కోహ్లీని గెలికొద్దు.. ఏమీ అనకపోతేనే ఔటవుతాడు: బౌలర్లకు మాజీ దిగ్గజం హెచ్చరిక

కోహ్లీని గెలికొద్దు.. ఏమీ అనకపోతేనే ఔటవుతాడు: బౌలర్లకు మాజీ దిగ్గజం హెచ్చరిక

విరాట్ కోహ్లీని రెచ్చగొడితే..  దాని ఫలితం ఎలా ఉంటదో దాదాపు క్రికెట్ ఆడే అన్ని జట్లకు విదితమే. ఏ చిన్న మాట తుళ్లినా.. దాన్ని వెనక్కు ఇచ్చేదాకా కోహ్లీ నిద్రపోడు. ఈ క్రమంలో ప్రతిష్ఠాత్మక వరల్డ్ కప్‌ ముందు సౌతాఫ్రికా బౌలర్లకు ఆ జట్టు మాజీ పేసర్ మఖాయా ఎన్తిని హెచ్చరికలు జారీ చేశాడు. ఇండియాతో మ్యాచ్‌లో విరాట్ కోహ్లిని ఒక్క మాట కూడా అనకూడదని స్పష్టం చేశాడు. కాదని నోరు జారితే.. ఇక అంతే అంటూ వార్నింగ్ ఇచ్చారు.

రెవ్‌స్పోర్ట్స్ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఎన్తిని.. కోహ్లీని స్లెడ్జింగ్ చేస్తే అతను మరింత రెచ్చిపోయి ఆడిన సందర్భాలు  ఎన్నో ఉన్నాయని తెలిపారు. కావున అలాంటి ప్రయత్నాలు చేయవద్దని సౌతాఫ్రికా బౌలర్లకు విజ్ఞప్తి చేశారు. అతన్ని ఏమీ అనకపోతేనే బోర్ ఫీలై త్వరగా ఔటవుతాడని చెప్పుకొచ్చారు.

 "విరాట్ కోహ్లీకి స్లెడ్జింగ్ అంటే ఇష్టం. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్ల నుంచి అతను అదే కోరుకుంటాడు. కానీ మీరు అలా చేయకండి. అతనికి బౌలింగ్ చేసే ప్రతి సౌతాఫ్రికా బౌలర్‌కు ఒకటే చెబుతున్నా. అతను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఒక్క మాట కూడా అనొద్దు.  కోహ్లిని ఏ బౌలర్ స్లెడ్జ్ చేసినా అతడు తగిన మూల్యం చెల్లించాల్సిందే. అతని వలలో పడినట్లే.  అతన్ని ఏమీ అనకపోతే అతడే బోర్‌గా ఫీలై ఔటవుతాడు.." అని ఎన్తిని చెప్పుకొచ్చారు.

ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ భారత్ వేదికగా అక్టోబర్ 5 నుండి ప్రారంభం కానుంది. రౌండ్ రాబిన్ పద్ధతిలో జరగబోయే ఈ టోర్నీలో ప్రతి టీమ్..  మిగిలిన 9 మ్యాచ్‌లు ఆడుతుంది. అందులో భాగంగా ఇండియా- సౌతాఫ్రికా మ్యాచ్ నవంబర్ 5న జరగనుంది.