ఛత్తీస్‌గడ్​లో కరోనాపై అవగాహన కల్పిస్తున్న మహిళలు

ఛత్తీస్‌గడ్​లో కరోనాపై అవగాహన కల్పిస్తున్న మహిళలు
  • మాస్కులు కుట్టి ఉచితంగా పంపిణీ
  • ‌ పేదవారికి తిండి అందిస్తున్న మహిళలు

రాయ్‌పూర్‌‌: ఛత్తీస్‌గడ్‌ బలోడ్‌ జిల్లాలోని గ్రామాల్లో మద్యపాన నిషేధం కోసం పోరాటం చేసి అనేక విషయాల్లో గ్రామస్థులకు అవగాహన కల్పించిన మహిళా కమాండోలు ఇప్పుడు కరోనాపై కూడా యుద్ధం చేసేందుకు సిద్ధమయ్యారు. మెరూన్‌ కలర్‌‌ చీరలు కట్టుకుని క్యాప్స్‌, ఫేస్‌మాస్క్‌లతో గ్రామాల్లో తిరుగుతూ అవగాహన కల్పిస్తున్నారు. “ మహిళా కమాండోలు కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. దానిపై విజయం సాధిస్తారు” అంటూ నినాదాలు చేశారు. “ జిల్లాలోని ప్రతి గ్రామంలో అవగాహన కల్పించాలనేదే మా లక్ష్యం. అందుకే జిల్లా అధికారులతో కలిసి ఈ పని చేస్తున్నాం” అని మహిళా కమాండోలను స్టార్ట్‌ చేసిన యాక్టివిస్ట్‌ షంషాద్‌ బేగం చెప్పారు. జిల్లాలోని 400 గ్రామాల్లో మొత్తం 12,500 మంది మహిళలు పనిచేస్తున్నారు. కేవలం కరోనాపై అవగాహన కల్పించడమే కాకుండా గ్రామాల్లోని రోజువారి కూలీలకు, పేదలకు కూడా సహాయపడుతున్నారు. కొంత మంది మహిళలు ఇంట్లో మాస్కులు తయారు చేసి ఫ్రీగా పంచుతున్నారు. పోలీసుల కోసం పనిచేస్తున్న 200 మంది వాలంటీర్లు ( సూపర్‌‌ పోలీస్‌ ఆఫీసర్స్‌) లా అండ్‌ ఆర్డర్‌‌ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 12 జిల్లాల్లో 50వేల మంది ఉమెన్‌ కమాండోలు ఉన్నారని, కానీ బలోడ్‌ జిల్లా అధికారుల సహకారం వల్ల ఈ జిల్లాలో సేవలు ఎక్కువగా చేస్తున్నామని షంషాద్‌ చెప్పారు. డ్రగ్‌ జిల్లాగా పేరు పొందిన బలోడ్‌ను మార్చాలనే ఆలోచనతో 2006లో షంషాద్‌ ఈ మహిళా కమాండోను మొదలుపెట్టి.. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాన్ని కొనసాగిస్తున్నారు.