సెల్ఫీ పిచ్చితో ప్రాణం కోల్పోయిన యువతి

సెల్ఫీ పిచ్చితో ప్రాణం కోల్పోయిన యువతి

సెల్ఫీల మోజులో పడి యువత తమ ప్రాణాలను తీసుకొంటున్న ఘటనలు ఇప్పటికే చాలా జరిగాయి. వాటి కోసం ప్రాణాలను పణంగా పెట్టవద్దని వివిధ అవగాహన కార్యక్రమాలు చేపట్టినా.. ఆ  ప్రభావం మాత్రం ఎక్కడా లేదనిపిస్తుంది. పశ్చిమ బెంగాల్‌లోని జల్పాయిగురి జిల్లాలో ఆదివారం జరిగిన ఘటనే అందుకు నిదర్శనం.

జల్పాయ్‌గురి జిల్లా మైనగురిలోని ఓ కోచింగ్ సెంటర్లో ట్రైనింగ్ తీసుకుంటున్న స్టూడెంట్స్..  అక్కడికి  ఘిస్ నది దగ్గర్లోని ఓడ్లాబారి ప్రాంతానికి పిక్‌నిక్ కి వెళ్లారు. ఆ బ్యాచ్ లో ఇద్దరు యువతులు సెల్ఫీ తీసుకునేందుకు నదిపై ఉన్న రైల్వే బ్రిడ్జి ఎక్కారు.  బ్రిడ్జిపైనే సెల్ఫీలు తీసుకుంటుండగా.. అదే సమయంలో వారి ఎదురుగా  అలీపూర్‌దార్ ట్రైన్ రావడంతో ప్రాణాలు కాపాడుకోవడానికి నదిలోకి దూకే ప్రయత్నం చేశారు.

వారిలో ఒక యువతి వెంటనే నదిలోకి దూకగా.. మరో యువతిని రైలు ఢీకొట్టడంతో నదిలో పడిపోయి అక్కడికక్కడే మృతి చెందింది. ప్రాణాలు దక్కించుకునేందుకు నీళ్లల్లోకి దూకేసిన యువతికి తీవ్రమైన గాయాలయ్యాయి.  అక్కడే ఉన్న స్టూడెంట్స్ స్థానికుల సాయంతో గాయాలపాలైన ఆ యువతిని నార్త్ బెంగాల్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ లో చేర్చి చికిత్స అందిస్తున్నట్టు రైల్వే పోలీసులు తెలిపారు.