
- వరుసగా రెండు ఓటములతో డీలా.. కెప్టెన్ హర్మన్‌పై తీవ్ర ఒత్తిడి
వరుసగా రెండు విజయాలు. ఆ వెంటనే రెండు పరాజయాలు. నాలుగు మ్యాచ్‌ల్లో నాలుగు పాయింట్లతో నాలుగో ప్లేస్. సొంతగడ్డపై వన్డే వరల్డ్ కప్‌లో టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఇండియా విమెన్స్ టీమ్ పెర్ఫామెన్స్ ఇది. మొదటి రెండు మ్యాచ్‌ల్లో ఆసియా జట్లు శ్రీలంక, పాకిస్తాన్‌ను చిత్తుగా ఓడించి టోర్నీని ఘనంగా ప్రారంభించిన ఇండియా.. ఆపై ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా చేతిలో ఓడిపోయి డీలా పడింది. ఆ రెండింటిలోనూ గెలుపు అంచుల వరకూ వచ్చి ఓడిన హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలోని జట్టు ఇప్పుడు డిఫెన్స్‌లో పడింది.
ఇంకోవైపు డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా వరుసగా నాలుగు విజయాలతో సెమీఫైనల్ చేరుకోగా.. రన్ రేట్, ఇతర లెక్కలతో సంబంధం లేకుండా ఇండియా నేరుగా నాకౌట్ బెర్తు సొంతం చేరుకోవాలంటే ఇంగ్లండ్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌తో జరిగే మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో నెగ్గాలి. సెమీస్ రేసులో ఉండాలంటే కనీసం రెండింటిలో అయినా గెలవాల్సిందే. స్వదేశంలో టోర్నీలో కనీసం సెమీస్ కూడా చేరుకోకపోతే పరువు పోతుంది. దాంతో ఇప్పుడు హర్మన్‌సేన తీవ్ర ఒత్తిడిలో ఉంది. ఇంగ్లండ్, న్యూజిలాండ్ రెండూ బలమైన ప్రత్యర్థులు కాగా.. బంగ్లాను కూడా తక్కువగా అంచనా వేయడానికి లేదు. పాక్‌ను ఓడించిన ఆ టీమ్.. ఇంగ్లండ్, సౌతాఫ్రికా జట్లకు చెమటలు పట్టించింది. ఈ నేపథ్యంలో గత రెండు మ్యాచ్‌ల్లో చేసిన తప్పిదాలను వెంటనే సరిదిద్దుకొని ఇండియా అమ్మాయిలు టోర్నీని సరికొత్తగా ప్రారంభించాల్సి ఉంటుంది.
కెప్టెన్, బ్యాటర్‌గా హర్మన్ ఫెయిల్
క్లిష్ట పరిస్థితుల్లో జట్టును ముందుండి నడిపించాల్సిన హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్‌గా, బ్యాటర్‌గా నిరాశపరచడం ఆందోళన కలిగిస్తోంది. హర్మన్‌ప్రీత్‌కు ఇది ఐదో వన్డే వరల్డ్ కప్ కాగా, కెప్టెన్‌గా ఇదే మొదటిది. ఆమె కెప్టెన్సీలో ఇండియా 2023 టీ20 వరల్డ్ కప్‌లో సెమీ-ఫైనల్లో ఓడి, 2024లో గ్రూప్- స్టేజ్‌తో సరిపెట్టింది. తాజా టోర్నీని రెండు విజయాలతో ఘనంగా ప్రారంభించినా, వైజాగ్‌లో ఎదురైన ఓటములతో ఆమె కెప్టెన్సీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తన డిఫెన్సివ్ ఫీల్డ్ సెట్టింగ్స్ దెబ్బకొట్టాయి. ప్రత్యర్థి బ్యాటర్లు ఒత్తిడిలో ఉన్నప్పుడు కూడా సులభంగా సింగిల్స్ తీసేలా ఫీల్డింగ్ సెట్ చేయడం జట్టుకు నష్టం చేకూరుస్తోంది. సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో చివరి ఓవర్లలో, ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో ఎలీస్ పెర్రీ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కూడా ఇదే పునరావృతమైంది.
ఇక, కెప్టెన్‌గా ఆటకు ఒక అడుగు ముందుండాల్సిన హర్మన్, చాలా సందర్భాల్లో ఆలస్యంగా స్పందిస్తోంది. బౌండరీలు వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతంలో ఫీల్డర్లను మోహరించడం వంటి ఆలస్యపు నిర్ణయాలు జట్టుకు నష్టం చేకూరుస్తున్నాయి. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో స్పిన్నర్ దీప్తి శర్మ బౌలింగ్‌లో ఎలీస్ పెర్రీ బ్యాట్ ఎడ్జ్ తీసుకున్నప్పుడు స్లిప్‌లో ఫీల్డర్ లేకపోవడం హర్మన్ వ్యూహాత్మక తప్పిదానికి నిదర్శనం. లీడర్‌గానే కాకుండా బ్యాటర్‌గా కూడా హర్మన్‌ప్రీత్ ఘోరంగా విఫలమవుతోంది. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో 17.75 యావరేజ్‌తో 71 రనస్ మాత్రమే చేసిన ఆమె, ఒక్కసారి కూడా కీలక ఇన్నింగ్స్ ఆడలేకపోయింది. క్రీజులో కుదురుకున్నట్లు కనిపించిన ప్రతీసారి ఓ చెత్త షాట్‌తో పాయింట్ రీజియన్‌లో క్యాచ్ ఇస్తోంది. వరల్డ్ కప్స్‌లో బ్యాటర్‌గా హర్మన్‌కు 26 ఇన్నింగ్స్‌లో 947 రన్స్‌తో అద్భుతమైన రికార్డు ఉంది. కానీ, ఈసారి ఆమె వైఫల్యం మిడిలార్డర్‌పై తీవ్ర ఒత్తిడిని పెంచుతోంది.
డాట్ బాల్స్‌తో డీలా
ఇండియా జట్టు బ్యాటింగ్‌ను వెంటాడుతున్న మరో ప్రధాన సమస్య డాట్ బాల్స్. కీలక బ్యాటర్లు సైతం రన్స్ చేయడానికి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. సౌతాఫ్రికాపై 58.4 శాతం, పాకిస్తాన్‌పై 55.7 శాతం చొప్పున డాట్ బాల్స్ ఆడిన ఇండియా..ఆస్ట్రేలియాపై భారీ స్కోరు చేసినా కూడా 45.2 శాతం బాల్స్‌ను వృథా చేసింది. ఓపెనర్లు స్మృతి మంధాన (56.4), ప్రతీక రావల్ (60.8), హర్లీన్ డియోల్ (54.6) ఎక్కువ డాట్ బాల్స్ పర్సెంటేజ్‌తో స్లోగా ఆడుతుండటం వల్ల, జట్టు ఆశించిన స్కోర్లు చేయలేకపోతోంది.
బౌలింగ్ కాంబినేషన్ మార్చాల్సిందే
కేవలం ఐదుగురు బౌలర్ల వ్యూహంతో బరిలోకి దిగడం కూడా జట్టుకు ప్రతికూలంగా మారింది. మెయిన్ బౌలర్లలో ఎవరైనా ఫెయిలైతే, ఆరో బౌలర్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఆస్ట్రేలియా ఎనిమిది మంది, ఇంగ్లండ్ ఏడుగురు బౌలర్లతో కూడిన మల్టిపుల్ బౌలింగ్ ఆప్షన్లతో ఆడుతున్నాయి. ఇండియా మాత్రం ఈ విషయంలో చాలా వెనుకబడి ఉంది. ఆల్‌రౌండర్ రాధా యాదవ్‌ను జట్టులోకి తీసుకురావడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చని మాజీలు, విశ్లేషకులు సూచిస్తున్నారు. ఆదివారం ఇండోర్‌లో ఇంగ్లండ్‌తో జరగనున్న మ్యాచ్ ఇండియాకు చావోరేవో కానుంది. ఇప్పుడు అందరి ఫోకస్ హర్మన్‌పైనే ఉంది. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ కెప్టెన్లు హీలీ, వోల్‌వర్ట్, సోఫీ డివైన్ మాదిరిగా ఇంగ్లండ్‌పై హర్మన్ బ్యాటర్‌గా, లీడర్‌గా ముందుండి నడిపిస్తుందేమో చూడాలి.