IND vs AUS Final: మోడీ స్టేడియానికి షాక్.. ఆ విషయంలోనూ ఆసీస్‌దే పై చేయి

IND vs AUS Final: మోడీ స్టేడియానికి షాక్.. ఆ విషయంలోనూ ఆసీస్‌దే పై చేయి

ప్రపంచ క్రికెట్ లో ఎక్కువ సీటింగ్ కెపాసిటీ ఉన్న స్టేడియంగా నరేంద్ర మోడీ స్టేడియానికి ఒక రికార్డ్ ఉంది. లక్ష 30 వేల మంది ప్రేక్షకులు ఈ మ్యాచ్ ను చూడొచ్చు. అందుకే వరల్డ్ కప్ ఫైనల్ కు ఈ వేదికనే ఫిక్స్ చేశారు. భారత్ వేదికగా వరల్డ్ కప్ జరగడం.. టీమిండియా ఫైనల్ కు రావడంతో ఈ స్టేడియం మొత్తం నిండిపోతుందని భావించారంతా. దీనికి తోడు ఆస్ట్రేలియా లాంటి పటిష్టమైన జట్టు ఫైనల్ కు రావడంతో ఈ మ్యాచ్ పై క్రేజ్ పెరిగిపోయింది. దీంతో ఫైనల్ రోజున ఈ స్టేడియం ఎక్కువ మంది ప్రేక్షకులతో రికార్డ్ సృష్టించేలా కనిపించింది. 

తాజాగా నరేంద్ర మోడీ స్టేడియానికి బిగ్ షాక్ ఇచ్చింది ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్. అదేంటో కాదు వరల్డ్ కప్ ఫైనల్లో అత్యధిక ప్రేక్షకులు వచ్చిన స్టేడియంగా ఇప్పటికీ పాత రికార్డ్ చెక్కు చెదరకుండా ఉంది. నవంబర్ 19 (ఆదివారం) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన వన్డే ప్రపంచ కప్ 2023 ఫైనల్ మ్యాచ్‌కు 92,453 మంది హాజరయ్యారు. అయితే వన్డే వరల్డ్ ఫైనల్‌కు ఆస్ట్రేలియాలోని MCGలో ఎక్కువ మంది ప్రేక్షకులు హాజరవ్వడం విశేషం. 2015 లో ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ జట్ల మధ్య జరిగిన   ఫైనల్లో ఈ స్టేడియంలో 93,013 మంది ఈ మ్యాచ్ చూడడానికి వచ్చారు.

ఓ వైపు వరల్డ్ కప్ గెలిచి జోష్ లో ఉన్న ఆస్ట్రేలియా ఈ విషయంలోనూ భారత్ ను వెనక్కి నెట్టింది. మెల్ బోర్న్ స్టేడియంలో లక్ష సీటింగ్ కెపాసిటీతో పాటు ఈ మైదానం ప్రపంచ క్రికెట్ లో పెద్దది. బౌండరీ దూరం దాదాపు 80 మీటర్లు ఉంటుంది. ఈ గ్రౌండ్ లో ఫీల్డింగ్ చేయడం చాలా కష్టం. ప్రతిష్టాత్మక ఫైనల్ మ్యాచ్ లు, కీలక న్యచ్ లు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఇక్కడే నిర్వహిస్తుంది.  మొత్తానికి నిన్న మోడీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ కన్నా.. 8 ఏళ్ళ క్రితం మెల్ బోర్న్ స్టేడియంలో జరిగిన ఫైనల్ కు క్రేజ్ ఎక్కువగా ఉండడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 

ఇక నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్ విషయానికి వస్తే భారత్ పై ఆస్ట్రేలియా సునాయాస విజయం సాధించింది. మొదట మొదట బౌలింగ్   ,  ఆ తర్వాత బ్యాటింగ్ లో సమిష్టిగా రాణించి 6 వికెట్ల తేడాతో ఆరోసారి విశ్వ విజేతగా నిలిచింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్(137; 120 బంతుల్లో 15 ఫోర్లు, 5 సిక్స్ లు) మార్నస్ లబుషేన్( 58 నాటౌట్; 110 బంతుల్లో 4 ఫోర్లు) 192 పరుగుల భాగస్వామ్యంతో మ్యాచ్ ను భారత్ నుండి లాగేసుకున్నారు.