వట్టి చేతులతోనే మురికి కాలువలు తీస్తున్న కార్మికులు

వట్టి చేతులతోనే మురికి కాలువలు తీస్తున్న కార్మికులు

ఒక చేతికి ప్లాస్టిక్ కవర్ కట్టుకొని మురికికాలువ చెత్తను ఎత్తుతున్న మున్సిపల్ పారిశుధ్య కార్మికురాలు లక్ష్మి.  రోజూ ఉదయం 5 గంటలకు డ్యూటీకి వస్తుంది. నిత్యం మురికి కాలువలోంచి తీసిన చెత్తను చేతులకు ఎలాంటి గ్లౌజులు లేకుండానే తొలగిస్తుంది. చెత్తలో ఉండే గాజు  ముక్కలు, వైర్లు, మొలలు  కుచ్చుకొని రక్తం వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇలా ఏడాది నుంచి చేతులకు గ్లౌజ్ లు, కాళ్లకు చెప్పులు లేకుండానే విధులు నిర్వహిస్తోంది. అధికారులు మాత్రం పారిశుధ్య కార్మికులకు కనీసం భద్రత కిట్లను పంపిణీ చేయకుండా నిర్లక్ష్యం చేయడంతో   ప్రమాదం పొంచిఉందని కార్మిక సంఘాల నాయకులు వాపోతున్నారు. 

ఆదిలాబాద్, వెలుగు :ఆదిలాబాద్ మున్సిపాలిటీలో మురికికంపును ఎత్తేస్తూ..ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణం కోసం కష్టపడే పారిశుధ్య కార్మికులను మాత్రం పట్టించుకోవడం లేదు. నిబంధనల ప్రకారం ఇవ్వాల్సిన గ్లౌజ్లు, బూట్లు, కొబ్బరి నూనె, చెప్పులు, యూనిఫాం, హెల్మెట్, మాస్క్​లు, బెల్లం వంటివి ఎప్పుడిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. ఇక్కడ 390 మంది పారిశుధ్య కార్మికులు పనిచేస్తున్నారు. వీరి భద్రత కోసం అధికారులు కనీసం ఆరు నెలలకు ఒకసారైన కిట్లను అందించాల్సి ఉంటుంది. కానీ అవేమి ఇవ్వకపోవడంతో కార్మికులు మురికి కాలువల్లో గ్లౌజ్ లు, బూట్లు లేకుండానే చెత్తను తొలగించడం, ట్రాక్టర్లలో ఎత్తి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. తమకు ఏమైనా అధికారులు పట్టించుకోవడం లేదని, చెత్తను తీసే క్రమంలో కాళ్లకు బూట్లు లేకుండానే మురికి కాలువలో దిగి పనిచేయాల్సి వస్తోందని.. ఇలాంటి సమయంలో పలుమార్లు ఇనుప, సీస వస్తువులు గుచ్చుకొని అనారోగ్య బారిన పడుతున్నామని వాపోతున్నారు. కిట్ల పంపిణీ ఆలస్యం చేస్తుండటంతో చెత్తను తొలగించే సమయంలో కొంత మంది ప్లాస్టిక్ కవర్లు చేతులకు కట్టుకుంటున్నారు.  సొంతంగా బూట్లు కొనుక్కుంటున్నారు.  ఇటు గత రెండు నెలలుగా జీతాలు లేక కార్మికులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. 

ఈఎస్ఐ, పీఎఫ్ కార్డులు కూడా ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ ఆఫీస్ ఎదుట ధర్నా చేసిన అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. 

బూట్లు, గ్లౌజ్ లు లేక మస్తురోజులవుతుంది..

ఎప్పటికప్పుడు మురికికాలువల్లోకి దిగి చెత్త తీసుడుచేస్తాం. మాకు చేతికి గ్లౌజ్ లు, కాళ్లకు బూట్లు ఉంటే ఎలాంటి సమస్య రాదు. కానీ ఇవేమి లేకుండానే చెత్తను తీయాల్సి వస్తోంది. ఈకిట్లు ఇచ్చి మస్తురోజులవుతుంది. ఆరు నెలలకు ఒకకసారైనా అన్ని వస్తువులు ఇస్తే మంచిగుంటది.

 శివ్వన్న, పారిశుధ్య కార్మికుడు

ప్రపోజల్ పంపినం

పారిశుధ్య కార్మికులకు భద్రత కిట్ల కోసం ప్రభుత్వానికి ప్రపోజల్ పంపినం. మరో 15 రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. వచ్చిన వెంటనే అందజేస్తాం. ఆర్నెళ్ల కిందట కిట్లు అందించినం. కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని కిట్లను అందిస్తున్నాం.  

నరేందర్, శానిటరీ ఇన్​స్పెక్టర్​ ఆదిలాబాద్