ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

నిర్మాణానికి రూ.2.16 కోట్లు కట్టిన 54 మంది టేడర్లు

పిల్లర్ల కోసం తవ్వేకొద్దీ నీటి ఊట

ముందుకు సాగని పనులు

మహబూబ్​నగర్​, వెలుగు: దేవరకద్ర మండల కేంద్రంలో ఈరప్పయ్య టెంపుల్​ షాపుల కాంప్లెక్స్​ నిర్మాణ పనులు ఆగం అవుతున్నాయి. సరైన ప్లాన్​ లేకపోవడంతో పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. తవ్వే కొద్ది నీటి ఊటలు రావడంతో భూమి బాగోలేకపోవడంతో కాంట్రాక్టర్​ పనులు చేయలేక చేతులెత్తేశాడు. షాపుల కోసం డీడీలు కట్టిన ట్రేడర్లు మాత్రం ఆ పైసలు తిరిగి రాక, అప్పులు చేసి డీడీలు కట్టిన పైసలకు మిత్తీలు కట్టలేక తండ్లాడుతున్నామని ఆందోళన చేస్తున్నారు. ఎండోమెంట్​ పరిధిలో ఉన్న ఈ ఆలయానికి సర్వే నంబర్​ 541లో 16.19 ఎకరాల భూమి ఉంది. ఇందులో షాపింగ్​ కాంప్లెక్స్​లు కట్టాలని 2016లో అప్పటి ఆలయ చైర్మన్​, ఈవోలు ప్రపోజల్స్​ పెట్టారు. 2019లో ఎండోమెంట్​ కమిషనర్​ నుంచి పర్మిషన్​ వచ్చింది.

షాపులను డోనర్స్​కు అప్పగించాలని, మొత్తం మూడు ఫేజ్​లుగా షాపులు కట్టేందుకు ప్లాన్​ వేశారు. ఫస్ట్​ ఫేజ్​లో 17, సెకండ్​ ఫేజ్​లో 20, థర్డ్​ ఫేజ్​లో 17 షాపులు ఉండేట్లు నిర్ణయించారు. కానీ, ఇంజినీరింగ్ సెక్షన్ ఇన్వాల్​మెంట్​ లేకుండా వాల్యూ వేశారు. టెండర్లు పిలిచి ఒక్కొక్కరి నుంచి రూ.4 లక్షల చొప్పున మొత్తం రూ.2.16 కోట్లు డీడీలు కట్టించుకున్నారు. పనులను ఓ కాంట్రాక్టర్​కు   అప్పగించారు. 

కానీ, కాంట్రాక్టర్లు పనులు మొదలు పెట్టగానే పిల్లర్ల కోసం తవ్వేకొద్ది ఊట నీరు వస్తుండటంతో పనులు ఆపేశాడు. విషయం తెలుసుకున్న అప్పటి ఎస్ఈ స్థలాన్ని పరిశీలించారు. మొత్తం నల్లరేగడి భూమి ఉందని, పది ఫీట్ల లోతు తవ్వి బీమ్స్​ వేసి బిల్డింగ్​లు నిర్మించాలని చెప్పాడు. చేసుకోవాలని ఇందుకు ఎస్టిమేషన్​ రీవైజ్​ చేయాలని స్పష్టం చేశారు. దీంతో అప్పటి నుంచి పనులకు 
ఫుల్​ స్టాప్​ పడింది. 

మిగిలింది రూ.54 లక్షలే..

డీడీల రూపంలో 54 మంది రూ.4 లక్షల చొప్పున రూ.2.16 కోట్లు చెల్లించారు. ఈ డబ్బును మొత్తం టెంపుల్​ అకౌంట్​లో జమ అయ్యాయి. ఇప్పటి వరకూ చేసిన పనుల బడ్జెట్​ పోను అకౌంట్లో కేవలం రూ.54 లక్షలు మాత్రమే మిగిలినట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న ట్రేడర్లు ఇటీవల కొత్తగా ఎన్నికైన ఆలయ చైర్మన్​ను సంప్రదించగా ఆయన కూడా టెంపుల్​ అకౌంట్​లో రూ.54 లక్షలు మాత్రమే మిగిలున్నాయని చెప్పినట్లు తెలిసింది.

అయితే, ఇంత వరకు ఫేజ్​–1లో 17 షాపులు బేస్​మెట్​ లెవెల్లో, ఫేజ్​–2లో 20 షాపులు స్లాబ్​ వరకు, ఫేస్​–3లో 17 షాపుల పనులు పిల్లర్ల వరకే జరిగాయి. ఈ పనులను చేసిన కాంట్రాక్టర్​ మధ్యలోపు పనులు ఆపేసి, మిగిలిన మేటీరియల్​ను తీసుకుపోయాడు. ఈయనకు బిల్లులు కూడా చేయలేదని తెలిసింది. కానీ, టెంపుల్​ అకౌంట్​ జమ చేసిన డోనర్ల పైసలు మాత్రం ఏం చేశారనే దానిపై ఎవరూ నోరు మెదపడం లేదు. దీనిపై డోనర్లు వారం కిందట పోలీసులకు కంప్లైంట్​ చేసేందుకు వెళ్లగా, అధికార పార్టీకి చెందిన ఓ లీడర్ డోనర్లను అక్కడి నుంచి పంపించాలని పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. 

పర్యవేక్షణ ఏదీ?

ప్రస్తుతం ఈ ఆలయానికి రెగ్యులర్​ ఈవో లేడు. దీంతో హైదరాబాద్​లోని సికింద్రాబాద్​లో ఉన్న లక్ష్మీనారాయణ టెంపుల్​ ఈవో కోమల్​కు ఈ ఆలయ ఈవోగా ఇన్​చార్జి బాధ్యత ఇచ్చారు. అలాగే నారాయణపేట జిల్లా మద్దూరు మండలం తిమ్మారెడ్డిపల్లిలో ఉన్న ఆలయానికి కూడా ఈయనే ఇన్​చార్జి. దీంతో సరైన పర్యవేక్షణ లేదని డోనర్లు అంటున్నారు. డోనర్ల షాపుల నిర్మాణాల విషయంపై ఆలయ సిబ్బందిని, ఎండోమెంట్​ ఆఫీసర్లను సంప్రదించినా అందరూ రూలింగ్​ పార్టీకి చెందిన లీడర్​ పేరునే చెబుతున్నారు. ఆయన చెప్పినట్లే చేస్తున్నామని, ఆయన సమక్షంలోనే తీర్మానాలు చేసినట్లు చెబుతున్నారు. కాంట్రాక్టర్​కు పెండింగ్​ బిల్లుల విషయం కూడా షాపుల నిర్మాణాలు పూర్తి అయ్యాకే చెల్లిస్తామని ఆయన ప్రకటన కూడా చేసినట్లు చెబుతున్నారు.

ఇంజినీర్లను ఇన్వాల్వ్​​ చేయలేదు

ఎండోమెంట్​ డైరెక్టర్​ నుంచి పనులు చేసుకోవాలని చెప్పినంక అప్పట్లో ఉన్న సిబ్బంది ఇంజినీర్​ సెక్షన్​ను షాపుల నిర్మాణాల విషయంలో ఇన్వాల్​ చేయలేదు. సాయిల్​ రేట్​ వ్యాల్యూ బాగోలేకున్నా, ఎస్టిమేషన్లు వేసిండ్రు.  పరిశీలించి ఎస్టిమేషన్లను రివైజ్డ్​​ చేశాం. వాటి ​ప్రకారం షాపుల నిర్మాణానికి రూ.3.50 కోట్లు అవుతుంది. - కోమల్​, ఈరప్పయ్య టెంపుల్​ ఇన్​చార్జి ఈఓ, దేవరకద్ర

ఆయిల్‌‌ పామ్‌‌ సాగును ప్రోత్సహించాలి

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : జిల్లాలో ఆయిల్‌‌ పామ్‌‌ తోటల పెంపకాన్ని ప్రోత్సహించాలని కలెక్టర్‌‌ పి. ఉదయ్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్ లో శనివారం ఉద్యాన వన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయిల్‌‌ పామ్‌‌ తోటల పెంపకం వల్ల రైతులకు అధిక ఆదాయం వస్తుందన్నారు.

2022 –- 23 సంవత్సరానికి జిల్లాలో 3వేల ఎకరాల్లో ఆయిల్‌‌ పామ్‌‌ తోటల పెంపకం లక్ష్యంగా తీసుకోగా, జూన్‌‌ నాటికి 238 మంది రైతులకు 1023.70 ఎకరాలకు సరిపడా మొక్కలు  డ్రిప్‌‌ సిస్టం పంపిణీ చేసినట్లు తెలిపారు. డ్రిప్ పరికరాలకు ఎస్సీ ఎస్టీ రైతులకు 100%, బీసీ, చిన్న, సన్న కారు రైతులకు 90%, ఇతరులకు 80 శాతం సబ్సిడీ ద్వారా అందజేస్తున్నట్టు  తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి యం. చంద్రశేఖర రావు, కొల్లాపూర్ డివిజన్ ఉద్యాన అధికారి ఎం. లక్ష్మణ్, ప్రియునిక్ కంపెనీ ప్రతినిధులు రాకేశ్​, శివ భార్గవ్, వినయ్ కుమార్ పాల్గొన్నారు. 

బతుకమ్మ సంబురాలకు అన్ని ఏర్పాట్లు చేయాలి

కలెక్టర్ ఎస్.వెంకట్ రావు 

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు:  బతుకమ్మ సంబురాలకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎస్. వెంకటరావు ఆదేశించారు. కలెక్టరేట్ లో అడిషన్ కలెక్టర్లు తేజస్ నందలాల్ పవార్, కె.సీతారామారావు సంబంధిత శాఖ ఆఫీసర్స్ తో సమీక్షించారు. జిల్లా పరిషత్ మైదానంలో బతుకమ్మ ఉత్సవాలను ప్రతిరోజు నిర్వహించాలని, లైటింగ్, తాగునీరు, మహిళలు బతుకమ్మలు ఆడేందుకు సర్కిళ్ళు,స్టేజ్ పబ్లిక్ అడ్రస్ సిస్టం, ఇతర అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ప్రతిరోజూ కొన్ని శాఖల ద్వారా బతుకమ్మలను ఏర్పాటు చేసి సాయంత్రం 5 గంటల నుంచి బతుకమ్మ ఆడాలని సంబురాలలో పాల్గొన్న వారికి ప్రతిరోజు మొదటి, రెండవ ,మూడవ బహుమతుల తో పాటు, రెండు కన్సోలేషన్ బహుమతులు కూడా ఇవ్వనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. 

  • లంచం అడిగితే కఠినంగా శిక్షించాలి
  • మంత్రి శ్రీనివాస్ గౌడ్ 

మహబూబ్ నగర్, వెలుగు: ప్రభుత్వ పథకాలకు ఆఫీసర్స్, దళారుల లంచం డిమాండ్ చేస్తే కఠినంగా శిక్షించాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పోలీసులను ఆదేశించారు. శనివారం మంత్రి పట్టణంలోని పలు వార్డుల్లో కొత్త పెన్షన్ల కార్డు, బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఒకప్పుడు 200 పెన్షన్ ఇచ్చే టైంలో వృద్దులకు భరోసా ఉండేది కాదని, ఇప్పుడు 2016 పెన్షన్ వల్ల ఎంతో సంతోషిస్తున్నారని అన్నారు.

ఇంకా అర్హులైన వారుంటే వారికి దశల వారిగా పెన్షన్లు అందజేస్తామని హామీ ఇచ్చారు. పట్టణంలో అభివృద్ది జరుగుతుంటే కొందరు ఓర్వలేక కుల,మతాల పేరుతో చిచ్చురేపాలని చూస్తారని, అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, మూడా చైర్మన్ గంజి వెంకన్న ముదిరాజ్, మున్సిపల్ చైర్మన్ కెసి నర్సిములు, మార్కెట్ కమిటీ చైర్మన్ రెహమాన్ పాల్గొన్నారు. 

38 క్వింటాళ్ల బియ్యం పట్టివేత

దంతనూర్ లో మరో 10 క్వింటాళ్లు

మదనాపురం, వెలుగు : మదనాపురం మండల కేంద్రంతో పాటు, దంతనూర్ లో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకొని సివిల్​ సప్లయ్​ అధికారులకు అప్పగించారు. ఈసందర్భంగా ఎస్సై మంజునాథ్​ రెడ్డి మాట్లాడుతూ.. మదనాపురానికి చెందిన ఎరుకలి పరుశరాములు శుక్రవారం రాత్రి ఓ ఆటోలో 38 క్వింటాళ్ల బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకొని స్టేషన్ కి తరలించారు. అలాగే దంతనూర్ గ్రామానికి చెందిన చుక్క మొగిలన్న 10 క్వింటాళ్ల బియ్యాన్ని శనివారం మధ్యాహ్నం అక్రమంగా   తరలిస్తుండగా పోలీసులు పట్టుకుని సివిల్ సప్లై అధికారులకు అప్పగించారు. ఎన్​ఫోర్స్​మెంట్​ డిప్యూటీ తహసీల్దార్ వేణుగోపాల్ ఫిర్యాదు మేరకు స్థానిక పోలీస్ స్టేషన్ ఇద్దరిపై కేసు నమోదు చేసినట్టు ఎస్పై తెలిపారు. 

మన ఊరు- మన బడి పనులు స్పీడప్​ చేయాలి

కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా

వనపర్తి, వెలుగు: మన ఊరు-- మన బడి పనులు వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్​లో శనివారం ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో 183 స్కూళ్లను ఈ స్కీం కింద గుర్తించామన్నారు.

దసరా పండగ కు పాఠశాలలకు సెలవులు ఉన్నందున పనులు పూర్తి చేయాలన్నారు. పనుల వివరాలను ఎప్పటికప్పుడు రికార్డులలో నమోదు చేయాలని ఆమె తెలిపారు. పాఠశాలలు రీఓపెన్​ అయ్యేనాటికి పనులన్నీ అయిపోవాలన్నారు. ఈ సమావేశంలో కార్యక్రమంలో జడ్పీసీఈఓ. వెంకట్ రెడ్డి, సీపీఓ. వెంకట రమణ, పంచాయతి రాజ్ ఈఈ. మల్లయ్య, డీఈవో రవీందర్, డీఆర్డీఓ నరసింహులు, ఎస్సీ అభివృద్ధి అధికారి మల్లికార్జున్ పాల్గొన్నారు.

చిరుతల కోసం పోలీసుల గాలింపు

ధన్వాడ, వెలుగు : మండలంలోని మణిపూర్​తండాలోని మూడు చిరుతలు సంచరిస్తున్నాయని పోలీసులు ప్రకటించడంతో శనివారం ఫారెస్టు, పోలీసులు అధికారులు కలిసి తండా సమీపంలో గాలింపు చర్యలు చేపట్టారు. ఏఎస్సై వెంకటేశ్వర్లు శుక్రవారం రాత్రి తాము చిరుతలు చూసిన స్థలాన్ని ఫారెస్టు అధికారులకు సూచించారు. నేల ఎండిపోవడంతో చిరుతలకు ఆనవాల్లు లభించలేదు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ కొండాపూర్, కిష్టాపూర్​కు వెళ్లే రైతులు రాత్రి వేళల్లో ఆప్రమత్తంగా ఉండాలని, రాత్రి ఏడు తర్వాత ప్రయాణాలు తగ్గించుకోవాలన్నారు. చిరుతలు సంచరించిన స్థలంలో త్వరలో హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేయిస్తమన్నారు. పోలీసులు రామకృష్ణ, బీట్​ ఆఫీసర్లు మల్లేశ్​, నవీన్​కుమార్​ పాల్గొన్నారు.

పూలే ఆశయ సాధనకు ఉద్యమించాలె..

ఐఎఫ్​టీయూ జిల్లా ప్రెసిడెంట్ కిరణ్ 

మక్తల్, వెలుగు. జ్యోతిరావు ఫూలే ఆశయ సాధనకు ప్రతి ఇక్కరు కృషి చేయాలని ఐ ఎఫ్​టీయూ జిల్లా ప్రెసిడెంట్ కిరణ్ అన్నారు. మున్సిపల్ ఆఫీఎస్​ వద్ద 149 ‘సత్యశోధక్ సమాజ్ స్థాపన దినోత్సవం’ సందర్భంగా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుల వ్యవస్థ వల్లే దేశంలో వివక్ష, అంటరానితనం, అణిచివేత, అత్యాచారాలు జరుగుతున్నాయన్నారు. జ్యోతిరావు పూలే భారతదేశంలో కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేశారన్నారు. ఆయన ఆశయాలను సాధించాలని, అందుకు అందరూ ఉద్యమించాలన్నారు. కార్యక్రమంలో లీడర్లు ఈశ్వరయ్య, గంగన్న, ఆశన్న, రవి, బండారి బాలు, కృష్ణయ్య, మహేశ్వరమ్మ పాల్గొన్నారు. 

ప్రజావ్యతిరేక విధానాలపై సీపీఎం నాయకుల నిరసన

ఆలంపూర్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసిస్తూ అలంపూర్ మండల కేంద్రంలోని గాంధీ చౌక్ దగ్గర సీపీఎం మండల కమిటీ అధ్వర్యంలో శనివారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు దేవదాస్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అధిక ధరలు పెంచి పేద ప్రజలను ఇబ్బంది పెడుతోందని అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని నేటికీ అమలు చేయడం లేదని ఎద్దేవా చేశారు. కేంద్రం
 ఇప్పటికైనా ప్రజావ్యతిరేక విధానాలు మానుకోవాలన్నారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి నరసింహ, బంగారు రఫీ, నాయకులు పుల్లన్న, వెంకటస్వామి, వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు మంద భాస్కర్, భవన నిర్మాణ రంగం నాయకుడు రాజేశ్ తదితరులు  పాల్గొన్నారు. 

78 మంది యువకుల రక్తదానం

అమనగల్లు, వెలుగు : కల్వకుర్తి నియోజకవర్గ బీజేవైఎం ఆధ్వర్యంలో శనివారం రక్తదాన శిబిరం నిర్వహించారు. జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. శిబిరంలో 78 మంది యువకులు రక్తదానం చేయగా నిమ్స్ ఆస్పత్రికి అందించారు. మోడీ పుట్టిన రోజు సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో బీజేవైఎం రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు యాదిష్, మున్సిపల్ చైర్మన్ రాంపాల్ నాయక్, నాయకులు కండే హరిప్రసాద్, శేఖర్ రెడ్డి, పద్మ అనిల్ పాల్గొన్నారు. 

మంత్రాలు చేస్తుందని అనుమానంతో వృద్ధురాలిపై కత్తితో దాడి

నాగర్​కర్నూల్​, వెలుగు : తన అనారోగ్యానికి చేతబడే కారణం అనే అనుమానంతో  ఆ వృద్ధురాలిపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన కోడేరు మండలం మైలారం గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మైలారానికి చెందిన బాలశేషు తరచుగా అనారోగ్యం పాలవుతున్నాడు. దీనికి కారణం తన పెద్దమ్మ బాలమ్మ మంత్రాలు చేస్తోందని అనుమానించాడు. దీంతో రాత్రి నిద్రిస్తున్న టైంలో బాలమ్మపై కత్తితో దాడి చేశారు. బాలమ్మ చేతులు అడ్డంపెట్టడంతో చేతులు, గొంతుకు గాయాలయ్యాయి. వృద్ధురాలు అరవడంతో బాలశేషు పరారయ్యాడు. కుటుంబీకులు బాధితురాలిని కొల్లాపూర్​ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాలమ్మ పెద్ద కొడుకు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.