హైదరాబాద్ లో వివాహిత దారుణ హత్య

హైదరాబాద్ లో వివాహిత దారుణ హత్య
  • భర్తతో విభేదాలు.. కొన్ని నెలలుగా తల్లితో ఉంటున్న యువతి
  • అల్లుడే చంపేశాడని మృతురాలి తల్లి ఆరోపణ

మియాపూర్, వెలుగు: భర్తకు దూరంగా ఉంటున్న ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన మియాపూర్​ దీప్తిశ్రీనగర్​ సీబీఆర్​ ఎస్టేట్​లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని వైజాగ్​కు చెందిన విజయ్​కుమార్, బండి స్పందన(29)కు 2022 ఆగస్టు 4న పెండ్లయింది. అనంతరం వీరిద్దరూ మియాపూర్​ దీప్తీశ్రీనగర్​లో కాపురం పెట్టారు. మొదటి 10 నెలలు వీరి కాపురం సజావుగా సాగగా, తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థాలు  పెరిగాయి. అప్పటివరకు ప్రైవేట్​బ్యాంకులో పనిచేసిన స్పందన, జాబ్​మానేసి దీప్తీ శ్రీనగర్​ సీబీఆర్​ఎస్టేట్​లోని తల్లి నమృత, సోదరుడితో కలిసి ఉంటోంది.

వినయ్​కుమార్​ స్థానిక స్నేహ చికెన్​సెంటర్​లో అకౌంటెంట్​గా పనిచేస్తున్నాడు. ప్రైవేట్​ స్కూలులో టీచర్​గా పని చేస్తున్న నమృత సోమవారం ఉదయం ఎప్పటి లాగే స్కూల్​కు వెళ్లింది. ఇంట్లో స్పందన ఒంటరిగా ఉంది. ఉదయం 10 గంటల తర్వాత గుర్తుతెలియని వ్యక్తులు ప్లాట్​లోకి చొరబడి కత్తి, ఐరన్ రాడ్డుతో స్పందన మొఖం, శరీర భాగాలపై విచక్షణరహితంగా దాడిచేసి చంపేశారు. తర్వాత బయటి నుంచి ఇంటి మెయిన్​ డోర్​ లాక్​ చేసి పారిపోయారు.

సాయంత్రం 4 గంటలకు స్కూల్​నుంచి ఇంటికి వచ్చిన తల్లి నమ్రుత తాళం వేసి ఉండడడాన్ని చూసి కూతురుకు కాల్​చేసింది. ఎంతకీ ఫోన్​తీయకపోవడంతో పగలగొట్టి ఇంట్లోకి వెళ్లి చూడగా రక్తపు మడుగులో స్పందన విగతజీవిగా పడి ఉంది. సమాచారం అందుకున్న మియాపూర్​పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్​ టీంతో వివరాలు సేకరించారు. మృతురాలి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. అపార్ట్​మెంటులోని సీసీ కెమెరాలను పరిశీలించారు. అయితే స్పందనను హత్య చేసింది ఆమె భర్తేనని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇద్దరి మధ్య గొడవలు జరగడంతో విడివిడిగా ఉంటున్నారని,  విడాకుల కేసు కోర్టు విచారణలో ఉందని పేర్కొన్నారు.