
నవ్వు నలభై విధాల మేలు చేస్తుందని పెద్దలు చెబుతుంటారు. అదే నవ్వు నాలుగు విధాల చేటు చేస్తుందని అదే పెద్దలు చెప్పారు. ఒకామె విషయంలో ఆ రెండోదే నిజమైంది. అవును, అతిగా నవ్వితే ప్రమాదమని ఆమె సంఘటన నిరూపించింది. చైనాకు చెందిన ఓ మహిళ పొట్ట చెక్కలయ్యేలా నవ్వడంతో ఆమె దవడ ఎముక పక్కకు తొలిగింది. చాలా సేపు ఆమె నోరు అలా తెరుచుకునే ఉండిపోయింది. ఆ నొప్పికి మహిళ అల్లాడిపోయింది. గ్వాంగ్జూకు ట్రైన్లో వెళుతున్న క్రమంలో ఆమె, ఏం చూసిందో ఏమో గానీ పడిపడి నవ్వింది. పిచ్చిపిచ్చిగా నవ్వడంతో రైల్లోని తోటి ప్రయాణికులు ఆమెని వింతగా చూశారు కూడా. అయితే, ఆమె నవ్వడం అయ్యేసరికి నోరు అలా పెద్దగా తెరుచుకునే ఉండిపోయింది. అప్పటికిగానీ ఆ మహిళకు దవడ పక్కకు తొలిగిందని తెలియలేదు. అదృష్టవశాత్తూ అదే ట్రైన్లో డాక్టర్ ఉండడంతో ట్రీట్మెంట్ జరిగిందిగానీ, లేదంటే ట్రైన్ దిగే దాకా ఆమె ఆ నొప్పితో అల్లాడిపోవాల్సివచ్చేది. లివాన్ హాస్పిటల్కు చెందిన డాక్టర్ లువో వెన్షెంగ్ ఆమెకు ట్రీట్మెంట్ చేశారు. దవడను సరిచేసి కట్టు కట్టారు. కానీ, తానేమీ ఎముకల డాక్టర్ను కాదని, ఓసారి వెళ్లి చూపించుకోవాలని ఆమెకు ఆయన సూచించారు. అయితే, అంతకుముందు కూడా ఇలా ఆమె దవడ పక్కకు తొలిగిందట. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వాంతులై దవడ జరిగిందని చెప్పిందామె. మళ్లీ ఇలా నవ్వినా, పెద్దగా ఆవలించినా దవడ పక్కకు తొలిగే ప్రమాదముందని ఆమెకు లువో చెప్పారు.