
- రూ. లక్ష సుపారీ ఇచ్చేందుకు ఒప్పుకున్న మహిళ
- ఈ నెల 24న దాడి, తప్పించుకున్న భర్త
- మహిళతో పాటు ఆమె ప్రియుడు, మరో ముగ్గురు అరెస్ట్
లింగంపేట, వెలుగు : వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ఓ మహిళ రూ. లక్ష సుపారీ ఇచ్చి తన భర్తను హత్య చేయించేందుకు ప్లాన్ చేసింది. వారం రోజుల కింద భర్తపై దాడి చేయించగా.. అతడు త్రుటిలో తప్పించుకున్నాడు. తర్వాత సదరు మహిళే తన భర్తపై కొందరు వ్యక్తులు దాడి చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణలో ఆమే నిందితురాలని తేలడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసరావు బుధవారం వెల్లడించారు. కామారెడ్డి జిల్లా చిన్న ఆత్మకూర్ గ్రామానికి చెందిన పల్లె రవి, సంపూర్ణ భార్యాభర్తలు.
సంపూర్ణ అదే గ్రామానికి చెందిన జాన్సన్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఇందుకు అడ్డుగా ఉన్న తన భర్త రవిని చంపేయాలని, రూ. లక్ష ఇస్తానని జాన్సన్‌కు ఆఫర్ ఇచ్చింది. దీంతో జాన్సన్ తాండూర్‌కు చెందిన చాకలి రాజు, చిన్నఆత్మకూర్కు చెందిన నవీన్‌తో పాటు మరో మైనర్‌తో మాట్లాడి రవిని హత్య చేసేందుకు ఒప్పించాడు. జాన్సన్ ఈ నెల 24న రవిని కలిసి డబ్బు అప్పుగా ఇస్తానని నమ్మించి పెద్దారెడ్డి శివారులోని డంప్‌యార్డు వద్దకు తీసుకెళ్లాడు.
అక్కడ మద్యం సేవించిన అనంతరం జాన్సన్, రాజు కలిసి సుత్తెతో రవి తలపై కొట్టారు. తప్పించుకున్న రవి అక్కడి నుంచి పారిపోయి ఆత్మకూర్ గేట్ సమీపంలోని పామ్‌హౌస్ వద్దకు చేరుకోగా.. జాన్సన్ మరోసారి దాడి చేశాడు. దీంతో రవి ఫాంహౌస్‌లోకి వెళ్లి ప్రాణాలు కాపాడుకున్నాడు. ఇదిలా ఉండగా.. తన భర్త రవిపై హత్యాయత్నం జరిగిందని సంపూర్ణ నాగిరెడ్డిపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారణ చేపట్టగా వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భార్యే హత్యకు ప్లాన్ చేసిందని తేలింది. దీంతో సంపూర్ణ, ఆమె ప్రియుడు జాన్సన్, రాజు, నవీన్‌తో పాటు బాలుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు.