గద్దర్​ లేకుంటే తెలంగాణ లేదు .. ఉద్యమాన్ని ముందుండి నడిపిండు: భట్టి

గద్దర్​ లేకుంటే తెలంగాణ లేదు ..  ఉద్యమాన్ని ముందుండి నడిపిండు:  భట్టి
  • తన ఒక్కడి వల్లే తెలంగాణ వచ్చినట్టు కేసీఆర్ ప్రచారం చేసుకున్నాడని ఫైర్  
  • గద్దర్​పై కేసులు ఎత్తివేయకుండా ఇబ్బందులు పెట్టిన్రు: మంత్రి జూపల్లి
  • తెల్లాపూర్ లో ఘనంగా గద్దర్ విగ్రహావిష్కరణ

రామచంద్రపురం/గండిపేట, వెలుగు:  గద్దర్​ మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదారని, ఆయన లేకుంటే తెలంగాణ లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. గద్దర్‌ సమాజానికి చేసిన సేవలు, పాడిన పాటలు, ఆటలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని కొనియాడారు. భూమి కోసం, భుక్తి కోసం, పేదల విముక్తి కోసం అహర్నిశలు కష్టపడ్డ  గద్దరన్న మరణం తీరని లోటన్నారు. బుధవారం గద్దర్​ జయంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్‌ చౌరస్తాలో ఆయన విగ్రహాన్ని భట్టి ఆవిష్కరించారు. తెల్లాపూర్ ఆల్​పార్టీ లీడర్ల సమక్షంలో ఏర్పాటు చేసిన విగ్రహావిష్కరణ వేడుకలకు మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ మధుయాష్కీ, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు  ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌, గద్దర్‌ కుమార్తె వెన్నెల, కుమారుడు సూర్యం, పాశం యాదగిరి, కాట శ్రీనివాస్‌గౌడ్ తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. గద్దర్‌ లాంటి కవి భారతదేశంలో ఇప్పటివరకు పుట్టలేదని, ఇకముందు పుట్టబోరన్నారు. ఆయన మరణంతో అణగారిన కుటుంబాల గళం మూగబోయిందన్నారు. ‘‘తెలంగాణ ఉద్యమాన్ని నడిపింది గద్దర్, బెల్లి లలితక్క, గాదె ఇన్నయ్య లాంటి మేధావులే. కానీ కేసీఆర్ ​ఒక్కడే తెలంగాణ ఉద్యమం నడిపించినట్టుగా ప్రచారం చేసుకున్నాడు” అని ఫైర్ అయ్యారు. జూపల్లి మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ ఉద్యమ కేసులను కేసీఆర్, కేటీఆర్​ ఎత్తివేసుకున్నారు. కానీ గద్దర్‌ చనిపోయే వరకు కేసులు అట్లనే ఉన్నాయి. గద్దర్ పై ఉన్న కేసులను ఎత్తివేయకుండా ఇబ్బందులు పెట్టిన్రు. గద్దర్‌ శరీరంలో ఒక బుల్లెట్‌ చివరిదాకా ఉంది. గద్దర్​కు శీలం, కరుణ, జ్ఞానం, ఆచరణ ఈ నాలుగు ఉండేవి. అందుకే ఆయన గొప్ప వ్యక్తి అయ్యారు.  గద్దర్‌ గళం విప్పితే శత్రువులు గడగడ వణికిపోయేవారు” అని అన్నారు.   

మెదక్​ జిల్లాకు గద్దర్​పేరు పెట్టాలి: ఆర్ఎస్ ప్రవీణ్ 

పాటను తూటాగా మార్చి పాలకులపై ఎక్కుపెట్టిన గొప్ప వ్యక్తి గద్దర్ ​అని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్​ప్రవీణ్​కుమార్​ కొనియాడారు.  గత పాలకులు అసైన్డ్​ భూములు గుంజుకుని వేల కోట్ల రూపాయలకు అమ్ముకున్నారని, వాటిని తిరిగి పేదలకు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గద్దర్ పుట్టిన మెదక్ జిల్లాకు గద్దర్ పేరు , భువనగిరి  జిల్లాకు బెల్లి లలిత పేరు, జనగామ జిల్లాకు సర్వాయి పాపన్న పేర్లను పెట్టాలని కోరారు. నంది అవార్డ్ పేరును గద్దర్ అవార్డ్ గా మార్చడం తోనే రాష్ట్రంలో ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పాటైనట్లు తనకు స్పష్టమైందని గద్దర్ కుమారుడు సూర్యం చెప్పారు. గద్దర్​ పాట ఉన్నంత కాలం ఆయనకు మరణం లేదని గద్దర్​కుమార్తె వెన్నెల అన్నారు.

తెల్లపూర్ లో గద్దర్ విగ్రహం కోసం దీక్ష చేయాల్సి రావడం బాధాకరమని మాజీ ఎంపీ​ మధుయాష్కీ అన్నారు. ప్రభుత్వం మారినా అధికారుల్లో మార్పు రాకపోవడమే ఇందుకు కారణమన్నారు. గతంలో దొరకు మద్దతు తెలిపిన అధికారులు ఇంకా ఉన్నారని.. ఎంక్వైరీ జరిపి, తప్పు చేసినట్లు తేలినోళ్లపై త్వరలోనే చర్యలు తీసుకుంటామన్నారు. 1985 నుంచి గద్దర్ తో కలిసి బహుజన లెఫ్ట్ ఫ్రంట్ లో పని చేశానని కంచె ఐలయ్య గుర్తుచేసుకున్నారు. గద్దర్​ను కేసీఆర్ అవమానించారని, ఫుత్‌ పాత్‌ గాడని తిట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులు అంటే పట్టని కేసీఆర్ కట్టిన కంచెలను తెంచి దళిత డిప్యూటీ సీఎం ఇప్పుడు అదే భవనంలో ఉండడం సంతోషకరమని పేర్కొన్నారు.