వీడియో: బ్రెయిన్ సర్జరీ చేస్తుండగా హనుమాన్ చాలీసా పారాయణం

వీడియో: బ్రెయిన్ సర్జరీ చేస్తుండగా హనుమాన్ చాలీసా పారాయణం

న్యూఢిల్లీ: సర్జరీ అంటే ఎవరికైనా భయం భయంగానే ఉంటుంది. కానీ ఆ యువతికి బ్రెయిన్‌ సర్జరీ చేస్తుంటే ఆమె మధ్యలో డాక్టర్లతో మాట్లాడుతూనే ఉంది. తనకు బాగా ఇష్టమైన హనుమాన్ చాలీసా పారాయణం చేసుకుంది. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో గురువారం ఓ యువతికి బ్రెయిన్‌ ట్యూమర్ ఆపరేషన్‌ చేస్తున్న సందర్భంగా జరిగిన సంఘటన ఇది. అయితే ఆ అమ్మాయి ఇదంతా తనంతట తానేం చేయలేదు. సర్జరీ చేసేటప్పుడు బ్రెయిన్ అలెర్ట్‌గా ఉండడం కోసం తనకు ఇష్టమైన పనులు చేయాలని, యాక్టివ్‌గా ఉండాలని కోరడంతో సర్జరీ టైమ్‌లో ఇలా చేసింది. దీనికి సంబంధించిన వీడియోను అర్వింద్ చౌహాన్‌ అనే వ్యక్తి తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశాడు.

యుక్తి అగర్వాల్ అనే 24 ఏండ్ల యువతి కొన్నాళ్లుగా తీవ్రమైన తలనొప్పి, తల తిరగడం లాంటి సమస్యలతో బాధపడుతోంది. దీంతో ఆమె ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చూపించుకుంది. పరీక్షలు చేసిన డాక్టర్లు ఆమెకు బ్రెయిన్‌లో కణతి (ట్యూమర్) ఏర్పడిందని గుర్తించారు. సర్జరీ చేసి, తీసేస్తే ఎటువంటి సమస్య ఉండదని చెప్పారు. దీంతో జులై 22న ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ దీపక్ గుప్తా ఆధ్వర్యంలో ఆపరేషన్ చేశారు. క్లిష్టమైన ఈ సర్జరీ చేసే సమయంలో బ్రెయిన్‌లో కీలకమైన భాగాలపై ఎటువంటి దెబ్బపడకుండా ‘క్రనియోటొమీస్‌’ అనే ఏరియా యాక్టివ్‌గా ఉండాలని డాక్టర్లు సూచించారు.  ఇందుకోసం ఆమెను ఇష్టమైనవి పాడడం లేదా మాట్లాడడం చేయాలని చెప్పారు. దీంతో లోకల్ అనస్తీషియా ఇచ్చి ఆపరేషన్ చేసే పార్ట్‌లో మాత్రమే నొప్పి తెలియకుండా మత్తు ఉండేలా చేశారు. మూడు గంటల పాటు సర్జరీ జరిగితే ఆమె ఆ టైమ్‌లో కొంత సమయం డాక్టర్లతో మాట్లాడడంతో పాటు ఆమెకు ఇష్టమైన హనుమాన్ చాలీసా పారాయణ వంటివి చేసింది. యుక్తి ప్రస్తుతం పూర్తిగా కోలుకుంటోందని డాక్టర్లు చెబుతున్నారు. టీచర్‌‌ కావాలన్నది తన కల అని యుక్తి చెబుతోంది. అందుకే తన మొమొరీ పవర్‌‌ను కోల్పోకుండా ఉండేందుకు డాక్టర్లు ఏదైనా చేయాలని చెప్పడంతో హనుమాన్ చాలీసా పారాయణను ఎంచుకున్నానని తెలిపింది. కాగా, గతంలో లండన్‌లోని కింగ్స్ కాలేజ్ హాస్పిటల్‌లో డ్యాంగర్ టర్నర్ అనే 53 ఏండ్ల వృద్ధుడికి ఇలాంటి ఆపరేషన్ చేస్తుండడగా వయోలిన్‌ ప్లే చేశాడు.