28 ఏండ్లు ఇంట్లోనే కొడుకును బంధించింది

28 ఏండ్లు ఇంట్లోనే కొడుకును బంధించింది

స్టాక్​హోం(స్వీడన్): అనారోగ్యమో  లేక అల్లరి చేసిండనో తెల్వదు కానీ ఓ తల్లి తన పన్నెండేళ్ల కొడుకును ఇంట్లో పెట్టి తాళం వేసింది. ఒక పూటో.. ఒక రోజో కాదు.. ఏకంగా 28 ఏళ్ల పాటు ఓ గదికే పరిమితం చేసింది. చివరకు ఆ తల్లి అనారోగ్యం పాలై హాస్పిటల్​లో చేరితే కొడుకు సంగతి బయటపడింది. ఈ దారుణ సంఘటన స్వీడన్​ రాజధాని స్టాక్​హోం సిటీలో జరిగింది. వివరాలు.. స్టాక్​హోం దగ్గర్లోని హానింగేలో ఉంటున్న డెబ్బై ఏళ్ల ముసలమ్మ అనారోగ్యం పాలైంది. ఈ విషయం తెలిసి దగ్గరి బంధువు ఒకావిడ ఆ ముసలమ్మను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఇంటికి వచ్చింది. అంబులెన్స్​ను పిలిచి, ఆమెను ఆస్పత్రికి తరలించింది. తర్వాత చిందరవందరగా ఉన్న ఇల్లు సర్దుతుంటే ఓ రూమ్ లో 41 ఏళ్ల మధ్యవయస్కుడు కనిపించిండు. సరైన తిండి లేక ఎండిపోయిన శరీరం, బోసి నోరు, సరిగా నడిచే పరిస్థితిలో లేకపోవడంతో ఆయన అదే రూమ్​లో చాలాకాలం పాటు ఉంటున్నట్లు గుర్తించానని ఆ బంధువు తెలిపింది. ఆ తర్వాత ఆ మధ్యవయస్కుడు ఎవరో కాదు ముసలమ్మ కొడుకేనని, గత 28 ఏళ్లుగా అదే రూమ్​లో ఉంటున్నాడని తేలింది. దీంతో పోలీసులకు సమా చారం ఇవ్వగా.. వాళ్లు వచ్చి ఆ మధ్యవయస్కుడిని ఆస్పత్రిలో చేర్చారు. పరీక్షించిన డాక్టర్లు ఆయన ప్రాణానికి ప్రమాదమేమీ లేదని, ట్రీట్​మెంట్​ అందిస్తున్నామని చెప్పారు. ముసలమ్మే తన కొడుకును బంధించి ఉంటుందని అనుమానించి పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ముసలమ్మ మాత్రం తనకేమీ తెలవదని చెబుతోంది.