
నవంబర్ 19 (శనివారం)న ప్రపంచ వారసత్వ వారోత్సవాల ప్రారంభాన్ని దృష్టిలో ఉంచుకుని నేడు ఆగ్రాలోని తాజ్ మహల్ ఎంట్రీకి ఎలాంటి రుసుము వసూలు చేయమని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ట్వీట్ చేసింది. వరల్డ్ హెరిటేజ్ వీక్ ప్రారంభం సందర్భంగా ప్రతీ ఏడాదిలాగే ఈ సారీ.. అన్ని స్మారక చిహ్నాల వద్ద ఉచితంగా ప్రవేశం కల్పించనున్నారు. ఈ సంవత్సరం కూడా నవంబర్ 19 నుండి 25 వరకు ఈ వారోత్సవాలను జరపనున్నారు. అందులో భాగంగా తాజ్ మహల్, ఆగ్రా ఫోర్ట్, ఫతేపూర్ సిక్రి లాంటి ఇతర స్మారక కట్టడాలను సందర్శించేందుకు వచ్చే పర్యాటకులందరికీ నేడు ఉచితంగా ప్రవేశం కల్పించనున్నారు.
అయితే.. తాజ్ మహల్ లో ప్రవేశం ఉచితం...స్మారక చిహ్నం లోపల ఉన్న ప్రధాన సమాధిని సందర్శించడానికి మాత్రం రూ.200 టికెట్ కొనుగోలు చేయాలని సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్ట్ (ఆగ్రా సర్కిల్) రాజ్ కుమార్ పటేల్ స్పష్టం చేశారు. ప్రపంచ వారసత్వ వారోత్సవాల సందర్భంగా స్మారక చిహ్నాల వద్ద ఎప్పటిలాగే సాంస్కృతిక కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పటేల్ తెలిపారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా ప్రపంచ వారసత్వ కట్టడాలపై పుస్తకాలను ప్రచురించడం, పెయింటింగ్ పోటీలు, యువతను, పిల్లలను హెరిటేజ్ వాక్ లో భాగస్వామ్యం చేస్తుంటామన్నారు.