మద్యం ప్రియులకు 7 రకాల క్యాన్సర్ల గండం.. డబ్ల్యూహెచ్​వో షాకింగ్​ న్యూస్​

మద్యం ప్రియులకు 7 రకాల క్యాన్సర్ల గండం.. డబ్ల్యూహెచ్​వో షాకింగ్​ న్యూస్​

వాషింగ్టన్ : మద్యం తాగే వాళ్లకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​వో) షాకింగ్​ న్యూస్​ చెప్పింది. శరీరంలోకి ఒక్క చుక్క ఆల్కహాల్​ పోయినా క్యాన్సర్​ బారినపడ్తారని హెచ్చరించింది. ప్రఖ్యాత మెడికల్​ జర్నల్​ ‘ది లాన్సెట్’ లో దీనికి సంబంధించిన కథనం ప్రచురితమైంది. తక్కువగా ఆల్కహాల్​ తాగితే ఆరోగ్యానికి ఇబ్బంది కలగదనే భరోసా ఏదీ లేదని డబ్ల్యూహెచ్​వో  నాన్​ కమ్యూనికబుల్​ డిసీజెస్​ విభాగానికి తాత్కాలికంగా  నేతృత్వం వహిస్తున్న  డాక్టర్​ క్యారినా ఫెరీరా బోర్గెస్​ స్పష్టం చేశారు. ఒక మోస్తరు స్థాయిలో మద్యం తాగితే  ఆరోగ్యానికి ఎలాంటి నష్టం ఉండదనే భావన సరికాదన్నారు.  ‘‘ ఫ్రాన్స్​ కేంద్రంగా పనిచేసే ఇంటర్నేషనల్​ ఏజెన్సీ ఫర్​ రీసెర్చ్​ ఆన్​ క్యాన్సర్​ ప్రకారం.. గ్రూప్​ 1 కార్సినోజెన్స్​ కేటగిరీలో ఆల్కహాల్​ కూడా ఉంది. ఇదే కేటగిరిలో ఆస్బెస్టాస్​, రేడియేషన్​, టొబాకో వంటివి ఉన్నాయి. దీన్నిబట్టి అత్యధిక క్యాన్సర్​ ముప్పును కలిగించే పానీయంగా ఆల్కహాల్​ ను పరిగణించవచ్చు”అని తాజా ప్రకటనలో డబ్ల్యూహెచ్​వో వివరించింది. 

వైన్​, బీర్, రెడ్​ వైన్ ​తాగినా.. 

వైన్​, బీర్, రెడ్​ వైన్​ వంటి ఆల్కహాలిక్​ డ్రింక్స్​తాగితే ప్రధానంగా 7 రకాల క్యాన్సర్లు చుట్టుముట్టే ముప్పు ఉంటుందంటూ  తాజాగా ‘హెల్త్​ లైన్​’ వెబ్​ సైట్​ లోనూ ఒక అధ్యయన నివేదిక ప్రచురితమైంది.  ఆ డ్రింక్స్​ వల్ల గొంతు, రొమ్ము, కాలేయం, పెద్ద పేగు, ఆహార నాళాలకు సంబంధించిన క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంటుందని హెచ్చరించారు.  ఆల్కహాల్​ అలవాటున్న చాలా మంది అమెరికాలో వివిధ రకాల క్యాన్సర్లతో బాధపడుతున్నారని నివేదికలో ప్రస్తావించారు. నేషనల్​ క్యాన్సర్​ ఇన్​ స్టిట్యూట్​ ఆఫ్​ అమెరికాకు చెందిన అసోసియేట్​ డైరెక్టర్​ విలియం ఎం.పి.క్లెయిన్​ సారథ్యంలోని నిపుణుల బృందం అధ్యయనంలో ఈవిషయాలు వెల్లడయ్యాయి. ఆల్కహాల్​ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందనే అపోహలో చాలామంది ఉంటారని, అయితే అది ఎంతమాత్రం వాస్తవం కాదని రీసెర్చ్​ టీం తేల్చి చెప్పింది.  వైన్​, బీర్, రెడ్​ వైన్​​తాగినా క్యాన్సర్​ ముప్పు ముసురుకుంటుందని వార్నింగ్​ ఇచ్చింది.  అన్ని రకాల ఆల్కహాలిక్​ డ్రింక్స్​కు దూరంగా ఉంటేనే క్యాన్సర్​ గండం బారిన పడకుండా రక్షణ పొందొచ్చని సూచించింది. 

ఏటా 10 లక్షల మందికిపైగా..

ఏటా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది క్యాన్సర్​ తో ప్రాణాలు కోల్పోతున్నారు. 2020 సంవత్సరంలో 10 లక్షల మందికిపైగా ప్రజల ప్రాణాలను క్యాన్సర్​ మహమ్మారి హరించింది. ఇలా చనిపోయిన వారిలో ఎక్కువ మంది  రొమ్ము, ఊపిరితిత్తులు, పెద్దపేగు, పురీష నాళం (రెక్టమ్​), ప్రొస్టేట్​ క్యాన్సర్ల బాధితులేనని తాజా నివేదికలు చెబుతున్నాయి.
--