చిత్రహింసలతో యువతి మృతి.. .సిఐ నిర్లక్ష్యంతో భర్త, అత్తమామలు అమెరికాకు పరార్!

చిత్రహింసలతో యువతి మృతి.. .సిఐ నిర్లక్ష్యంతో భర్త, అత్తమామలు అమెరికాకు పరార్!

ఖమ్మం జిల్లాలో దారుణ సంఘటన  చోటు చేసుకుంది.  పెళ్లై ఏడాది కాక ముందుకే పిల్లలు కాలేదనే నేపంతో అత్తింటివారి  వేధింపులకు ఓ యువతి బలైంది. జిల్లా పట్టణంలో పాకబండ బజార్ కు చెందిన లావణ్యకు జెమిని అనే యువకుడితో యేడాది క్రితం వివాహం అయ్యింది. అయితే, పిల్లలు పుట్టడం లేదని లావణ్యను జెమిని కుటుంబ సభ్యులు చిత్రహింసలు గురిచేశారు. ఆమెను ఎలాగైన వదిలించుకోవాలని  బలవంతంగా విషపు మాత్రలు మింగించారు. రెండు, మూడు రోజలుగా అత్తమామల వేధింపులు భరించలేక లావణ్య పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. అయితే,  సిఐ స్వామి.. లావణ్య మాటలను  పట్టించుకోకుండా తిరిగి పంపించేశాడు. 

దీంతో 2023, నవంబర్ 27వ తేదీ సోమవారం అనారోగ్యానికి గురైన లావణ్య  ఆస్పత్రికి వెళ్లి.. చికిత్స పొందుతూ మృతి చెందింది. విషయం తెలుసుకుని అప్పటికే వీసా తీసుకున్న అత్తమామలతోపాటు భర్త అమెరికాకు పరారయ్యాడు. కూతురు మరణ వార్తాతో లావణ్య తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకుని కన్నీరుమన్నీరయ్యారు. తన కూతురిని భర్తతోపాటు అత్తమామలు చిత్రహింసలు పెట్టి చంపారని ఆరోపించారు. సిఐ స్వామి నిర్లక్ష్యం కారణంగానే లావణ్య మృతి చెందిందని ఆమె కుటుంబ సభ్యులు మృత దేహంతో ఆందోళనకు దిగారు. సిఐ స్వామిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో సంఘటనాస్థలానికి చేరుకున్న ఖమ్మం ఎసిపి హరికృష్ణ.. లావణ్య మృతిపై  విచారణ చేస్తున్నం.. బాధ్యులపై  కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.