
నల్గొండ/యదాద్రి, వెలుగు : ప్రాథమిక వ్యసాయ సహకార సంఘాలను రైతు ఉత్పత్తిదారుల సంస్థ(ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్) లుగా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. క్లస్టర్లవారీగా నిర్వహణ, బేస్ లైన్ సర్వే, ఏజెన్సీల అమలు, వ్యాపార ప్రణాళికల తయారీ, శిక్షణ కార్యక్రమాల నిర్వహణ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వం సహకార సంఘాలకు అప్పగించింది. ఎఫ్‌పీవోలు నిలదొక్కుకోవడానికి ఏడాదికి రూ.6 లక్షల చొప్పున మూడేండ్లలో రూ.18 లక్షల వరకు ఆయా రైతు ఉత్పత్తిదారుల సంస్థలకు చెల్లిస్తారు.
ఎఫ్‌పీవోలుగా మారిన పీఏసీఎస్ సభ్యులకు రూ.15 లక్షల వరకు మ్యాచింగ్ గ్రాంటును కూడా మంజూరు చేసింది. ఈ పథకానికి సంబంధించి ప్రత్యేక క్రెడిట్ గ్యారంటీ నిధి కింద నిధులను కేటాయించింది. ఎన్‌సీడీసీ, నాబార్డు ద్వారా ఈ పథకాన్ని అమల్లోకి తీసుకురానున్నారు. ఎఫ్‌పీవోలు ప్రధానంగా రైతుల ఆదాయం, ఉత్పత్తులను పెంచడం, ప్రాసెసింగ్ చేయడంపై దృష్టి సారిస్తుంది.
ఉమ్మడి జిల్లాలో తొలి విడతలో 36 సొసైటీలు..
ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం 107 సొసైటీలు ఉన్నాయి. నల్గొండ జిల్లాలో 42, సూర్యాపేట జిల్లాలో 44, యాదాద్రి భువనగిరి జిల్లాలో 21 ప్రాథమిక సహకార సంఘాలు ఉన్నాయి. వీటిలో తొలి విడత 36 సొసైటీలను ఎఫ్‌పీవోలుగా మార్చారు. నల్గొండ జిల్లాలో 13, భువనగిరి జిల్లాలో 15, సూర్యాపేట జిల్లాలో 8 పీఏసీఎస్ లను రైతు ఉత్పత్తిదారుల సంస్థలుగా అప్ గ్రేడ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం వీటిని మొదటి విడతలో గుర్తించింది.
మరో రెండు విడతల్లో మిగిలిన 71 సొసైటీలను కూడా రైతు ఉత్పత్తిదారుల సంస్థల జాబితాలో చేర్చనున్నారు. వ్యవసాయరంగంలో అందుబాటులోకి వస్తున్న సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని రైతులకు మేలు చేకూర్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పీఏసీఎస్ లను రైతు ఉత్పత్తిదారుల సంస్థలుగా ఏర్పాటు చేసింది. ఈ సంస్థల ద్వారా వ్యవసాయ పనిముట్లను తక్కువ ధరకు రైతులకు అందుబాటులో ఉంచడంతోపాటు పంట ఉత్పత్తులకు విలువలను జోడించడం, పంట ఉత్పత్తులను అధికంగా లాభాలు వచ్చేలా మార్కెటింగ్ చేయడం, అధిక ఆదాయం వచ్చే మార్గాలను పరిశీలించడం, విత్తనోత్పత్తి లాంటి కార్యక్రమాలను ఎఫ్‌పీవో చేపట్టనుంది.
మారనున్న రూపు రేఖలు..
ప్రస్తుతం పీఏసీఎస్ ల్లో అందుతున్న సేవలతోపాటు మరిన్ని సేవలు అందుబాటులోకి రానున్నాయి. రైతులకు రుణాలే కాకుండా కూరగాయలు పంటలు, పండ్ల సాగును ప్రోత్సహించనున్నారు. సేంద్రీయ వ్యవసాయానికి అవసరమైన ఎరువులను సంఘాల్లోకి అందుబాటులోకి తెనున్నారు. వ్యవసాయ యంత్ర పరికరాలు, కోల్డ్ స్టోరేజీల యూనిట్లు, కోళ్ల పెంపకం చేపట్టనున్నారు. దీంతో రైతులకు అన్ని రకాల సేవలను అందించడంతోపాటు సంఘాలు కూడా ఆర్థికంగా బలోపేతమవుతాయి.