ఈసారీ మహిళలకే అందలం.. కార్పొరేషన్ తో పాటు ఆర్మూర్, భీంగల్ స్థానాలు వారికే

ఈసారీ మహిళలకే  అందలం.. కార్పొరేషన్ తో పాటు ఆర్మూర్, భీంగల్ స్థానాలు వారికే

నిజామాబాద్​, వెలుగు: జిల్లాలోని నిజామాబాద్​ మున్సిపల్​ కార్పొరేషన్​ మేయర్​ తో పాటు ఆర్మూర్​, భీంగల్​ మున్సిపల్​ చైర్​ పర్సన్​పదవులు మరోసారి మహిళలకే రిజర్వ్​ అయ్యాయి. మూడు కూడా జనరల్​మహిళలకే దక్కాయి. దీంతో మహిళానేతల్లో ఉత్సాహం కనిపిస్తోంది. ఇక్కడ పదవుల మీద కన్నేసిన కొందరు లీడర్లు రిజర్వేషన్​ తమకు అనుకూలంగా రాకపోవడంతో తమ కుటుంబసభ్యులనైనా బరిలోకి దింపాలని ఆశ పడుతున్నారు. 

నిజామాబాద్​ మున్సిపల్​ కార్పొరేషన్​ మేయర్​గా ఇంతకు ముందు రెండుసార్లు బీసీ మహిళలే ఉన్నారు. రొటేషన్​లో ఈసారి రిజర్వేషన్​ మారుతుందని అన్ని పార్టీల్లోని సీనియర్​ లీడర్లు ఆశలు పెట్టుకున్నారు. కానీ వారి ఆశలు నెరవేరలేదు. ఈసారి పదవి జనరల్​ మహిళకు రిజర్వ్​ అయినా బీసీ నేతలు కూడా గట్టిగానే తమ ప్రయత్నాలు చేస్తున్నారు. 

బీసీ ఉద్యమం ఉధృతంగా సాగడం, నగరంలోనూ బీసీ సామాజికవర్గాలే రాజకీయంగా బలంగా ఉండడం బీసీ నేతలకు కలిసివచ్చేఅవకాశం ఉంది. దీంతో అన్ని పార్టీల్లోనూ నేతలు తమ భార్యలను పోటీ చేయించడానికి రెడీ అవుతున్నారు. 

ఆర్మూర్​లోనూ ఇదివరకు పదేండ్లు మున్సిపల్​ చైర్ పర్సన్​లుగా బీసీ మహిళలు కొనసాగారు. ఈసారి జనరల్​ మహిళకు రిజర్వ్​ అయ్యింది. 2018లో ఏర్పడిన భీంగల్​ మున్సిపాలిటీలో ఇద్దరు బీసీ మహిళలు పదవిని షేర్​ చేసుకోగా ఈసారి భీంగల్​ చైర్ పర్సన్​ పదవి కూడా జనరల్​ మహిళకు కేటాయించారు. బోధన్​ మున్సిపల్ చైర్మన్​ పదవి ఇదివరకు బీసీ మహిళకు రిజర్వ్​ కాగా ఈసారి జనరల్​కు దక్కింది. 

ఐదేండ్ల తర్వాత బోధన్​ మున్సిపాలిటీ స్థానం జనరల్​ కావడంతో అన్ని పార్టీల్లో చైర్మన్​ పదవులకోసం పోటీ తీవ్రంగా ఉంది. 2014లో బోధన్​మున్సిపాలిటీ జనరల్​ కాగా ఎస్సీ నేత చైర్మన్​గా ఎన్నికయ్యారు. అదే తరహాలో ఈసారి కూడా బీసీ, ఎస్సీ వర్గాలకు చెందిన లీడర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. రిజర్వేషన్లు తేలడంతో ఆశావహులు టికెట్ల  వేటలో పడ్డారు.