
మెదక్‌లో మైనంపల్లి రీ ఎంట్రీతో మారిన సీన్
మెదక్, వెలుగు : మెదక్ నియోజకవర్గంలో మైనంపల్లి ఎంట్రీ తో పొలిటికల్ సీన్ ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పటి వరకు బీఆర్ఎస్పార్టీలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ రెండు వర్గాలు ఉండగా, ఇప్పుడు మైనంపల్లి రాకతో కొత్తగా మూడో వర్గం మొదలైంది. దీంతో ఎటువైపు వెళ్లలో తేల్చుకోలేక పార్టీ క్యాడర్లో అయోమయం నెలకొంది.
అంతా తానై..
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక వరుసగా 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పద్మాదేవేందర్‌రెడ్డి మెదక్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ స్పీకర్ పదవి లభించడంతో ఐదేండ్లు, రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచాక రెండేళ్ల పాటు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీలో ఆమె ఆధిక్యం కొనసాగింది. నియోజకవర్గంలో అభివృద్ధి పనుల మంజూరు, సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆర్థిక సహాయం మంజూరు, బీఆర్ఎస్ పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు, పార్టీ లీడర్లకు సహాయ, సహకారాలు అందించే విషయాల్లో స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అంతా తానై వ్యవహరించేవారు. పార్టీలో ఆమెకు ప్రత్యామ్నాయమే ఉండేది కాదు.
ఎమ్మెల్సీ ఫోకస్ ..
మెదక్ నియోజకవర్గానికే చెందిన ముఖ్యమంత్రి కేసీఆర్ పొలిటికల్సెక్రటరీ శేరి సుభాష్‌రెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాక పరిస్థితి మారింది. గతంలో హైదరాబాద్ లోనే నివాసం ఉంటూ అప్పుడప్పుడు మాత్రమే మెదక్ వచ్చిపోయే ఆయన 2020 నుంచి నియోజవర్గంపై ఫోకస్ పెట్టారు. తన సొంత గ్రామమైన హవేలీఘనపూర్ మండలం కుచన్‌పల్లిలో ఫాంహౌస్ ఏర్పాటు చేసుకున్నారు. వీలైనంత వరకు అక్కడే ఉండే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్కు చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. వివిధ అభివృద్ధి పనులకు అవసరమైన నిధుల మంజూరుకు చొరవ తీసుకోవడం, సీఎంఆర్ఎఫ్ ఫైల్స్ ప్రభుత్వానికి పంపి ఆర్థిక సహాయం మంజూరు చేయించడం, రైతుల సమస్యలపై స్పందించడం, ఆలయాలకు విరాళాలు ఇవ్వడం లాంటి కార్యక్రమాల ద్వారా క్రమంగా నియోజకవర్గంలో పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో నియోజకవర్గ బీఆర్ఎస్కు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, లీడర్లు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వర్గాలుగా విడిపోయారు. అధికారిక, పార్టీ పరమైన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఇద్దరు పాల్గొంటున్నప్పటికీ ‘ఎవరికి వారే యమునా తీరే’ అన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు. అభివృద్ధి పనుల మంజూరు విషయంలో ప్రాధాన్యత దక్కడం లేదని, పదవులు, గుర్తింపు లేదని భావించినవారు ఎమ్మెల్సీ చెంతకు చేరారు. మరికొందరు ఎమ్మెల్యే వర్గంలోనే ఉన్నా పరోక్షంగా ఎమ్మెల్సీకి మద్దతు తెలుపుతున్నారు.
మైనంపల్లి రాకతో హల్చల్..!
అధికార పార్టీకి చెందిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు రానున్నఎన్నికల్లో మెదక్ అసెంబ్లీ స్థానం నుంచి తన కొడుకు డాక్టర్మైనంపల్లి రోహిత్ ను బరిలో నిలిపే ఉద్దేశ్యంతో సోషల్ సర్వీస్ మొదలు పెట్టారు. గతంలో ఆయన ఐదేళ్లు మెదక్ ఎమ్మెల్యేగా పనిచేసి ఉండటంతో నియోజకవర్గవ్యాప్తంగా గుర్తింపు, పార్టీ లీడర్లతో పరిచయాలు ఉన్నాయి. నియోజకవర్గం మీద పట్టు సాధించడం, ప్రజల మద్దతు కూడగట్టుకోవడం కోసం విస్తృత స్థాయిలో సోషల్ సర్వీస్ చేస్తున్నారు. అనాథ పిల్లల సంక్షేమం కోసం మండలానికి రూ.కోటి కేటాయించడంతోపాటు, ముందుగా ప్రతి మండలానికీ ఒక గవర్నమెంట్ స్కూల్ ను మాడల్ గా తీర్చిదిద్దేందుకు రూ.30 - నుంచి రూ.40 లక్షలు ఖర్చు పెట్టేలా ప్లాన్ చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో తన కొడుకును పోటీలో నిలపాలనుకుంటున్న హన్మంతరావు మెదక్ పట్టణంతోపాటు, అన్ని మండలాలకు చెందిన బీఆర్ఎస్కు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, లీడర్లకు స్వయంగా ఫోన్లు చేసి మద్దతివ్వాలని కోరుతున్నట్టు సమచారం.
ఈ క్రమంలో పార్టీకోసం పనిచేసిన తమకు తగిన గుర్తింపు, గౌరవం లభించడం లేదని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇతర పార్టీల తరపున గెలిచిన వారిని పార్టీలో చేర్చుకుని తమకు ప్రయార్టీ లేకుండా చేశారని లోలోన అసంతృప్తితో ఉన్న బీఆర్ఎస్ లీడర్లు మైనంపల్లి వైపు మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది. ‘మైనంపల్లి రోహిత్ యువసేన’ పేరుతో ఏర్పాటు చేసిన వాట్సప్ గ్రూప్‌లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వర్గానికి చెందిన పలువురు బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, లీడర్లు చేరడం గమనార్హం.
సతమతమవుతున్న కేడర్..
మెదక్ నియోజకవర్గంలో ఇప్పుడు మూడు వర్గాలు కావడంతో కొందరు ప్రజాప్రతినిధులు, లీడర్లు ఎటువైపు వెళ్లాలో తేల్చుకోలేక సతమతమవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఎవరికి వస్తుందో? ఎవరికి సపోర్ట్ చేయాలో? అర్థంకావడం లేదని పలువురు బీఆర్ఎస్ లీడర్లు అంటున్నారు.