బస్సు బోల్తా.. మహిళ సజీవ దహనం

బస్సు బోల్తా.. మహిళ సజీవ దహనం
  • హైదరాబాద్​ నుంచి చిత్తూరు వెళ్తుండగా ప్రమాదం
  • ఏసీ షార్ట్​సర్క్యూట్​జరిగి మంటల్లో కాలిన బస్సు
  • చేయి ఇరుక్కొని బయటపడలేకపోయిన మహిళ

హైదరాబాద్​ నుంచి చిత్తూరు వెళ్తున్న ఓ ప్రైవేటు వోల్వో బస్సు బోల్తా పడడంతో మంటలు చెలరేగి ఓ మహిళ సజీవదహనమైంది. ఈ ఘటన శనివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం టెన్త్​ బెటాలియన్ ​సమీపంలో నేషనల్​హైవే 44పై జరిగింది. బోల్తా పడిన తర్వాత ఏసీ షార్ట్​ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగి బస్సు దగ్ధమైంది. ఈ ప్రమాదంలో హైదరాబాద్​లోని మెహిదీపట్నంకు చెందిన మాలతి (40) సజీవ దహనమైంది.  

గద్వాల, వెలుగు: హైదరాబాద్​నుంచి చిత్తూరు వెళ్తున్న ఓ ప్రైవేటు వోల్వో బస్సు బోల్తా పడి మంటలు చెలరేగి ఓ మహిళ సజీవదహనమైంది. ఈ ఘటన శనివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం టెన్త్​బెటాలియన్​సమీపంలో నేషనల్​హైవే 44పై జరిగింది. బోల్తా పడిన తర్వాత ఏసీ షార్ట్​సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగి బస్సు దగ్ధమైంది. ఈ ప్రమాదంలో హైదరాబాద్​లోని మెహదీపట్నంకు చెందిన మాలతి(40) సజీవ దహనమైంది ఎస్పీ రితిరాజ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఓ ట్రావెల్​సంస్థకు చెందిన వోల్వో బస్సు శుక్రవారం రాత్రి 11 గంటలకు హైదరాబాద్ నుంచి చిత్తూరుకు 37 మంది ప్యాసింజర్లతో బయలుదేరింది. జడ్చర్లలోని ఓ దాబా దగ్గర రెండో డ్రైవర్ డ్రైవింగ్ తీసుకున్నాడు. అక్కడి నుంచి కొంత దూరం వెళ్లిన తర్వాత ఎర్రవల్లి చౌరస్తా పదో బెటాలియన్ దగ్గర అదుపుతప్పి బోల్తా పడింది. ప్రయాణికులు ఒక్కొక్కరుగా కిటికీలు పగులుగొట్టుకొని గాయాలతో బయటపడ్డారు.

 మాలతి అనే మహిళ చెయ్యి బస్సు కింద ఇరుక్కుపోవడంతో ఆమెను తీయలేకపోయారు. డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ రాజు, ఇటిక్యాల ఎస్ఐ అశోక్ బాబు, పోలీసు సిబ్బంది అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మాలతిని బయటకు తీసేందుకు ప్రయత్నించినా కుదరలేదు. అంతలోనే బస్సు ఏసీలో షార్ట్  సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగి మొత్తం దగ్ధమైంది. ఈ ప్రమాదంలో మాలతి సజీవ దహనమైంది. ఏడుగురికి గాయాలు కాగా, వారిని కర్నూల్ ఆసుపత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ కు తరలించారు. అరుణ అనే ప్రయాణికురాలు బస్సులో10 తులాల గోల్డ్ పోగొట్టుకోగా.. కాలిపోయిన గోల్డ్ ను పోలీసులు ప్రయాణికురాలి కొడుకు భార్గవ్ కు అందించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకొని ఎంక్వైరీ చేస్తున్నామని ఎస్పీ తెలిపారు. 

డ్రైవర్ తాగినట్టు ఉన్నడు: ప్రయాణికులు 

బస్సులో ఉన్న ఇద్దరు డ్రైవర్లలో ఒకరు తాగినట్లు ఉన్నారని, బస్సు నడుపొద్దని జడ్చర్ల వద్ద ఆయనకు చెప్పినా వినలేదని యాక్సిడెంట్ జరిగిన బస్సులో ప్రయాణించిన కడపకు చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఒకరు తెలిపారు. సంక్రాంతి పండుగకు ఊరెళుతుంటే ఈ ఘటన జరగడం దిగ్బ్రాంతికి గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.