇళ్లు, ప్లాట్ల ఓనర్లు తమ ఆస్తుల వివరాలను www.npb.telangana.gov.inలో నమోదు చేసుకోవచ్చన్నారు. ఎన్నారైలు, ఓవర్సీస్​ సిటిజన్ ఆఫ్​ ఇండియా(ఓసీఐ), విదేశీయుల ఆస్తుల నమోదుకు త్వరలో ప్రత్యేక గైడ్ లైన్స్ జారీ చేస్తామన్నారు.

For More News..

స్టూడెంట్స్‌‌ టెన్షన్ పడొద్దు కొత్త సర్టిఫికెట్లు ఇస్తం

అవసరమైతే ఇండ్లకే వెళ్లి ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్ చేస్తం

కోలుకోకముందే.. కుమ్మరించింది.. సిటీలో మళ్లీ భారీ వర్షం