గాలివాన బీభత్సం.. భారీగా పంటనష్టం

గాలివాన బీభత్సం.. భారీగా పంటనష్టం
  •      నేలకొరిగిన వరి..రాలిన మామిడి
  •     పిడుగుపాట్లు .. విరిగిపడిన చెట్లు
  •     మూగజీవాల మృతి

వెలుగు నెట్​వర్క్​: రాష్ట్రంలో శుక్రవారం గాలివాన బీభత్సం సృష్టించింది.  ఈదురు గాలులకు పలు చోట్ల కోతకు వచ్చిన వరి నేలకొరిగింది. మక్కజొన్న, మామిడి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. చెట్లు విరిగిపడి డ్డాయి. యాదాద్రి జిల్లా రాజాపేట మండలం సింగారం, పరిసర గ్రామాల్లో వర్షానికి వరి పంట నేలకొరిగింది. మామిడి రాలిపోయింది. ధాన్యం కొనుగోలు సెంటర్లలో వడ్లకుప్పలు తడిసిపోయాయి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కనుకుల పీఏసీఎస్ ​ధాన్యం కొనుగోలు సెంటర్ లో 800 క్వింటాళ్ల వరి ధాన్యం తడిసింది. 

రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలోనూ పంట నష్టం సంభవించింది. కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యం తడిసి ముద్దయ్యింది. ఇదే జిల్లా కోనరావుపేట మండలంలోని కొనుగోలు కేంద్రాల్లోనూ ధాన్యం వర్షం పాలైంది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మార్కెట్ యార్డులో వర్షానికి ధాన్యం  తడిసిపోయింది. వరద నీటికి ధాన్యం కొట్టుకుపోగా రైతులు కాపాడుకునే ప్రయత్నం చేశారు. కోహెడ, సిద్దిపేట మండలాల్లోని పలు ఐకెపీ కొనుగోలు కేంద్రాల్లో ఇదే పరిస్థితి కనిపించింది. 

కూరెల్లలో  చెట్టు విరిగి పడడంతో బర్రె మృతి చెందింది. హుస్నాబాద్ మండలం జిల్లెల్లగడ్డ, మీర్జాపూర్ గ్రామాల్లో ఈదురు గాలులకు ఇండ్ల పై కప్పులు ఎగిరిపోయాయి. జగదేవ్ పూర్ మండలం చాట్లపల్లిలో పిడుగు పడి ఆవు చనిపోయింది. జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండ లం ఆత్మనగర్​కు చెందిన కోరుట్ల రమేశ్‌ వ్యవసాయ పనులకు వెళ్లగా పిడుగు పడి గాయపడ్డాడు.