కొత్త పంచాయతీలకు పైసల కష్టాలు

కొత్త పంచాయతీలకు పైసల కష్టాలు
  •     ఫండ్స్‌‌‌‌ కోసం సర్పంచ్‌‌‌‌ల తంటాలు
  •     సిబ్బందికీ జీతాలు ఇవ్వలేని దుస్థితి

కొత్త పంచాయతీగా మారిన వడ్డెర కాలనీలో 97 నివాస గృహలు ఉన్నాయి. గ్రామస్తులు 100 పన్ను చెల్లిస్తే ఏటా రూ.29 వేల ఆదాయం వస్తుంది. ఆర్థిక సంఘ నిధులు నాలుగు నెలలకోసారి రూ.30 వేల చొప్పున ఏడాదికి రూ.90 వేలు వస్తాయి. పంచాయతీలో ఇద్దరు కార్మికులు నెలకు రూ.8,500 చొప్పను రూ.17 వేలు చెల్లించాల్సి ఉంటుంది.

బోరు, ట్రాక్టర్లకు డీజిల్, వీధి లైట్లు, ఆఫీస్ ఖర్చులు, కారోబార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జీతంతో పాటు ఇతర ఖర్చులు నెలకు రూ.30 వేలు అవుతాయి. ఈ లెక్కన ఏడాదికి రూ.3 లక్షలకు పైగా లోటు బడ్జెట్‌‌‌‌‌‌‌‌ను భర్తీ చేయలేక పంచాయతీ పాలకవర్గం తంటాలు పడుతోంది. ఇది ఒక్క వడ్డెర కాలనీయే కాదు ఉమ్మడి నిజామాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో కొత్తగా ఏర్పడిన అనేక పంచాయతీల పరిస్థితి ఇలాగే ఉంది. 


నిజామాబాద్, వెలుగు: పల్లెల అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్ల కింద కొత్త పంచాయతీలను ఏర్పాటు చేసింది. కానీ వాటికి స్పెషల్ ఫండ్స్ మంజూరు చేయకపోవడం, పన్నులు, ఇతర ఆదాయ మార్గాలు కూడా అంతంతగానే ఉండడంతో కొత్త పంచాయతీల ప్రగతి కుంటుపడింది. గ్రామాభివృద్ధికి నిధులు సమకూర్చుకోలేక, ప్రభుత్వంతో పోరాడలేక, ఎన్నుకున్న ప్రజలకు జవాబు ఇవ్వలేక ఆ పంచాయతీల ప్రతినిధులూ ఇబ్బంది పడుతున్నారు. 

ఆదాయం నిల్..

పంచాయతీల విభజనకు ముందు నిజామాబాద్ జిల్లాలో 375 పంచాయతీలు ఉండగా కొత్తగా 155 పంచాయతీలను ఏర్పాటు చేసింది. కామారెడ్డి జిల్లాలో 312 పంచాయతీలు ఉండగా కొత్తగా 214 జీపీలయ్యాయి. మొత్తంగా ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం 1,056 గ్రామాలు ఉన్నాయి. అయితే కొత్తగా ఏర్పడిన పంచాయతీల్లో 90 శాతం గిరిజన తండాలే. మిగితావి కేవలం 500 జనాభా ఉన్న పల్లెలు. నివాస గృహాలు తక్కువగా ఉండడంతో పాటు వ్యాపార వాణిజ్య సంస్థలు పెద్దగా ఉండవు. ఫలితంగా పన్నుల రూపంలో వచ్చే ఆదాయం నామమాత్రంగానే ఉంటుంది. ఉన్న ఇండ్ల ఓనర్లు పన్నులు చెల్లించడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఇక ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీ, జిల్లా, మండల పరిషత్‌ల ద్వారా కూడా అనుకున్న మేర నిధులు అందడం లేదు.

పెరుగుతున్న ఆర్థిక భారం..

కొత్త పంచాయతీలకు ఆర్థిక వనరులు లేవు. అయినా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ది పనులు మాత్రం ఆటంకం లేకుండా కొనసాగాలని అధికారులు ఒత్తిడి తెస్తు న్నారు. దీంతో పంచాయతీలపై ఆర్థికభారం పడు తోంది. పెద్ద పంచాయతీలకు సమానంగా హరితహారం మొక్కలను పెంచడం, వైకుంఠధామాలు, కంపోస్టు షెడ్ల నిర్మాణం, నర్సరీల నిర్వాహణ, ట్రాక్టర్ల కొనుగోలు, ఇంటింటికి చెత్త సేకరణ, పారిశుద్ధ్య పనుల నిర్వాహణ వంటి పనులు క్రమం తప్పకుండా చేయాల్సి వస్తోంది. ఫలితంగా కొత్త పంచాయతీలపై ఆర్థిక భారం పెరుగుతోంది.

పడకేసిన ప్రగతి..

కొత్త జీపీలకు ఆర్థిక వనరులు లేకపోవ డంతో ప్రగతి పడకేసింది. ప్రధానంగా అంతర్గత రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణం కనిపించడంలేదు. వీధి దీపాల నిర్వాహణ, క్లోరినేషన్, చెత్తసేకరణ, బోరుబావులు, తాగునీటి పైపుల మరమ్మతులు వంటి సమస్యలు పరి ష్కారానికి నోచుకోవడం లేదు. చాలా పంచాయతీల్లో కారోబార్లు, లైన్‌‌‌‌‌‌‌‌మన్లు, ట్రాక్టర్ డ్రైవర్లు, పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు కూడా చెల్లించడంలేదు. 

స్పెషల్‌‌‌‌‌‌‌‌ ఫండ్స్‌‌‌‌‌‌‌‌ ఇవ్వాలి

కొత్త పంచాయతీలకు లక్ష్యానికి అనుగుణంగా ప్రభుత్వం స్పెషల్ ఫండ్స్ ఇవ్వడం లేదు. నిధులు లేక నాలుగేళ్లుగా ఎలాంటి పనులు సాగడం లేదు. స్పెషల్ ఫండ్స్‌‌‌‌‌‌‌‌ మంజూరు చేస్తేనే డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ కనిపిస్తుంది. - సురేందర్, శ్రీనగర్ తండా సర్పంచ్