నన్నే సీట్లో నుంచి లేవమంటావా.. నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తా: ట్రైన్‎లో ప్రయాణికుడికి మహిళా బెదిరింపులు

నన్నే సీట్లో నుంచి లేవమంటావా.. నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తా: ట్రైన్‎లో ప్రయాణికుడికి మహిళా బెదిరింపులు

పాట్నా: ‘‘నన్నే సీట్లో నుంచి లేవమంటావా.. నీకు ఎంత ధైర్యం.. నువ్వు ఏమైనా తోపు అనుకుంటున్నవా.. ఈ సీటు ఏమైనా మీ అయ్యదా.. నా మనుషులతో నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తా’’ తన రిజర్వ్ సీటు నుంచి లేవమని అడిగినందుకు పురుష ప్రయాణికుడిని ఒక మహిళ ఈ విధంగా దుర్భాషలాడుతూ బెదిరించింది. ఈ ఘటన బీహార్ రాజధాని పాట్నా రైల్వే స్టేషన్‎లో జరిగింది.

తన సీట్లో నుంచి లేవమన్న పాపానికి పురుష ప్రయాణికుడిని నోటికొచ్చినట్లు తిడుతూ బెదిరించడాన్ని తోటి ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్‎గా మారగా.. సదరు మహిళపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. రిజర్వ్ చేసుకున్న సీటు నుంచి లేవమంటే చంపేస్తానని బెదిరిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సదరు మహిళపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

1.17 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో.. తాను రిజర్వ్ చేసుకున్న సీటులో కూర్చొన్న మహిళను లేవమని పురుష ప్రయాణికుడు కోరతాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన మహిళ.. సీటులో నుంచి లేవడానికి నిరాకరిస్తుంది. అంతేకాకుండా తిరిగి సీటు రిజర్వ్ చేసుకున్న వ్యక్తిపైనే దౌర్జన్యానికి దిగింది. నువ్వు ఎవరు అనుకుంటున్నావు..? ఈ సీటు ఏమైనా మీ అయ్యదా..? అంటూ ప్రశ్నించింది. 

ఈ క్రమంలో ప్రయాణీకుడు మహిళను మీ టికెట్ చూపించమని అడగగా ఆమె మరింత రెచ్చిపోయింది. నన్నే టికెట్ చూపించమంటావా.. నీకు ఎంత ధైర్యం.. కొద్దిసేపు వెయిట్ చేయి.. పాట్నాలో గుండాలను పిలిచి నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తా అని ప్రయాణికుడిని భయభ్రాంతులకు గురి చేసింది. తోటి ప్రయాణికులు మహిళా దౌర్జన్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‎గా మారింది. 

రిజర్వ్డ్ సీటు నుంచి లేవమంటే చంపేస్తా అని బెదిరిస్తారా అంటూ సదరు మహిళా తీరుపై మండిపడుతున్నారు. రైలు ప్రయాణాలలో రిజర్వ్ సీటు హోల్డర్లను వేధించే ఇలాంటి బెదిరింపులపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు అధికారులను కోరుతున్నారు. ఈ ఘటనపై రైల్వే శాఖ స్పందించింది. దయచేసి మీ ప్రయాణ వివరాలు, ఫోన్ నంబర్‌ను పంపాలని బాధితుడిని కోరింది.