లాక్‌డౌన్‌ వేళ.. ఆ ఊరికి కాపలాగా మహిళలు

లాక్‌డౌన్‌ వేళ.. ఆ ఊరికి కాపలాగా మహిళలు
  • కరోనా రాకుండ.. ఊరి బాగు కోసం
  •  జమ్మూలోని చత్తాపిండ్‌ గ్రామంలో డ్యూటీ చేస్తున్నరు

చత్తాపిండ్‌(జమ్మూ) : లాక్‌డౌన్‌ కారణంగా దేశంలోని ప్రతి పల్లెలో, మారుమూల ప్రాంతంలో పోలీసుల పహారా కనిపిస్తోంది. కరోనా వ్యాప్తి చెందుతోందని, ఎవరూ బయటకు రావొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఎటూ పోనీకుండా కాపలా కాస్తున్నారు. కానీ.. జమ్మూలోని చత్తాపిండ్‌ అనే ఊరిలో మాత్రం ఆడవాళ్లు లాఠీలు పట్టుకుని కనిపించారు. ఇళ్లలో నుంచి ఎవరూ బయటకు రాకుండా.. గ్రామంలోకి బయటి వారు రాకుండా కాపలా కాస్తున్నారు. మాజీ సర్పంచ్‌ గుర్మీత్‌ కౌర్‌ ఆధ్వర్యంలో వాళ్లంతా పొద్దున 9 నుంచి 4 గంటల వరకు డ్యూటీ చేస్తున్నరు. “ కరోనా భయంకరమైన వ్యాధి. ప్రభుత్వం, పోలీసులకు మనం సహకరించాలి. అందుకే మా ఊరిని మేం కాపాడుకునేందుకు డ్యూటీ చేస్తున్నాం. పోలీసులకు కొంత ఉపశమనం కలిగించేందుకు హెల్ప్‌ చేస్తున్నాం” అని గుర్మిత్‌ కౌర్‌‌ చెప్పారు. ఈ రోగం వల్ల వచ్చే నష్టం తెలియక చాలా మంది బయట తిరుగుతున్నారని, వాళ్లకు అవగాహన కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. కరోనా ఒకరికి వస్తే అది పదిమందికి వ్యాపిస్తుందని, జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామ ప్రజలకు వివరిస్తున్నామని చెప్పారు. జమ్మూకాశ్మీర్‌‌లో కరోనా వల్ల ఇప్పటికి నలుగురు చనిపోయారు. జమ్మూ రీజన్‌లో ఇప్పటికి ఒక మరణం నమోదైంది. ఇప్పటి వరకు 188 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని అధికారులు చెప్పారు. జమ్మూకాశ్మీర్‌‌ పరిధిలో 26 రెడ్‌జోన్లను గుర్తించామన్నారు.