
- ప్రస్తుతం ప్రైవేట్‌లో7 వేలు కూడా దాటట్లే
- తేమ పేరుతో కొర్రీలు పెడ్తున్న సీసీఐ
- 8 నుంచి12 శాతం ఉంటేనే ధర రూ.7,020
- చేసేదిలేక ఇండ్లలోనే నిల్వ చేస్తున్న రైతులు
వెలుగు, నెట్వర్క్/మహబూబ్‌నగర్: రాష్ట్రంలో పత్తి రేట్లు పడిపోయాయి. గత సీజన్లో క్వింటాల్‌కు రూ.12 వేల నుంచి14 వేల వరకు ధర పలకగా.. ఈసారి రూ.7 వేలు మించట్లేదు. వ్యవసాయ మార్కెట్లకు తీసుకెళ్తే సీసీఐ తేమ పేరుతో కొర్రీలు పెడ్తోంది. మాయిశ్చర్ రీడింగ్ 8 నుంచి12 వరకు ఉంటేనే గరిష్టంగా రూ.7,020 చెల్లిస్తోంది. ఇదే అదనుగా ప్రైవేట్వ్యాపారులు సిండికేట్అయ్యారు. అంతర్జాతీయ మార్కెట్లో బేళ్లు, గింజల రేట్లు పడిపోయాయనే సాకులు చెప్తూ అడ్డికి పావుశేరు లెక్క కొంటున్నారు. రూ.6,500 నుంచి 6,900 వరకే పెడ్తున్నారు. ఆ రేటుకు అమ్మలేక రైతులు పత్తిని ఇండ్లలోనే నిల్వ చేస్తున్నారు.
రాష్ట్రంలో ఈసారి వానాకాలం సీజన్లో పత్తి సాగు గణనీయంగా తగ్గింది. సగటున 65 నుంచి70 లక్షల ఎకరాల్లో సాగు కావాల్సి ఉండగా, వర్షాలు ఆలస్యం కావడంతో కేవలం 45.03 లక్షల ఎకరాల్లోనే సాగైంది. గత రెండు మూడేండ్లతో పోల్చినప్పుడు రాష్ట్రంలో పత్తి సాగు భారీగా తగ్గింది. జులైలో ముంపు, ఆగస్టులో నీటి ఎద్దడి కారణంగా దిగుబడులు కూడా గణనీయంగా పడిపోయాయి. అరకొర దిగుబడులు వచ్చినప్పటికీ గతేడాది క్వింటాల్‌కు రూ.12 వేల నుంచి రూ.14 వేల దాకా పలకడంతో రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తీరా అంతర్జాతీయ మార్కెట్లో బేళ్లు, గింజల రేట్లు పడిపోయాయంటూ ఇక్కడి వ్యాపారులు రేట్లు తగ్గించేస్తున్నారు. సీజన్ మొదట్లో క్వింటాల్ పత్తికి రూ.8,200 నుంచి రూ. 8,500 దాకా పెట్టిన వ్యాపారులు పది రోజులుగా రూ.6,900 నుంచి రూ.6,600 వరకు చెల్లిస్తున్నారు. సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో 8 నుంచి 12 వరకు తేమ ఉంటేనే గరిష్టంగా రూ.7,020 చెల్లిస్తున్నారు. మంచు కారణంగా మాయిశ్చర్ రాకపోవడంతో కొనేందుకు నిరాకరిస్తున్నారు.
ఇండ్లల్లో నిల్వ చేసుకుంటున్నరు
సీసీఐ కేంద్రాల్లో కొనకపోవడం, బయట వ్యాపారులు రేటు పెట్టకపోవడంతో ఏం చేయాలో తోచని రైతులు పత్తిని ఇండ్లల్లో నిల్వ చేసుకుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోఈ ఏడాది 3.50 లక్షల ఎకరాల్లో పత్తి సాగుచేశారు. మొలకదశలో వర్షాల కారణంగా పంట దెబ్బ తినడంతో చాలా మంది రెండోసారి విత్తుకున్నారు. దీంతో పెట్టుబడులు రెండింతలయ్యాయి. తీరా అమ్ముకుందామంటే వ్యాపారులు సిండికేట్ గా మారి క్వింటాలకు కేవలం రూ.6,640 చెల్లిస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలో దళారులు రూ. 6 వేల నుంచి రూ.6,500 వరకు అడుగుతున్నారు. ఖమ్మం జిల్లాలోని పది జిన్నింగ్‌మిల్లుల్లో సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో రూ.7,020 మద్దతు ధరకు కొంటున్నారు. కానీ మాయిశ్చర్ రాక రైతులు ఇబ్బందులు పడ్తున్నారు. గతేడాది రూ.13 వేల రేటు పలకడంతో ఈసారి కూడా అదే రేటు వస్తుందని రైతులు ఆశలు పెట్టుకున్నారు. కానీ వ్యాపారులు రూ.6500కు మించి ధర పెట్టడం లేదు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో ప్రైవేట్ వ్యాపారులు సిండికేట్‌గా మారి రేట్లు తగ్గించేశారు. పాలమూరు జిల్లాలో ఈ సీజన్ మొదట్లో క్వింటాల్ పత్తికి రూ.8,500 నుంచి రూ.8,200 దాకా రేటు పెట్టారు. కానీ వారం, పదిరోజులుగా రూ.6,600కు కొంటున్నారు. కొంచెం నల్లబడిన పత్తికి రూ.4,200 నుంచి రూ.5 వేలలోపే చెల్లిస్తున్నారు. దీంతో జనవరిలో పెరుగుతాయనే ఆశతో రైతులు పత్తిని ఇండ్లలోనే నిల్వ చేస్తున్నారు.
రేటు లేక ఇంట్ల పోసినం..
మాది ఉమ్మడి కుటుంబం. కౌలుతో కలుపుకొని 25 ఎకరాల్లో పత్తి సాగు చేసినం. వర్షాలు సరిగ్గా లేక బోరు నీటితో పంట పండించినం. దాదాపు150 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. అమ్ముదామని చూస్తే రేట్లు లేవు. కష్టపడి సాగుచేసిన పంటను తక్కువ రేటుకు అమ్మితే కూలి కూడా పడది. అందుకే పంటను మొత్తం ఇంటి వద్దనే నిల్వ చేసినం.
‑ సుధాకర్, రైతు, ఉందేకోడ్ గ్రామం, నారాయణపేట జిల్లా
సగానికి తగ్గిన పత్తి దిగుబడి
నేను ఆరు ఎకరాల్లో పత్తి పంట వేసిన. రెండు లక్షలు పెట్టుబడి అయింది. 25 నుంచి-30 క్వింటాళ్ల పత్తి వచ్చింది. సగానికి పైగా దిగుబడి తగ్గింది. పత్తి ధర పెరుగుతుందేమోనని చూస్తే సగానికి పడిపోయింది. అమ్మితే పెట్టుబడి కూడా చేతికి వచ్చేటట్లు లేదు. ఏం చేయలో అర్థమైతలేదు.
‑ బాల మల్లేశం, రైతు, పారుపల్లి, యాదాద్రి జిల్లా
ఈ ఫొటోలోని రైతు పేరు కుసుంబ మల్లయ్య. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం అంకిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఈయన.. తన ఎకరం పొలంలో పత్తి సాగు చేశాడు. అష్ట కష్టాలు పడితే 8 క్వింటాళ్ల పత్తి చేతికొచ్చింది. సీసీఐ సెంటర్‌కు తీసుకెళ్తే తేమ ఎక్కువుందని చెప్పడంతో ప్రైవేటులో అడిగాడు. వాళ్లు రూ.6,200 రేటు చెప్పడంతో ధర వచ్చినప్పుడు అమ్ముకుందామని ఇంటికి తీసుకెళ్లి ఇట్ల నిల్వ చేశాడు.