
- గ్యాస్ లబ్ధిదారుల నుంచి వేలిముద్రలు తీసుకుంటున్న ఏజెన్సీ నిర్వాహకులు
మెదక్ టౌన్, వెలుగు: వంద రోజుల్లో గ్యాస్ సిలిండర్ రూ. 500 కే అందజేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించడంతో ఆయా గ్యాస్ ఏజెన్సీల వద్ద ఈకేవైసీ కోసం లబ్ధిదారులు బారులు తీరుతున్నారు. మంగళవారం మెదక్ పట్టణంలోని గ్యాస్ ఏజెన్సీల వద్ద పెద్ద సంఖ్యలో ఈ-కేవైసీ కోసం మహిళలు మంగళవారం క్యూలో నిలుచున్నారు.
పట్టణంలోని ఫతేనగర్‌లోని భారత్ గ్యాస్ ఏజెన్సీ, హెచ్‌పీ గ్యాస్ ఏజెన్సీల వద్ద ఆఫీసులు తెరవక ముందే ఉదయం 7 గంటల నుంచి వారి ఆధార్ కార్డులు, గ్యాస్ పుస్తకాలను తీసుకొని వచ్చి లైన్లో వేచి ఉన్నారు. ఒక్కో గ్యాస్ ఏజెన్సీ వద్ద సుమారు 300 మంది నుంచి 500 మంది వరకు మహిళా లబ్ధిదారులు బారులు తీరారు. ఆయా గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు ఒక్కొక్కరిని పిలిచి వారి ఆధార్‌కార్డుల తదితర వివరాలను పరిశీలించి ఫింగర్ ప్రింట్ (తంబ్) తీసుకున్నారు. మంగళవారం సాయంత్రం వరకూ లైన్‌లో ఉన్న వారి నుంచి ఫింగర్ ప్రింట్(తంబ్ ఇంప్రెషన్) తీసుకున్నారు.
శివ్వంపేట, వెలుగు: ఈ కేవైసీ కోసం మండలంలోని వివిధ గ్రామాల గ్యాస్ వినియోగ దారులు శివ్వంపేట మండల కేంద్రంలోని వెంకట రమణ భారత్ గ్యాస్ ఏజెన్సీ ముందు మంగళవారం బారులు తీరారు. రద్దీ ఎక్కువగా ఉండటంతో ఎలాంటి గొడవలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కానిస్టేబుల్లు ఈ కేవైసీ కోసం వచ్చిన వారిని క్యూలో నిలబెడుతూ జాగ్రత్తలు తీసుకున్నారు.