
జైపూర్: ప్రియుడికి ఇష్టంలేదని ఒక మహిళ తన మూడేండ్ల కుమార్తెను సరస్సులో పడేసింది. అనంతరం ఆ చిన్నారి కనిపించకుండా పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరునాడు సరస్సులో పాప మృతదేహం లభించింది. దర్యాప్తు చేసిన పోలీసులు ఆ మహిళను అరెస్ట్ చేశారు. రాజస్తాన్ లోని అజ్మీర్‌లో ఈ సంఘటన జరిగింది.
ఉత్తరప్రదేశ్ లోని వారణాసికి చెందిన 28 ఏండ్ల అంజలి అలియాస్ ప్రియ తన భర్త నుంచి విడిపోయింది. మూడేండ్ల కుమార్తెతో కలిసి అజ్మీర్ చేరుకుంది. అక్కడ ఓ హోటల్ లో రిసెప్షనిస్ట్ గా పనిచేస్తున్నది. అదే హోటల్‌లో పని చేస్తున్న అల్కేష్ తో కలిసి సహజీవనం చేస్తున్నది. అయితే, మొదటి భర్త ద్వారా జన్మించిన మూడేండ్ల చిన్నారి అంటే అల్కేష్ కు ఇష్టంలేదు.
ఈ విషయంపై అంజలిని ఎగతాళి చేయడంతో పాటు తిట్టసాగాడు. ఈ క్రమంలోనే తన కుమార్తె అడ్డు తొలగించుకోవాలని ఆమె ప్లాన్ వేసింది. సెప్టెంబర్ 16న రాత్రి వేళ బిడ్డను నిద్రపుచ్చింది. ఆ తర్వాత కుమార్తెను భుజంపై వేసుకుని ఇంటి నుంచి బయటకు వెళ్లింది. సమీపంలోని సరస్సులో చిన్నారిని పడేసింది.
అనంతరం అల్కేష్ కు అంజలి ఫోన్ చేసింది. కుమార్తెతో కలిసి ఇంటి నుంచి బయటకు వచ్చానని, అయితే పాప కనిపించడం లేదని ప్రియుడికి చెప్పింది. దీంతో అతడు ఆ ప్రాంతానికి చేరుకున్నాడు. అర్ధరాత్రి వేళ వారిద్దరూ కలిసి ఆందోళనతో నడిచి వెళ్లడాన్ని పెట్రోలింగ్ కానిస్టేబుల్ చూశాడు. ఆరా తీయగా తన బిడ్డతో కలిసి బయటకు వచ్చానని, ఉన్నట్టుండి కుమార్తె ఎటో వెళ్లి తప్పిపోయినట్టు అంజలి చెప్పింది.