ఆడవాళ్లు ఇల్లూ నడపగలరూ.. డబ్బూ  సంపాదించగలరు

ఆడవాళ్లు ఇల్లూ నడపగలరూ.. డబ్బూ  సంపాదించగలరు

ఇంటిముందు ఆటో సౌండ్​ వినపడగానే.. ‘‘సురేశ్​...​ కొత్తిల్లు ఫైనల్​ అయ్యిందా’’? అనుకుంటూ  హాల్​లోకి వస్తుంది భార్య. ‘‘ బిల్డర్​కి యాభై కాదు యాభై ఐదు లక్షలు కావాల’’ట అని టెన్షన్​ పడుతూ చెబుతాడు  భర్త. ‘కానీ’, అంటూ ఆమె మాట అందుకునేలోపే ‘అరె ..డబ్బు విషయాల్లో ఆడవాళ్ల జోక్యం ఎందుకు ? నువ్వెళ్లి ‘టీ’  తీసుకురా’ అంటాడు మామగారు. వంటింట్లోకి వెళ్లి టీ పెట్టుకొస్తుంది.  టీతో పాటు ‘‘ఇది నావంతు అంటూ’’ ఆన్​లైన్​ శారీ బిజినెస్​ చేసి ఆమె సంపాదించిన ఐదులక్షల రూపాయల చెక్​ ఇస్తుంది.‘‘మామయ్యా! ఆడవాళ్లు ఇల్లూ నడపగలరూ.. డబ్బూ  సంపాదించగలరు’’ అంటుంది. టీవీలో ఈ యాడ్​ కనిపించిన ప్రతిసారీ  భలే సమాధానం చెప్పింది అనుకోని వాళ్లు ఉండరు.  కానీ  అలా అనుకున్నవాళ్లలో చాలామంది డబ్బు విషయాల్లో ఆడవాళ్ల పట్ల ఉన్న చిన్నచూపుని  మాత్రం ప్రశ్నించరు.

‘నీకేం తెలుసు?’, ‘నువ్వు కూడా సలహాలు ఇస్తావా’?, ‘డబ్బు విషయాల్లో  నీ పెత్తనం ఏంటి?’
ఈ మాటలు  ఎప్పుడో ఒకప్పుడు ప్రతి ఇంట్లో వినిపిస్తాయి అంటే అతిశయోక్తి కాదు. ఆడవాళ్లంటే మూడు పూటలా వంటచేయాలి. ఇంట్లో అందరి బాగోగులు చూసుకోవాలి.  ఎంత సంపాదిస్తున్నా డబ్బు వ్యవహారాల్లో, కుటుంబ నిర్ణయాల్లో తలదూర్చకూడదు. ఆడవాళ్లు అన్నిరంగాల్లో మగవాళ్లతో సమానంగా అడుగులేస్తున్నప్పటికీ..డబ్బు , కుటుంబ నిర్ణయాల్లో  వాళ్ల అభిప్రాయాలకి పెద్దగా విలువ ఉండట్లేదు. ఇలా ఎందుకు జరుగుతోంది? అసలు ఆర్థిక నిర్ణయాల్లో  ఆడవాళ్ల స్థానం ఏంటి? ఈ  సబ్జెక్ట్​లోకి వెళ్లేముందు కొన్ని రియల్​ ఎగ్జాంపుల్స్ చదవాలి.

చిన్నప్పట్నించే చిన్నచూపు
ఆ తండ్రికి కూతురు మీనానే  ప్రపంచం. ఆమె ఏం అడిగినా కాదనడు. ఏం చేయాలనుకున్నా అడ్డుచెప్పేవాడు కాదు. ఎలాంటి కట్టుబాట్లు పెట్టకుండా ఆమెను స్వేచ్ఛగా బతకనిస్తాడు. కానీ, డబ్బు  విషయాలకి వచ్చేసరికి  మీనా మాట పట్టించుకోడు. ‘చిన్న పిల్లవి. నీకేం తెలియదంటూ’  ఆమె మాటను తీసేస్తాడు. యూకేలో పేరున్న యూనివర్సిటీలో బిజినెస్​ అడ్మినిస్ట్రేషన్​ చేసిన కూతుర్ని  తన బిజినెస్​ నిర్ణయాల్లో ఇన్వాల్వ్​ చెయ్యడు. 
మీనా లాంటి ఎంతోమంది ఆడపిల్లల పరిస్థతి ఇది. ఇంటి పనుల్లో సాయం చేయమని కూతురిని అడుగుతారు. కొడుకును అడగరు​. ఇంటి నిర్ణయాల్లో కొడుకు సలహా తీసుకుంటారు. కూతురి అభిప్రాయాన్ని మాట వరసకైనా అడగరు. డబ్బు వ్యవహారాలు చక్కబెట్టే హక్కు, కుటుంబ నిర్ణయాలు తీసుకునే అధికారం మగవాళ్లకే  ఉందన్నట్టు పెంచుతారు మగపిల్లల్ని . ఆడపిల్లల బుర్రల్లోనూ ఇదే ఎక్కిస్తారు.

పొదుపు ఆమె పెండెంట్
పిల్లలు, కుటుంబ బాధ్యతల కోసం  ఉద్యోగాన్ని వదిలేసింది రజిని. ఉదయం టీ, టిఫిన్లు, మధ్యాహ్నం అత్తమామలకి ఇష్టమైన వంటకాలతో లంచ్​, ఈవినింగ్​ శ్నాక్స్​, రాత్రి డిన్నర్...ఎక్స్​ట్రాగా  ఇంటి పనులు. అయినా ఏరోజూ విసిగిపోలేదు. అన్నింటినీ పర్ఫెక్ట్​గా బ్యాలెన్స్​ చేస్తుంది. భర్త బడ్జెట్​లోనే ఇంటి అవసరాలన్నింటినీ తీర్చింది.  కానీ,  సంబంధించిన  నిర్ణయాలు తీసుకునే హక్కు మగవాళ్లదే అంటాడు ఆ భర్త. ఫస్ట్​ తారీఖు రాగానే  షాపు​కెళ్లి సరుకులు కొని తెస్తాడు. కానీ, ఆ నెల మొత్తానికి ఏమేం సరుకులు కావాలి? ఎంతమేర అవసరమో చెప్పేది ఆమే. భర్త  సంపాదన.. పిల్లల చదువులు..ఇతర ఖర్చుల్ని దృష్టిలో పెట్టుకుని ఉన్నంతలోనే  ఇంట్లో వాళ్ల కడుపునింపే తెలివి ఉందామెకి. భర్త ఇంటి ఖర్చుల కోసం ఇచ్చిన కొద్ది మొత్తంలోనే కొంత డబ్బు మిగిల్చి బంగారం కొంటుంది. అదే ఆపదలో ఆదుకుంటుందన్న ఆలోచన ఆమెది.  పొదుపు విషయంలో ఆమెని మించిన వాళ్లు లేరు. ఇన్ని విషయాల్లో ఆమె తెలివితేటలు, మనీ మేనేజ్​మెంట్​ క్లియర్​ కట్​గా ఉన్నా ఆర్థిక వ్యవహాల్లో, ఇంటి నిర్ణయాల్లో  ‘నీకేం తెలుసు?’ అనే మాటతో ఆమెని చిన్నబుచ్చడం  ఎంతవరకు కరెక్ట్?​.

ఇదే స్టడీల మాట 
ఈ సమస్య కేవలం ఒకరిద్దరిదే కాదు మన దేశంలో సగానికిపైగా ఆడవాళ్లది. రీసెంట్​గా వరల్డ్​ ఎకనామిక్​ ఫోరమ్​(డబ్ల్యూఈఎఫ్​)170 అంశాల ఆధారంగా ప్రపంచ వ్యాప్తంగా స్ర్తీ ఫురుషుల సమానత్వంపై ఒక లిస్ట్​ తయారుచేసింది​. ఆ  లిస్ట్​లో  మనదేశం 129 వ స్థానంలో ఉంది.  ఇంతకు ముందు ఇదే లిస్ట్​లో 108 వ స్థానంలో ఉన్నాం. 21 స్థానాలు కిందికి దిగడానికి  కారణం ఆడవాళ్లకి తక్కువ జీతాలు ఇవ్వడం, డబ్బు వ్యవహారాల్లో వాళ్లని భాగస్వామ్యం చేయకపోవడమే  అని  డబ్ల్యూఈఎఫ్ చెబుతోంది​.  భారత ప్రభుత్వం విడుదల ​ చేసిన ఐదో  నేషనల్​ ఫ్యామిలీ హెల్త్​ సర్వేలోనూ  మనీ విషయాల్లో ఆడవాళ్ల ప్రమేయం ఉండట్లేదని తేలింది.
17 రాష్ట్రాలు, ఐదు కేంద్రపాలిత ప్రాంతాలు పాల్గొన్న ఈ సర్వేలో ఇంటికి సంబంధించిన వస్తువులు కొనే విషయంలో మాత్రం ఆడవాళ్లకి పాత్ర బాగానే ఉందని తేలింది. వస్తువులు కొనే విషయంలో బీహార్​, నాగా​లాండ్​, మిజోరాంలలో  ఆడవాళ్ల నిర్ణయాలే ఎక్కువగా ఉన్నాయి. కానీ, ఇంటికి సంబంధించిన ఆర్థిక నిర్ణయాల్లో మాత్రం మగవాళ్ల మాటే ఫైనల్​. అలాగే ఎల్​ఎక్స్​​ ఎమ్​ ఈ 2020 సర్వే ప్రకారం 66 శాతం మంది సింగిల్​ విమెన్స్​లో 28 శాతం మంది డబ్బు విషయాల్లో తండ్రిపైనే ఆధార పడుతున్నారు. పెళ్లైన ఆడవాళ్లలో 69 శాతం మంది భర్త నిర్ణయాలకే తలూపు తున్నారు. పిల్లలున్న ఆడ వాళ్లలో 
24 శాతం మంది మాత్రం డబ్బు  విషయాల్లో స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్తోంది ఈ స్టడీ. 

డబ్బు విషయంలో ఇంట్లోనే  కాదు ఆఫీసుల్లోనూ ఆడవాళ్లంటే చిన్నచూపే. ఆఫీసుల్లో  పై అధికారిగా ఆడవాళ్లుంటే మగవాళ్లు పనిచేయడానికి కూడా ఇష్టపడట్లేదని చాలా స్టడీలు చెప్తున్నాయి. పైగా జీతాల విషయంలోనూ ఆడవాళ్లంటే చిన్నచూపే.  ఆడవాళ్ల పేరు మీద ఆస్తిపాస్తులు కూడా పెద్దగా రాయరు. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలంటే జనాల మైండ్​ సెట్​ మారాలి. అది మన ఇంటినుంచే మొదలవ్వాలి. ప్రతి ఇంట్లో ఆడపిల్లల్ని కుటుంబ నిర్ణయాల్లో భాగం చేయాలి.  చిన్నప్పట్నించీ కుటుంబ ఖర్చులు, పొదుపు గురించి అవగాహన కల్పించాలి. ముఖ్యంగా మగపిల్లల్ని ఆడపిల్లల పట్ల గౌరవంతో పెంచాలి.
::: ఆవుల యమున