భుజాలపై డెడ్‌‌బాడీ మోస్తూ 5 కి.మీ. నడిచిన మహిళలు

 భుజాలపై డెడ్‌‌బాడీ మోస్తూ 5 కి.మీ. నడిచిన మహిళలు

మధ్యప్రదేశ్‌‌లోని రేవా జిల్లాలో దారుణం
జిల్లాలో ఒక్క మార్చురీ వ్యానూ అందుబాటులో లేదన్న డాక్టర్లు

రేవా (మధ్యప్రదేశ్): అనారోగ్యంతో మరణించిన తల్లి డెడ్‌‌బాడీని మంచంపై ఉంచి మరో ముగ్గురు మహిళల సాయంతో 5 కిలోమీటర్ల దూరం నడిచి ఇంటికి తీసుకెళ్లిందో కూతురు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌‌ రేవా జిల్లాలో మంగళవారం జరిగింది. అనారోగ్యంతో బాధపడుతున్న 60 ఏండ్ల మహిళ ట్రీట్‌‌మెంట్‌‌ నిమిత్తం మెహ్‌‌సువా గ్రామం నుంచి రాయ్‌‌పూర్‌‌‌‌ కర్చూలియాన్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌‌‌‌కు కూతురితో కలిసి వెళ్లింది. అక్కడ చికిత్స తీసుకుంటూ మరణించింది. అక్కడ మార్చురీ వ్యాన్ అందుబాటులో లేకపోవడం.. వేరే వెహికల్‌‌ ఏర్పాటుకు సమయం పట్టే అవకాశం ఉండడంతో తల్లి డెడ్‌‌బాడీని బంధువులైన మరో మహిళల సహాయంతో నేత మంచంపై ఉంచింది. ఆ మంచాన్ని భుజాలపై మోసుకుంటూ సుమారు 5 కిలోమీటర్ల దూరంలోని ఇంటికి  తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. జిల్లాలోని ఏ ప్రభుత్వ ఆసుపత్రి, హెల్త్ సెంటర్‌‌‌‌లో కూడా మార్చురీ వ్యాన్‌‌లు అందుబాటులో లేవని సీనియర్ మెడికల్ ఆఫీసర్ చెప్పారు. ఇటువంటి సంఘటనలను వీడియో తీసి వైరల్ చేసే కంటే ఒక మార్చురీ వ్యాన్‌‌ను డొనేట్‌‌ చేయాలని డాక్టర్‌‌‌‌ మిశ్రా విజ్ఞప్తి చేశారు.