మా ప్రాణాలు ముఖ్యం.. డీహెచ్ఎంఓ మాకొద్దు

V6 Velugu Posted on Sep 28, 2021

  • హెల్త్ వర్కర్లపై పని ఒత్తిడి
  • రోజుకు 12 గంటల డ్యూటీ
  • హాలిడేస్‌లోనూ విధులకు రమ్మంటున్నారు
  • సెలవు పెడితే సస్పెండ్ చేస్తామని బెదిరింపులు
  •  చచ్చిపోవాలని అనిపిస్తోందని
  • ఓ ఏఎన్‌ఎం ఆడియో మెసేజ్

ఇట్లయితే ప్రమాదమే!
వ్యాక్సినేషన్ టార్గెట్ రీచ్ అవడం కోసం ఏఎన్‌ఎంలపై విపరీతమైన ప్రెజర్ పెట్టారు. పీహెచ్‌సీల నుంచి వ్యాక్సిన్ తెచ్చుకోవడం, వ్యాక్సిన్ వేయడం, ఆ వివరాలు ఆన్‌లైన్ చేయడం, టెస్టులు చేయడం, ఆ వివరాలు ఆన్‌లైన్ చేయడం, వ్యాక్సిన్ మిగిలితే మళ్లీ పీహెచ్‌సీకి వెళ్లి అప్పజెప్పడం సహా ఏ పని ఉన్నా ఏఎన్‌ఎంలే చేసుకోవాలని చెబుతున్నారు. ఆదివారం కూడా సెలవు ఇవ్వడం లేదు. ఒత్తిడిలో పనిచేయడం వల్ల వ్యాక్సిన్ వేసేటప్పుడు ఏదైనా పొరపాటు జరిగితే ప్రజల ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. ఆ విషయాన్ని ఆఫీసర్లు అర్థం చేసుకోవడంలేదు. ఆశాలు, ఏఎన్‌ఎంల మానసిక, శారీరక పరిస్థితిని బట్టి పనిచేయించుకోవాలి. ఏఎన్‌ఎంలు, ఆశాలకు ఇప్పటివరకూ వేతనాలు పెంచలేదు. రిస్క్ అలవెన్స్ ముచ్చటే లేదు.  - సుదర్శన్‌ మదన్‌, జనరల్ సెక్రటరీ,  వైద్య, ప్రజారోగ్య ఉద్యోగుల సంఘం.

హైదరాబాద్, వెలుగు:  క్షేత్రస్థాయి హెల్త్ వర్కర్లపై ప్రభుత్వం రోజు రోజుకూ పనిభారం పెంచుతోంది. ఇన్నాళ్లు నత్తనడకన సాగిన వ్యాక్సినేషన్‌ను పరుగులు పెట్టిస్తోంది. ఇందులో భాగంగా రోజూ 3 లక్షల మందికి వ్యాక్సిన్ వేయాలంటూ హెల్త్ వర్కర్లకు భారీ టార్గెట్లు పెట్టింది.  సబ్ సెంటర్లలో ఉదయం 8 గంటలకే వ్యాక్సినేషన్‌ను ప్రారంభించాలని ఆదేశించిన ఆఫీసర్లు ఆలస్యమైతే షోకాజ్‌ నోటీసులు ఇస్తున్నారు. ఇటీవల జోగులాంబ గద్వాల జిల్లాలో ఓ ఏఎన్‌ఎంను సస్పెండ్ చేసి, మరో ఇద్దరికి షోకాజ్ నోటీసు ఇచ్చారు. ఉదయం 7 గంటలకు ఇంట్లో నుంచి బయటకు వస్తే, పని ముగించుకుని ఇంటికెళ్లే సరికి రాత్రి 8 గంటలు అవుతోందని ఏఎన్‌ఎంలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  ప్రస్తుతం రోజూ 4 లక్షల మందికి వ్యాక్సిన్ వేస్తున్నారు. 70 వేల మందికి టెస్టులు చేస్తున్నారు. ఈ వివరాలను మొత్తం ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. ఈ పనంతా పూర్తి చేసేసరికి రోజూ రాత్రి 8 గంటలు అవుతోందంటున్నారు. ఈ పనులకు తోడు యాంటినాటల్ చెకప్స్‌, ఎన్‌సీడీ రోగులకు మందుల పంపిణీ, ఫీవర్ సర్వే, ఇతర రెగ్యులర్ కార్యక్రమాలన్నీ ఆశాలు, ఏఎన్‌ఎంలతో చేపిస్తున్నారు. దీంతో వారు తీవ్ర ఒత్తిడికి గురి అవుతున్నారు. ఈ ఒత్తిడి తట్టుకోలేక సూసైడ్ చేసుకోవాలని అనిపిస్తోందని ఓ ఏఎన్‌ఎం పెట్టిన ఆడియో మెసేజ్ వైరల్​ అయి.. ఆరోగ్యశాఖలో చర్చనీయాంశంగా మారింది. 
జీతాలు అంతంతే
కరోనా మొదలయినప్పటినుంచి హెల్త్ వర్కర్లకు తీరిక ఉండడం లేదు. తొలుత టెస్టింగ్, కాంటాక్ట్ ట్రేసింగ్, పాజిటివ్ కేసుల మానిటరింగ్, ఆ తర్వాత ఫీవర్ సర్వేలు, మందుల పంపిణీ, ఇప్పుడు వ్యాక్సినేషన్‌.. దాదాపు ఏడాదిన్నర నుంచి హెల్త్​ స్టాఫ్​ రోజూ బిజీగా గడుపుతున్నారు. ఇంతలా పనిచేస్తున్నా వాళ్లకు వచ్చేది అత్తెసరు జీతాలే కావడం గమనార్హం. ఇప్పుడు ఇస్తున్న జీతాలను  30 శాతం పెంచుతామని చెప్పిన సర్కార్, ఇంకా ఆ హామీ నెరవేర్చలేదు. ఇటీవలే రాష్ట్రవ్యాప్తంగా ఆశాలు, ఏఎన్‌ఎంలు అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేశారు. ఏఎన్‌ఎంలు, ఆశాలు నేషనల్ హెల్త్ మిషన్ పరిధిలో పనిచేస్తున్నందున జీతాలు పెంచడం తమ పరిధిలో లేదని ప్రభుత్వం తప్పించుకుంటోంది. అయితే, ప్రభుత్వం తలుచుకుంటే జీతాలు పెంచొచ్చునని, ఇతర రాష్ర్టాల్లో కంటే మన దగ్గర ఎన్‌హెచ్‌ఎం వర్కర్లకు తక్కువ వేతనాలు ఉన్నాయని ఆఫీసర్లు చెబుతున్నారు. మరోవైపు, నెలకు పది శాతం  చొప్పున కరోనా అలవెన్స్‌లు ఇస్తామని చెప్పిన సర్కారు, ఇప్పటివరకూ అవి కూడా ఇవ్వలేదు.

ఈ డీఎంహెచ్ వో మాకొద్దు

వనపర్తి టౌన్, వెలుగు: కిందిస్థాయి సిబ్బంది మీద ఒత్తిడి పెంచుతూ ప్రాణాలతో చెలగాటమాడుతున్న వనపర్తి జిల్లా ఇంచార్జి డీఎంహెచ్ఓ చందునాయక్ తమకొద్దంటూ ఏఎన్ఎంలు సోమవారం  డిస్ట్రిక్ట్​ హాస్పిటల్​ ముందు ధర్నా చేశారు. పైఆఫీసర్ల దగ్గర మంచిపేరు కోసం ఆయన తమను వేధింపులకు గురిచేస్తున్నారని వాపోయారు. పెబ్బేరు పీహెచ్ సీలో పనిచేస్తున్న ఫస్ట్ ఏఎన్ఎం భాగ్యమ్మ (40) పని ఒత్తిడి కారణంగా అనారోగ్యానికి గురై ఆదివారం చనిపోయిన విషయం తెల్సిందే. సోమవారం హాస్పిటల్​లో  భాగ్యమ్మ మృతదేహాన్ని ఉంచి జిల్లాలోని ఏఎన్ఎంలు, ఆశకార్యకర్తలు, హెల్త్ స్టాఫ్​ధర్నాకు దిగారు. భాగ్యమ్మ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.  ఆమె కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని, పిల్లల చదువుల బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలని కోరారు. ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, హెల్త్​ స్టాఫ్​ను వేధించడం ఆపాలని,  పనిభారం తగ్గించాలని డిమాండ్‌ చేశారు. ప్రతి ఉద్యోగికి ఆదివారం సెలవు ఇవ్వాలని, 8గంటల పని మాత్రమే చేయించుకోవాలన్నారు. కొవిడ్ వ్యాక్సిన్​ స్పెషల్​ డ్రైవ్ చేస్తున్న సిబ్బందికి వాహన సౌకర్యం కల్పించాలన్నారు.  వ్యాక్సినేషన్​  డేటా ఎంట్రీ పనులను  ఏఎన్ఎం లకు ఇవ్వొద్దని, ప్రత్యేకంగా  కంప్యూటర్ ఆపరేటర్ ను ఏర్పాటు చేయాలని అన్నారు. ఆరోగ్య సమస్యలు ఉన్న  సిబ్బందికి  సెలవులు ఇవ్వాలని, ఖాళీ పోస్టులను భర్తీ చేసి పని భారం తగ్గించాలన్నారు.  ప్రతి హెల్త్ స్కీం కు సంబంధించి టార్గెట్లు పెట్టి భయభ్రాంతులకు గురిచేస్తున్న ఇన్‌చార్జి డీఎంహెచ్ వో ను వెంటనే విధులనుంచి తప్పించాలన్నారు. వనపర్తి సీఐ ప్రవీణ్ కుమార్, టౌన్ ఎస్ఐ మధుసూదన్ ఎంత నచ్చజెప్పినా వారు ఆందోళన విరమించలేదు. దీంతో జిల్లా అడిషనల్ కలెక్టర్ వేణుగోపాల్, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్ వచ్చి మాట్లాడినా వారు వినలేదు.  జిల్లా కలెక్టర్ షేక్ యాస్మీన్ బాషా వచ్చి హామీ ఇచ్చేవరకు మృతదేహాన్ని కదిలించేదిలేదని పట్టుబట్టారు. చివరకు కలెక్టర్ వచ్చి భాగ్యమ్మ కుటుంబాన్ని ఆదుకుంటామని, వారి పిల్లలను రెసిడెన్షియల్​ స్కూళ్లలో చదివిస్తామని హామీ ఇచ్చారు.ఏఎన్ఎం లు, ఆశాకార్యకర్తలపై పనిభారం తగ్గించడం తదితర  డిమాండ్లను పరిశీలించి,  న్యాయం చేస్తామని చెప్పారు. డీఎంహెచ్ వోపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు. కలెక్టర్ హామీతో ఏఎన్ఎం లు ఆందోళన విరమించి మృతదేహాన్ని ఆమె స్వగ్రామానికి తరలించారు.  వైద్య సిబ్బంది  ఆందోళన కు ఏఐసీసీ కార్యదర్శి జిల్లెల చిన్నారెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు, ఎండీ జబ్బార్  మద్దతునిచ్చారు.

Tagged Telangana, Health Workers, work pressure,

Latest Videos

Subscribe Now

More News