విద్యుత్ వైర్లు తగిలి మహిళ మృతి: పొలం యజమానిపై దాడి

విద్యుత్ వైర్లు తగిలి మహిళ మృతి: పొలం యజమానిపై దాడి

మహబూబాబాద్ జిల్లాలో విషాదం జరిగింది. పొలానికి రక్షణగా ఏర్పాటు చేసిన విద్యుత్ వైర్లు తగిలి ఓ మహిళ చనిపోయింది. దీంతో ఊరు జనంతో కలిసి పొలం యజమానిపై దాడి చేశాడు ఆమె కొడుకు. దీంతో పొలం యజమాని హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయాడు. గూడూరు మండలం చిల్లగండి తండాలో ఘటన జరిగింది. బానోతు ఈర్యా... అడవి పందుల నుంచి పంటను కాపాడుకోవడానికి పొలానికి విద్యుత్ వైర్లు పెట్టాడు. ఇది తెలియక తన పొలానికి వెళ్తున్న బుల్లి అని మహిళ కరెంట్ షాక్ తగిలి చనిపోయింది. విషయం బయటకు రాకుండా మహిళ డెడ్ బాడీని చేనులోనే దాచి పెట్టాడు ఆ యజమాని. 

రాత్రయినా తల్లి ఇంటికి రాకపోవడంతో ఆమె కొడుకు తండావాసులతో ఊరంతా వెతికాడు. ఎక్కడా ఆచూకీ దొరకలేదు. ఇవాళ ఉదయం ఈర్యా పొలంలో అనుమానస్పద స్థితిలో మహిళ డెడ్ బాడీ కనిపించింది. దీంతో తండా వాసులంతా పొలం యజమాని ఈర్యాపై దాడి చేశారు. దీంతో అతను ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు.