అమెరికా షట్‌డౌన్ : వీసా ప్రాసెసింగ్ క్లోజ్..! US డ్రీమ్స్ ఇక ఆలస్యమేనా..?

అమెరికా షట్‌డౌన్ : వీసా ప్రాసెసింగ్ క్లోజ్..! US డ్రీమ్స్ ఇక ఆలస్యమేనా..?

దెబ్బమీద దెబ్బ.. పుండు మీద కారం చల్లినట్లు ఉంది అమెరికా వీసా కోసం ప్రయత్నిస్తున్న వారి పరిస్థితి. ఏళ్లుగా కష్టపడి యూఎస్ వెళ్లాలి.. ఎంఎస్ చేయాలి, అక్కడే జాబ్ కొట్టి ఫైనల్ గా గ్రీన్ కార్డ్ సంపాదించి పిల్లలకు అమెరికా పౌరసత్వం సంపాదించుకోవాలనేది చాలా మంది ఇండియన్ యూఎస్ డ్రీమర్స్ ప్లాన్స్. కానీ ఈ ఏడాది ట్రంప్ అధికార పగ్గాలు స్టార్ట్ చేసిన తర్వాత ఇవి ఇక అసాధ్యమేనని తేలిపోతోంది. దీనికి తోడు తాజాగా అమెరికా ప్రభుత్వం ఫండింగ్ ఇష్యూ కారణంగా అమెరికా షట్‌డౌన్ అవ్వటం ఈ కష్టాలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. 

ప్రస్తుతం కొనసాగుతున్న US ప్రభుత్వ షట్‌డౌన్ అనేక ఫెడరల్ సర్వీసెస్ లకు అంతరాయం కలిగిస్తోంది. దీనిపై తాజాగా ఇండియాలోని అమెరికా రాయబార కార్యాలయం తన ఎక్స్ ఖాతాలో చేసిన ఒక పోస్ట్ అమెరికా వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్న చాలా మందిని ఆందోళనకు గురిచేస్తోంది. పరిస్థితులు సహకరించినంత వరకు అమెరికాతో పాటు ఇతర దేశాల్లోని రాయబార కార్యాలతో పాటు కాన్సులేట్‌లలో షెడ్యూల్ చేయబడిన పాస్‌పోర్ట్, వీసా సేవల్లో అంతరాయాలు, ఆలస్యాలు జరగవచ్చని చెప్పింది. 

అలాగే కొత్త వీసా అప్లికేషన్ల విషయంలో గ్యారెంటీ ఉండకపోవచ్చని సూచించింది. ఇప్పటికే ఉన్న దరఖాస్తుల ప్రాసెసింగ్ కూడా ఆలస్యం లేదా నెమ్మదించవచ్చని చెప్పింది. అత్యవసర సేవలు మినహా మిగిలిన వాటి ప్రాసెసింగ్ ఇప్పట్లో కావని ఎంబసీ ప్రకటన చెప్పకనే చెబుతోంది. దీంతో విద్యార్థులతో పాటు యూఎస్ వెళ్లాలనుకుంటున్న చాలా మంది డైలమాలో ఉన్నారు.

గతంలో కూడా ఇలా షట్ డౌన్ అయినప్పుడు యూఎస్ ప్రభుత్వం కాన్సులేట్ పని సమయాలను తగ్గించటం, కొత్త అప్లికేషన్లను తీసుకోవటం నిలిపివేయటం చేసింది. దీంతో వీసా, పాస్ పోర్ట్ ప్రాసెసింగ్ తీవ్ర ఆటంకాలు ఎదుర్కొన్నాయి. ప్రస్తుతం షట్ డౌన్ కారణంగా 7లక్షల 50వేల మంది అమెరికా ఉద్యోగులపై ప్రభావం ఉండటంతో కేవలం అవసరమైన లేదా అత్యవసరమైన సేవలు మాత్రమే యాక్టివ్ ఉంటాయని.. ఫండింగ్ తిరిగి ప్రారంభించే వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని తేలిపోయింది.