
కరీంనగర్, వెలుగు: కరీం నగర్ జిల్లాలో పలు చోట్ల సోమవారం రాత్రి ఉరుములు, మెరుపులు, గాలి దుమారంతో కూడిన వర్షం కురిసింది. పగలంతా ఉక్కపోతతో ఇబ్బందిపడిన ప్రజలు వర్షంతో ఊరట చెందారు. కరీంనగర్ సిటీతోపాటు శంకరపట్నం, హుజూరాబాద్, సైదాపూర్, మానకొండూరు, గంగాధర, వీణవంక మండలంలో గాలిదుమారంతోపాటు వర్షం కురిసింది. మానకొండూర్‌లో ఆదివారం రాత్రి వీచిన భారీ ఈదురుగాలులకు మామిడి కాయలు నేలరాలాయి. మండలంలోని జగ్గయ్యపల్లిలో సుమారు 30 ఎకరాల్లో మామిడి తోటలు కాయలు రాలినట్లు బాధిత రైతులు తెలిపారు.
శంకరపట్నంలో కూలిన చెట్లు
శంకరపట్నం మండలంలో గాలివాన బీభత్సానికి తాడికల్ - కేశవపట్నం జాతీయ రహదారిపై చెట్లు విరిగిపడ్డాయి. ఆముదాలపల్లి గ్రామంలో రాళ్ళ వర్షం కురిసింది. తాడిచెట్టు పై పిడుగు పడింది. ఇదే మండలం మొలంగూర్ గ్రామంలో కాలేసి సంపత్ ఇంటి పైకప్పు రేకులు గాలిదుమారానికి లేచిపోయాయి.
కొడిమ్యాల మండలంలో రాళ్ల వర్షం
కొడిమ్యాల, వెలుగు: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలవ్యాప్తంగా సోమవారం ఈదురుగాలులతో పాటు రాళ్లవర్షం కురిసింది. చెప్యాల, పూడూర్, కొండాపూర్, కొడిమ్యాల గ్రామాలతో వర్షం కురిసింది. సాయంత్రం సమయంలో కురిసిన రాళ్లవానకు మండలంలోని చాలాచోట్ల మామిడి పంటకు నష్టం జరిగింది. రాళ్లవానతో ప్రజలు ఇంటి నుండి బయటకు రాలేదు.