డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇప్పిస్తానని లక్షలు వసూలు

డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇప్పిస్తానని లక్షలు వసూలు

హనుమకొండ, వెలుగు: ఇప్పటికే పూర్తయిన డబుల్​ బెడ్రూం ఇండ్లను ఎవరికీ కేటాయించకుండా ప్రభుత్వం ఖాళీగా పెట్టడంతో.. కొందరు దందాలకు తెరలేపుతున్నారు. ఆ ఇండ్లు ఇప్పిస్తానంటూ ఆరుగురి నుంచి రూ.14 లక్షలు వసూలు చేసిన బాసాని రమేశ్​ అనే జీహెచ్​ఎంసీ ఉద్యోగిని వరంగల్​ పోలీసులు అరెస్ట్​ చేశారు. ఆ వివరాలను వరంగల్​ సీపీ తరుణ్​ జోషి ఆదివారం వెల్లడించారు. హనుమకొండలోని నక్కలగుట్టలో ఉంటున్న రమేశ్​.. జీహెచ్​ఎంసీలో నాన్​ టెక్నికల్​ వర్క్​ ఇన్​స్పెక్టర్​గా పనిచేస్తున్నాడు. హనుమకొండ బాలసముద్రంలో ఖాళీగా ఉన్న డబుల్​ బెడ్రూం ఇండ్లను ఇప్పిస్తానంటూ తనకు పరిచయమున్నవారికి చెప్పాడు. న్యూశాయంపేటకు చెందిన బుర్రా సుధాకర్​కు 3 ఇండ్లు ఇప్పిస్తానని రూ.3 లక్షలు వసూలు చేశాడు. బరుపాటి శంకర్​ అనే వ్యక్తి వద్ద రూ.2 లక్షలు తీసుకున్నాడు. చంద్రకళ అనే మహిళకు రెండు ఇండ్లిప్పిస్తానని రూ.5 లక్షలు వసూలు చేశాడు. జడల సదానందం అనే వ్యక్తి నుంచి రూ. 2లక్షలు, తాటిపాముల సింధూజ నుంచి రూ.లక్ష, నీలిగొండ శరత్​ అనే వ్యక్తి దగ్గరి నుంచి రూ. లక్ష వసూలు చేశాడు. 

తప్పించుకుని తిరిగిండు 

డబ్బులిచ్చి నెలలు గడిచినా ఇండ్లు కేటాయించకపోవడంతో బాధితులు.. బాసాని రమేశ్​ను నిలదీశారు. దీంతో శంకర్​కు రూ.70 వేలు, చంద్రకళకు రూ.2 లక్షలను తిరిగిచ్చేశాడు. మిగిలిన సొమ్ములో రూ.8.30 లక్షలు సొంతానికి వాడుకున్నాడు. డబ్బు తిరిగిచ్చేయాలని బాధితులు నిలదీయడంతో వాళ్ల నుంచి తప్పించుకుని తిరగడం మొదలుపెట్టాడు. దీంతో మోసపోయామని గుర్తించిన బాధితులు సుబేదారి పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ఆదివారం నక్కలగుట్ట బస్టాప్​ వద్ద రమేశ్​ను అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి రూ.3 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. కాగా, గతంలో హౌసింగ్​ కార్పొరేషన్​లో పనిచేసినప్పుడు హౌసింగ్​ బోర్డు నిధులను దుర్వినియోగం చేశాడన్న ఆరోపణలపై మరిపెడ పోలీస్​ స్టేషన్​లోనూ రమేశ్​పై కేసు నమోదైనట్టు సీపీ తరుణ్​ జోషి చెప్పారు. డబుల్​ బెడ్రూం ఇండ్ల అర్హుల జాబితాను రెవెన్యూ అధికారులు రెడీ చేస్తారని, బ్రోకర్లను నమ్మి మోసపోవద్దని 
జనానికి సూచించారు.