ఎన్నికల్లో లబ్ధి కోసమే మహిళా బిల్లు : బండి సుధాకర్ గౌడ్

ఎన్నికల్లో లబ్ధి కోసమే మహిళా బిల్లు : బండి సుధాకర్ గౌడ్

హైదరాబాద్, వెలుగు: రాబోయే ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసమే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మహిళా బిల్లును తీసుకొచ్చిందని  పీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్ ఆరోపించారు. 2010లోనే సోనియా గాంధీ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం మహిళా బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టి.. రిజర్వేషన్లు కల్పించాలని ప్రయత్నించిందన్నారు. దాదాపు పదేండ్లుగా పూర్తి మెజారిటీతో అధికారంలో ఉన్న  బీజేపీ ప్రభుత్వం ఇన్ని రోజులు మహిళా బిల్లు ప్రస్తావన ఎందుకు తీసుకురాలేదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

ఎన్నికల ముందు హడావుడిగా బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టడమేంటని ప్రశ్నించారు.  దేశంలో ఓ వైపు జనగణన జరగకుండా, నియోజకవర్గ పునర్విభజన చేయకుండా మహిళా బిల్లు ఆమోదించాలనుకోవడం బీజేపీ అవగాహన రాహిత్యానికి నిదర్శమన్నారు. ఉమ్మడి ఏపీ విభజన చట్టంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన చేయాలని ఉన్నప్పటికీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదని సుధాకర్ గౌడ్ ప్రశ్నించారు.