మహిళా డాక్టర్‌ను పొడిచి చంపిన ప్రియుడు

మహిళా డాక్టర్‌ను పొడిచి చంపిన ప్రియుడు

రీసెంట్ గా మెడికో స్టూడెంట్ ప్రీతి కేసు మర్చిపోకముందే మరో మహిళా డాక్టర్ పై దారుణం జరిగింది. చిన్న గొడవ కాస్తా పెద్దది కావడంతో ఆమె ప్రియుడు, ఆ మహిళా డాక్టర్ ను కత్తితో పొడిచేశాడు. ఈ ఘటనలో మృతి చెందిన మహిళా డాక్టర్ జమ్మూలోని తల్లాబ్ తిల్లో కు చెందిన సుమేధా శర్మగా పోలీసులు గుర్తించారు. పాంపోష్ కాలనీలో నివసిస్తోన్న జోహార్ అనే వ్యక్తి, సుమేధా గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరిద్దరికీ మధ్య చిన్న గొడవ కావడంతో ఆగ్రహంతో.. వంటగదిలోని కత్తిని తీసుకొచ్చి జోహార్, సుమేధను పొడిచేశాడు. 

ఆ తర్వాత తాను కూడా చనిపోతున్నట్టు ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. పోస్టును గమనించిన బంధువులు, స్నేహితులు  పోలీసులు సమాచారం ఇవ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు... వెంటనే జానీపూర్ లోని జోహార్ ఇంటికి వెళ్లారు. ఇంటికి తాళం వేసి ఉండడంతో పోలీసులు ఇంట్లోకి చొరబడి చూడగా.. రక్తపు మడుగులో సుమేధ మృతదేహం కనిపించింది. ఆ పక్కనే గాయాలతో ఉన్న నిందితుడు జోహార్ కూడా కనిపించాడు. అనంతరం వారిద్దరినీ పోలీసులు ఆస్పత్రికి తరలించినా సుమేధ ప్రాణాలతో బయటపడలేదు. అయితే నిందితుడి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత జోహార్ పై ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) సెక్షన్ 302 (హత్య) కింద కేసు నమోదు చేసిన పోలీసులు...  దర్యాప్తు ప్రారంభించారు. వారిద్దరూ జమ్మూలోని డెంటల్ కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ (BDS) చదివారని వారు తెలిపారు. సుమేధ ఆ తరువాత ఎండీఎస్ చదవడానికి జమ్మూకు వెళ్లగా.. మార్చి 7వ తేదీన హోలీ పండుగ కోసం ఇంటికి వచ్చింది. ఈ  సమయంలోనే ఈ దారుణం చోటుచేసుకుంది.