సంపాదనలో ఇంకా వెనకే ఉన్న దేశం

సంపాదనలో ఇంకా వెనకే ఉన్న దేశం
  • ఇండియా ఈసారి లోయర్ మిడిల్ కంట్రీనే
  • వరల్డ్ బ్యాంకు 2020 జాబితా విడుదల
  • అప్పర్‌ మిడిల్ కు శ్రీలంక..మరో ఐదు దేశాలూ
  • హయ్యర్‌ నుంచి అప్పర్‌ మిడిల్ కు అర్జెంటినా

న్యూఢిల్లీ: ‘మా తాత చెప్పాడు ఇండియా అభివృద్ధి చెందుతున్న దేశమని. మా నాన్న చెప్పాడు మనది అభివృద్ధి చెందుతున్న దేశమని. ఇప్పడు మనమూ ఇదే చెబుతున్నాం. రేపు మన పిల్లలూ ఇదే చెబుతారు’ ఓ హిట్‌ సినిమా డైలాగ్‌ ఇది. పోను పోను ఇదే నిజమయ్యేలా కనిపిస్తోంది. ఇన్‌కమ్‌ ప్రకారం దేశాలను వర్గీకరించే వరల్డ్‌ బ్యాంకు 2019 జులై 1న విడుదల చేసిన జాబితా దీన్ని బలపరుస్తోంది. 2020 ఆర్థిక సంవత్సరానికి ప్రపంచంలోని 47 లోయర్‌ మిడిల్‌ ఇన్‌కమ్‌ దేశాల లిస్టులో ఇండియా ఉంది. మన పక్కనున్న శ్రీలంక మాత్రం అప్పర్‌ మిడిల్‌ క్లాస్‌లో చేరింది. 1999లో లోయర్‌ మిడిల్‌ క్లాస్‌ ఇన్‌కమ్‌ గ్రూప్‌లో ఉన్న లంక 2009 వరకు ఆ జాబితాలోనే ఉంది. ఒక్క దశాబ్దంలో మంచి అభివృద్ధి సాధించింది. ఇండియా మాత్రం 2009 నుంచి లోయర్‌ మిడిల్‌ ఇన్‌కమ్‌ కంట్రీగానే ఉంది.

ఐదు దేశాలు అప్పర్​ మిడిల్​కు

శ్రీలంకతో పాటు మరో ఆరు దేశాలు అర్జెంటినా, కొమొరోస్‌, జార్జియా, కొసొవొ, సెనెగల్‌, జింబాంబ్వేలు కూడా లిస్టు మారాయి. అర్జెంటినా హయ్యర్‌ ఇన్‌కమ్‌ నుంచి అప్పర్‌ మిడిల్‌ జాబితాలో చేరింది. మిగిలినవన్నీ పై లిస్టుల్లో చోటు సంపాదించాయి. కొమొరోస్‌, సెనెగల్‌, జింబాంబ్వే ‘లో ఇన్‌కమ్‌’ నుంచి లోయర్‌ మిడిల్‌ ఇన్‌కమ్‌కు.. శ్రీలంక, జార్జియా, కొసొవొ లోయర్‌ మిడిల్‌ నుంచి అప్పర్‌ మిడిల్‌కు అప్‌డేట్‌ అయ్యాయి.

బ్రిక్స్‌లో ఇండియానే లాస్ట్‌

దక్షిణ ఆసియాలో అప్పర్‌ మిడిల్‌లో ఉన్నవి రెండే రెండు. మాల్దీవులు (రూ.6.36 లక్షలు), శ్రీలంక (రూ.2.77 లక్షలు). భూటాన్‌ (రూ.2.10 లక్షలు), ఇండియా (రూ.1.38 లక్షలు), బంగ్లాదేశ్‌ (రూ.1.19 లక్షలు), పాకిస్థాన్‌ (రూ.1.08 లక్షలు) లోయర్‌ మిడిల్‌లో ఉన్నాయి. అఫ్ఘానిస్థాన్‌ (రూ.37 వేలు), నేపాల్‌ (రూ. 65 వేలు)తో లోయర్‌ ఇన్‌కమ్‌ గ్రూప్‌లో ఉన్నాయి. బ్రిక్స్‌ దేశాల్లో లోయర్‌ మిడిల్‌ గ్రూప్‌లో ఉన్న ఒకే ఒక్క దేశం ఇండియా. బ్రెజిల్‌ (రూ.6.24 లక్షలు), రష్యా (రూ.6.99 లక్షలు), చైనా (రూ.6.47 లక్షలు), సౌత్‌ ఆఫ్రికా (రూ.3.91 లక్షలు) అప్పర్‌ మిడిల్‌లో ఉన్నాయి.

ఏటా జులై 1న

ప్రపంచబ్యాంకు ప్రస్తుత లెక్కల్లో స్థూల జాతీయ ఆదాయం (జీఎన్‌ఐ), తలసరి ఆదాయం (పర్‌ క్యాపిటా)ను లెక్కగట్టి ఈ జాబితా విడుదల చేస్తుంటుంది. నాలుగు ఇన్‌కమ్‌ గ్రూప్‌లను బ్యాంకు విడుదల చేస్తుంది. రూ.70 వేల కన్నా తక్కువుంటే లోయర్‌, రూ.70 వేల నుంచి రూ.2.73 లక్షల మధ్య ఆదాయం ఉంటే లోయర్‌ మిడిల్‌, రూ.2.73 లక్షల నుంచి రూ.8.45 లక్షలు ఉంటే అప్పర్ మిడిల్‌, రూ.46 లక్షల కన్నా ఎక్కువుంటే హయ్యర్‌గా దేశాలను విభజించింది. మొత్తం 218 దేశాల్లో 80 హయ్యర్‌ లిస్టులో, 60 అప్పర్‌ మిడిల్‌, 47 లోయర్‌ మిడిల్‌, 31 లో ఇన్‌కమ్‌ గ్రూప్‌లో ఉన్నాయి. ఈ జాబితాను ఏటా జులై 1న వరల్డ్‌ బ్యాంక్‌ అప్‌డేట్‌ చేస్తుంటుంది. జీఎన్‌ఐ పర్‌ క్యాపిటాను 2018 డేటా ప్రకారం లెక్కించింది.