మత్తు మందుల రాకెట్ గుట్టురట్టు.. .. .ఏడుగురి అరెస్ట్ . ..ఈగల్ టీం, నల్గొండ పోలీసుల దాడి

మత్తు మందుల రాకెట్ గుట్టురట్టు..  .. .ఏడుగురి అరెస్ట్ .  ..ఈగల్ టీం, నల్గొండ పోలీసుల దాడి

 

  • ప్రిస్క్రిప్షన్లు లేకుండానే అమ్మకాలు.. 
  • భారీగా పట్టుబడిన మెడిసిన్  

నల్గొండ, వెలుగు:  నల్గొండ జిల్లాలో ఎన్‌‌ఫోర్స్‌‌ మెంట్(ఈగల్) టీమ్, నల్గొండ పోలీసులు సంయుక్తంగా డ్రగ్స్ రాకెట్‌‌ను ఛేదించారు. ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకుని భారీగా మెడిసిన్ స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం నల్గొండలోని తన ఆఫీసులో డీఎస్పీ శివరాం రెడ్డి మీడియా సమావేశంలో వివరాలు తెలిపారు. జిల్లాలో ప్రిస్క్రిప్షన్లు  లేకుండా మత్తు మందులు అమ్ముతున్నారనే సమాచారం అందడంతో  తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, నల్గొండ –1 టౌన్ పోలీసులు సంయుక్తంగా నిఘా పెట్టారు. 

సోమవారం మునుగోడ్ రోడ్ లో వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నారు. పోలీసులను చూసి మత్తు మందులు (స్పాస్మో టాబ్లెట్స్) తీసుకొని బైక్ పై పారిపోతుండగా, నల్గొండకు చెందిన మహమ్మద్ జబియుల్లా పట్టుకొని విచారించారు. రిఫ్రిజిరేటర్ మెకానిక్ గా పని చేసే మహమ్మద్ ఐదేండ్లుగా మత్తు మందులకు  బానిసయ్యాడు.  

గతేడాది  ఫిబ్రవరి అతనిపై రెండు కేసులు నమోదవగా జైలుకు వెళ్లి వచ్చాడు. అనంతరం తిరుమలగిరి వద్ద మిల్లులో పని చేస్తూ మానేశాడు. 3 నెలల కింద మళ్లీ మత్తు మందుల దందా చేసేందుకు  వాకబు చేస్తుండగా నల్గొండలో పోలీసులు నిఘా పెట్టారని తెలిసింది. దీంతో  మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని వెంకటరమణ మెడికల్ స్టోర్ నిర్వాహకుడు దారం కృష్ణసాయిని కాంటాక్ట్ అయ్యాడు. 

డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా స్పాస్మో టాబ్లెట్స్ ఒక్క షీట్  రూ.100 కు కొనుగోలు చేసి నల్గొండ టౌన్ లో  రూ.200కు అమ్మేందుకు ప్లాన్ చేశాడు. బైక్ పైనే వెళ్లి కొనుగోలు చేసి తెచ్చి నల్గొండలో టాబ్లెట్స్ అమ్ముతున్నాడు. ఈనెల 19 న మరోసారి తన బైక్ పై మహమ్మద్ జబియుల్లా తొర్రూరులోని వెంకటరమణ మెడికల్ స్టోర్ వెళ్లాడు. 

8 బాక్సుల స్పాస్మో టాబ్లెట్లు కొనుగోలు చేసి తీసుకొచ్చాడు.  మునుగోడ్ రోడ్ లో ఫ్రెండ్స్ అఫ్రోజ్, అహ్మద్ అబ్దుల్ హఫీజ్, ఓవైజ్, జావిద్, ఫిరోజ్ లకు ఒక్కో షీట్ అమ్మాడు. మిగిలిన మెడిసిన్ నల్గొండ సిటీలో అమ్మేందుకు తీసుకెళ్తున్నట్టు ఒప్పుకున్నాడు. 

తొర్రూరు లోని వెంకటరమణ మెడికల్ స్టోర్ నిర్వాహకుడు దారం కృష్ణ సాయిను అదుపులోకి తీసుకుని విచారించారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎక్కువ లాభానికి మెడిసిన్ అమ్ముతున్నట్టు అంగీకరించారు.  

మెడికల్ షాప్ పై డ్రగ్ ఇన్ స్పెక్టర్ ఆధ్వర్యంలో రైడ్ చేశారు. టాబ్లెట్స్, రికార్డ్స్, షాప్ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.  కేసులో మహహ్మద్ జబీయుల్లా, దారం కృష్ణసాయితో పాటు మెడిసిన్ తీసుకున్న 15మందిని గుర్తించారు. ఐదుగురిని మంగళవారం అరెస్టు చేసినట్టు డీఎస్పీ తెలిపారు. మత్తు పదార్థాలు తీసుకునేవారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. 

కేసును చాకచక్యంగా ఛేదించిన  తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డీఎస్పీ భిక్షపతి రావు, నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి, నల్గొండ –1 టౌన్ సీ‌‌ఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐ  సతీశ్, గోపాల్ రావు, సిబ్బందిని తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్యా, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ అభినందించారు.