చాన్స్ లర్​గా గవర్నర్ ​లేకుంటే వర్సిటీలు ఆగం!

చాన్స్ లర్​గా గవర్నర్ ​లేకుంటే వర్సిటీలు ఆగం!

రాష్ట్ర గవర్నర్ ​ప్రజా దర్బార్ లాంటి కార్యక్రమాలతో ప్రజలకు దగ్గరవుతుండగా.. రాష్ట్ర సర్కారు మాత్రం ప్రైవేటు వర్సిటీలకు రెడ్​కార్పెట్​పరుస్తూ.. ఉన్న ప్రభుత్వ వర్సిటీలపై గుత్తాధిపత్యం సాధించేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ఆయా యూనివర్సిటీలకు నిబంధనలకు విరుద్ధంగా రాజకీయ జోక్యంతో వైస్​చాన్స్​లర్లను నియమించారన్న ఆరోపణలు ఉండగా.. తాజాగా పశ్చిమ బెంగాల్, తమిళనాడు తరహాలో గవర్నర్ ను చాన్సలర్ పదవి నుంచి తప్పించి స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రే అన్ని వర్సిటీలకు చాన్సలర్ గా వ్యవహరించేందుకు ప్రయత్నాలు మొదలైనట్లు వార్తలొస్తున్నాయి. అదే జరిగితే యూనివర్సిటీల స్వయంప్రతిపత్తి పూర్తిగా దెబ్బతినడంతోపాటు, రాజకీయ జోక్యం మరింత పెరిగి విద్యా ప్రమాణాలు పడిపోయే ప్రమాదముంది. 

గవర్నర్​ బాధ్యతల తొలగించే యత్నం?

పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ, ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్కర్‌కు మధ్య గొడవలు తెలిసిందే. ఇటీవల ఆమె గవర్నర్ అధికారాలకు కత్తెర వేసేందుకు ఓ బిల్లు తెచ్చారు. యూనివర్సిటీల చాన్సలర్‌గా గవర్నర్ అధికారాలను తుంచేసి.. ఆ హోదాను సీఎంకు కట్టబెట్టే ప్రతిపాదనకు ఆ రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇప్పుడు వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లు చట్టంగా మారితే.. రాష్ట్రంలోని అన్ని వర్సిటీలకు చాన్సలర్‌గా గవర్నర్ కాకుండా ముఖ్యమంత్రి ఉంటారు. తమిళనాడులోనూ ఇదే తరహా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాగా తెలంగాణలో కూడా చాన్స్​లర్​ బాధ్యతల నుంచి గవర్నర్​ను తప్పించే ప్రయత్నాలు మొదలైనట్లు ఇటీవల వార్తలొచ్చాయి. వర్సిటీలకు చాన్సలర్ గా గవర్నర్ ను తప్పించడానికి బిల్లును తయారు చేసి మంత్రిమండలి ముందుకు తీసుకువచ్చి ఆ తర్వాత అసెంబ్లీలో ప్రవేశ పెట్టి ఆమోదం పొందాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ  పని అంత కష్టమేమీ కాదు. భవిష్యత్తులో అన్ని వర్సిటీల్లో అసిస్టెంట్​ప్రొఫెసర్​ పోస్టులు భర్తీ చేయనున్న నేపథ్యంలో వర్సిటీల పగ్గాలు పూర్తిగా ప్రభుత్వం చేతికి మార్చే ప్రయత్నం జరగడం వెనక ఆంతర్యం ఏమిటని విద్యార్థి, అధ్యాపక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో వందలాది ఎకరాల వర్సిటీ భూములను ప్రైవేట్ శక్తులకు ధారాదత్తం చేసేందుకు పథక రచన జరుగుతోందనే విమర్శలు ఉండగా.. ఇక రాజకీయ ప్రత్యక్ష జోక్యంతో భవిష్యత్తులో వర్సిటీల్లో పాలన ఎలా ఉంటుందోనని విద్యార్థులు, ప్రొఫెసర్లు ఆందోళన చెందుతున్నారు. 

వీసీల నియామకంపై ప్రభావం

సీఎం ఆయా వర్సిటీలకు చాన్స్​లర్​గా వ్యవహరిస్తే వీసీల నియామకాలు ఆయా సీఎంలకు నచ్చినట్లు జరుగుతాయి. నియమితులైన వీసీలు సీఎం కనుసన్నల్లో పనిచేయాల్సి వస్తుంది. అప్పుడు విద్యాప్రమాణాలపై ప్రభావం పడుతుంది. ఇప్పటికే ఓ వర్సిటీలో నిబంధనలకు విరుద్ధంగా రాజకీయ జోక్యంతో ఒక ప్రొఫెసర్ ను వీసీగా నియమిస్తే, హైకోర్టు, లోకాయుక్తలో కేసు నడుస్తోంది. గవర్నర్ చాన్సలర్ గా ఉన్నప్పుడే ప్రభుత్వం నియమించిన “అన్వేషణ కమిటీ” ఇలాంటి తప్పిదాలకు పాల్పడితే, రేపు వర్సిటీలకు చాన్స్​లర్​గా సీఎం ఉంటే మరిన్ని తప్పులు జరిగే ప్రమాదం ఉంది. 

నిర్వీర్యం దిశగా వర్సిటీలు

రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీల్లో బోధన, బోధనేతర సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి.  ప్రభుత్వ డిగ్రీ, జూనియర్​ కాలేజీల్లోనూ  వేల సంఖ్యలో పోస్టులు నింపాల్సి ఉన్నా.. ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. ప్రభుత్వం  పాలనను పట్టించుకోకపోవడంతోనే రాష్ట్ర గవర్నర్ ప్రజల బాధలు వినాలనుకుంటున్నారు. మహిళలు, సామాన్య ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరించే దిశగా గవర్నర్ రెండేండ్ల కిందటే ప్రజాదర్బార్ ను ప్రారంభించాలనుకున్నా.. కరోనాతో సాధ్యం కాలేదు. దీంతో ఈ నెల 10 నుంచి రాజ్ భవన్ లో మహిళా దర్భార్ కు ​శ్రీకారం చుట్టారు. గవర్నర్ అధికారాలను కాదని, ఉన్నత విద్యను పూర్తిగా తమ గుప్పిట్లోకి తెచ్చుకునేందుకే.. చాన్సలర్ గా గవర్నర్ ను తప్పించి సీఎం బాధ్యత తీసుకునే కుట్ర జరుగుతోంది. వర్సిటీలను ఆగం చేసే ఈ నిర్ణయాన్ని అన్ని వర్గాలు వ్యతిరేకించాల్సిందే.

డా.  మామిడి ఇస్తారి, అసిస్టెంట్ ​ప్రొఫెసర్, కేయూ