
న్యూఢిల్లీ: భారతదేశ జీడీపీ వృద్ధి అంచనాను ప్రపంచ బ్యాంక్ పెంచింది. 2025--–26 ఆర్థిక సంవత్సరం కోసం ఇదివరకు వేసిన అంచనాను 6.3 శాతం నుంచి 6.5 శాతానికి పెంచింది. వినియోగం పెరుగుతున్నందున, భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఉంటుందని ప్రపంచ బ్యాంక్ తెలిపింది.
రిపోర్ట్ప్రకారం.. అమెరికా భారతీయ సరుకుల రవాణాపై 50 శాతం సుంకాలు విధించడం వచ్చే ఏడాది ప్రభావం చూపుతుంది. వ్యవసాయ ఉత్పత్తి, గ్రామీణ వేతన వృద్ధి అంచనా వేసిన దానికంటే మెరుగ్గా ఉన్నాయి. జీఎస్టీ తగ్గింపు, పన్నులను తగ్గించడం, కంప్లయెన్స్ను సులభతరం చేయడం వల్ల మేలు జరుగుతుంది.
భారతదేశ సరుకుల ఎగుమతుల్లో సుమారు మూడు వంతుల వాటిపై అమెరికా 50 శాతం సుంకాన్ని విధిస్తోంది కాబట్టే 2026–-27 ఆర్థిక సంవత్సరానికి వృద్ధి అంచనాను 6.5 శాతం నుంచి 6.3 శాతానికి తగ్గించామని ప్రపంచ బ్యాంక్ తెలిపింది. దక్షిణాసియాలో వృద్ధి 2025లో 6.6 శాతం నుంచి 2026 సంవత్సరంలో 5.8 శాతానికి పడిపోతుందని ఈ సంస్థ రిపోర్ట్ వివరించింది.